బెడిసికొట్టిన TRS వ్యూహం.. రేవంత్ రెడ్డి ఎలా చక్కదిద్దుతారో..!?

ABN , First Publish Date - 2021-07-18T19:44:15+05:30 IST

బెడిసికొట్టిన TRS వ్యూహం.. రేవంత్ రెడ్డి ఎలా చక్కదిద్దుతారో..!?...

బెడిసికొట్టిన TRS వ్యూహం.. రేవంత్ రెడ్డి ఎలా చక్కదిద్దుతారో..!?

కౌశిక్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిందా? ఆడియో లీక్ అవ్వడంతో కౌశిక్‌రెడ్డి పొలిటికల్ కెరీర్ రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుందా? ఆయన తీరు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తల నొప్పిగా మారిందా? పార్టీ నుంచి బహిష్కరణకు సిద్ధం అయిన కాంగ్రెస్ హుజురాబాద్‌లో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కాంగ్రెస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోందనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


ఒకవేళ చివరిక్షణంలో..

కౌశిక్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తోంది. టిఆర్ఎస్ పార్టీలో తనకు టికెట్ కన్‌ఫాం అయినట్లు కౌశిక్ రెడ్డి మాట్లాడిన టేపులు బయటకు రావడం హస్తం పార్టీలో అలజడి  రేపుతోంది. అధికార పార్టీతో అంతర్గతంగా సంబంధాలు సాగిస్తున్నట్లు బలమైన ఆధారాలు లభించడంతో టీపీసీసీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనలతో క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపించింది. సమాధానం కోసం వేచి చూసి పార్టీ నుంచి బహిష్కరించడానికే టీపీసీసీ పెద్దలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ చివరిక్షణంలో ఏదైనా జరిగి పార్టీలో కొనసాగినా ఇక కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు మాత్రం లేవని కాంగ్రెస్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.


చేతులారా చేసుకున్నారా..!

ఈటెల రాజేందర్ బర్తరఫ్ తరువాత నుంచి కౌశిక్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఆయన చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఆరోపణలు, విమర్శల్లో మరింత దూకుడు పెంచారు. అయితే ఓవైపు ఈటలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతుండగానే కౌశిక్ రెడ్డి ఆయనపై ఆరోపణలతో విరుచుకుపడటం అప్పట్లో పార్టీలో పెద్ద చర్చకే దారి తీసింది. కౌశిక్ రెడ్డి పార్టీలైన్ దాటి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. టీఆర్ఎస్ డైరెక్షన్‌లోనే కౌశిక్ రెడ్డి ఈటలపై ఆరోపణలు గుప్పించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దానికి తోడు జూన్ 11న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి కేటీఆర్‌ను కలవడం ఆయన టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారన్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేటీఆర్‌ను కలవడం యాధృచ్చికంగా జరిగిందే తప్ప అందులో రాజకీయానికి తావు లేదని వివరణ ఇచ్చుకున్నారు. తాను కాంగ్రెస్ అభ్యర్ధిగానే హుజురాబాద్‌లో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. జూన్ 12న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఇదే విషయం పై వివరణ ఇచ్చుకున్నారు.


రెంటికీ చెడ్డ రేవడిలా..!

రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్‌ కావడంతో  కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. తటస్తులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే రేవంత్ ఇమేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా కౌశిక్ రెడ్డిని తమపార్టీలో చేర్చు కోవడానికి సిద్ధం అయినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే డీల్ కుదిరిందనే చర్చ ఉంది. అయితే ఎన్నికల ముంగిట కౌశిక్‌ను  కారెక్కించి రేవంత్‌ను డిఫెన్స్‌లో పడేయాలనే స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు కౌశిక్‌ను కోవర్ట్ ఆపరేషన్స్‌కు ఉపయోగించుకునేలా ప్లాన్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే చాలా మంది స్థానిక ప్రజాప్రతినిధులను ఆయనే టిఆర్ఎస్‌లోకి పంపించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంత అనుకున్నట్టే జరుగుతోందని భావిస్తున్న సమయంలో ఆడియో లీక్ అవ్వడంతో టిఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టిందనే చర్చ జరుగుతోంది. ఇక టిఆర్ఎస్ సైతం తాము ఎవరికి టికెట్ హామీ ఇవ్వలేదని ప్రకటనలు చేస్తోంది. దాంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుందని విశ్లేషిస్తున్నారు.


అప్పుడు అనుమానం.. ఇప్పుడు ఆడియో!

అయితే ఆయనపై ఇంకా అనుమానపు చూపులు తొలిగిపోకముందే ఆయన మాట్లాడిన ఆడియో సంచలనంగా మారింది. నియోజకవర్గానికి చెందిన ఓ స్థానిక నేతకు ఫోన్ చేసి టిఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫర్మ్ అయినట్లు కౌశిక్‌ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ హుజురాబాద్  ఉప ఎన్నికలకు అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 62వేలకు పై చిలుకు ఓట్లు సాధించారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి పోటీచేస్తుండటంతో టిఆర్ఎస్ ఓట్లు చీలిపోయాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను తాను సాధించగలిగితే విజయావకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.


రేవంత్‌కు ఝలక్ ఇవ్వడానికేనా..!?

కౌశిక్‌ రెడ్డి ఎపిసోడ్ టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తలనొప్పిగా మారింది. కౌశిక్ రెడ్డి మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కు సమీప బంధువు. గత ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డినే ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇప్పించారనే పేరుంది. ఉత్తమ్‌కు తెలియకుండా కౌశిక్ ఏమి చేయరని ప్రచారం కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన ఉత్తమ్‌కు తెలియకుండానే టిఆర్ఎస్‌లోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక కౌశిక్ రెడ్డి కోసమే ఈటెల రాజేందర్‌ను కాంగ్రెస్‌లోకి  తీసుకురావడానికి ఉత్తమ్ పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదని విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఉత్తమ్‌కు రేవంత్ వ్యతిరేక వర్గంగా ముద్ర ఉంది. అధ్యక్షునిగా ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికల్లోనే రేవంత్‌కు ఝలక్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డిని కారు పార్టీకి పంపించే ఏర్పాటు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఉత్తమ్ వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యవహారానికి ఉత్తమ్‌కు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు.


రేవంత్ ఎలా చక్కదిద్దుతారో..?

ఏదేమైనా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. కౌశిక్‌ వ్యవహారం తెరపైకి రావడంతో అప్పుడే అన్వేషణ మొదలు పెట్టింది. టీడీపీలో ఉండగా మంచి పరిచయం ఉన్న పెద్దిరెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి కొత్త పీసీసీ బాస్‌ రేవంత్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా  పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అప్పగించారు. అయితే కోవర్ట్ ఆపరేషన్‌తో కాంగ్రెస్‌కు కొంత డ్యామేజ్ అయినట్లు అంచనా వేస్తున్నారు. మరి అక్కడి పరిస్థితులను రేవంత్ రెడ్డి ఎలా చక్కదిద్దుతారో అని అటు కాంగ్రెస్‌లోనే కాదు ప్రత్యర్థి పార్టీలు ఎదురుచూస్తున్నాయి.



Updated Date - 2021-07-18T19:44:15+05:30 IST