వీర్రాజు కొత్త వ్యూహాలు.. రాజకీయాన్ని మలుపు తిప్పుతారా?

ABN , First Publish Date - 2020-09-25T17:07:41+05:30 IST

ఏపీలో రెండు పార్టీలు, రెండు కులాలుగా సాగిపోతున్న రాజకీయాన్ని మరో మలుపు తిప్పేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందా? ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు...

వీర్రాజు కొత్త వ్యూహాలు.. రాజకీయాన్ని మలుపు తిప్పుతారా?

ఏపీలో రెండు పార్టీలు, రెండు కులాలుగా సాగిపోతున్న రాజకీయాన్ని మరో మలుపు తిప్పేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందా? ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారా? తన సామాజిక వర్గం నుంచే ఈ ప్రయత్నం ప్రారంభించి త్వరలో దీనికి ఓ రూపు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారా? కాపు రాజకీయాన్ని బీజేపీ ఇకమీదట జనసేనతో కలిసి బలంగా చేయబోతుందా? ఇంతకీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యూహాలు ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం..


ఏపీలో జనాభా పరంగా మెజారిటీ ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాపు సామజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఆయన కాపు ఓట్ల సమీకరణపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో తమ బలం, బలగం ఏంటన్న దానిపై స్పష్టత కలిగిన సోము వీర్రాజు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు ఇప్పటికే చిరంజీవితో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ముద్రగడ వంటి కాపు నేతలను తనకు సహకరించాలని కోరడం ద్వారా కొత్త సమీకరణాలకు తెరలేపారు. ఉభయగోదావరి జిల్లాల్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సోమువీర్రాజు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక్కడి కాపు నాయకులను ఆకర్షించే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


కాపు నేత సీఎం అవుతారని...

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను, క్రియాశీల కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పార్టీలో చేరాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కాపు నేతలకు సోము వీర్రాజు టీం నుంచి ఫోన్లు వెళ్తున్నాయట. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని..కాపు నేత సీఎం అవుతారని చెబుతున్నారట. ఇప్పుడు పార్టీలోకి వస్తే తగిన గుర్తింపుతో పాటు పదవులు ఇస్తామని ఆశల వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ రాష్ట్ర స్థాయి నేతను బీజేపీ నేతలు కలిసి సంప్రదింపులు జరిపారట. పార్టీలో చేరితే అత్యున్నత స్థాయి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చేశారట. కానీ సదరు నాయకుడు కమలనాధుల ప్రతిపాదనకు ముఖం మీదే నో చెప్పేసినట్లు లోకల్‌గా టాక్‌ వినిపిస్తోంది. అలాగే టీడీపీలో అధికంగా ఉన్న కోనసీమ కాపు నేతలకు బీజేపీలో చేరాలని పదే పదే ఫోన్లు వస్తున్నట్లు మరో చర్చ జరుగుతోంది. రాబోయే కాపు ప్రభుత్వంలో అన్ని విధాలా ఆదుకుంటామని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మీకే నష్టమని కూడా చెబుతున్నారట. ఇలా కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో టీడీపీ దిగువ క్యాడర్ లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆపరేషన్‌ ఆకర్ష్ ప్రయోగిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 


ఆ రెండు జిల్లాలపై వీర్రాజు ఫోకస్..

గతంలో బీజేపీ పవనాలు వీచినప్పుడు కాకినాడ, రాజమండ్రి, నర్సాపురంలో ఆ పార్టీ గెలిచింది. కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మర్చుకునే ప్రయత్నం చేస్తున్న కమలం పార్టీ..పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతర్వేదిలో రథం తగులబడిన ఘటనపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక గోదావరి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాసమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలపై పోరాటాలు చేయడం ద్వారా జనాల దృష్టిని ఆకర్షించాలన్నది ఎత్తుగడగా కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు ఎగసిపడుతుండటంతో..ఉభయ గోదావరి జిల్లాలపై సోము ఫోకస్‌ చేసినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ క్యాడర్‌కు సోము వీర్రాజు పిలుపునిస్తున్నారట. జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ప్రజాక్షేత్రంలో ముమ్మర పోరాటాలు చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-09-25T17:07:41+05:30 IST