ఏపీ కమలనాథులకు ఢిల్లీ పెద్దలు క్లాస్.. ఆయనకు గట్టిగానే అక్షింతలు..!?

ABN , First Publish Date - 2021-01-15T15:48:38+05:30 IST

ఏపీ కమలనాథులకు ఢిల్లీ పెద్దలు క్లాస్.. ఆయనకు గట్టిగానే అక్షింతలు..!?

ఏపీ కమలనాథులకు ఢిల్లీ పెద్దలు క్లాస్.. ఆయనకు గట్టిగానే అక్షింతలు..!?

ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో రాముడి శిరశ్ఛేధనం జరిగినా గట్టిగా స్పందించలేదు. తెలుగుదేశం అధినేత వెళ్లొచ్చాక మనం స్పందించటం ఏమిటి..? వారికన్నా ముందే కార్యాచరణను ఎందుకు ప్రకటించలేకపోయాం..? ఇలా అయితే ప్రతిపక్షంగా ఎదగటం చాలా కష్టమవుతుందని బీజేపీ హైకమాండ్ పెద్దలు రాష్ట్ర నేతలకు తలంటారట. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారని గట్టిగా క్లాస్‌ పీకారట. ఢిల్లీ పెద్దల యాక్షన్‌కు రాష్ట్ర నేతల్లో రియాక్షన్‌ మొదలైందా? ఇలాంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం.


ప్రకటనలకే పరిమితం..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై వరుస దాడులు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం సెగ కేంద్రానికి కూడా తగిలింది. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై బీజేపీ సంఘాలు ధీటుగానే స్పందించినప్పటికీ..ఆ తర్వాత జరుగుతోన్న ఆలయాలు, విగ్రహాల ధ్వంసం సంఘటనలపై స్పందన అంతంత మాత్రంగానే ఉందని ఆ పార్టీ హైకమాండ్‌కు సమాచారం అందిదట. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగించడంపై పెద్ద ఎత్తున నిరసన ప్రారంభమైంది. ఈ ఘటనపై మొదట హిందూ సంఘాలు స్పందించినా.. కమలం పార్టీ నేతలు తొలుత ప్రకటనలకే పరిమితమయ్యారు. గత నెల 28న రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే..బీజేపీ, జనసేన సంయుక్త కార్యాచరణ జనవరి 5నాటికి కానీ ప్రారంభంకాలేదు.


టీడీపీకి మైలేజ్..!

అయితే జనవరి 2న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం పర్యటనకు వెళ్లారు. అదే రోజు విజయసాయిరెడ్డి కూడా పోటీగా రామతీర్థానికి బయల్దేరడంతో అసలు రగడ ప్రారంభమైంది. కొండపైకి వెళ్లి దిగివస్తున్న విజయసాయిరెడ్డి, వైసీపీ శ్రేణులపై వాటర్ ప్యాకెట్లు, చెప్పులు విసిరిన సంఘటన సంచలనం రేకెత్తించింది. విజయసాయిరెడ్డి పర్యటనతో అక్కడ రచ్చగా మారడం.. చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం..కొండపైకి వెళ్లినా గుడిలోకి వెళ్లకుండా తాళాలు వేయడం.. తదితర పరిణామాలు టీడీపీకే మైలేజ్‌ పెంచాయన్నది రాజకీయ పరిశీలకుల మాట. దీనికితోడు తెలుగుదేశం అగ్రనేతలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుపై విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.


గట్టిగా చురకలు..!

మొత్తంగా రామతీర్థం ఘటనకు సంబంధించి చంద్రబాబు అక్కడకు వెళ్లటంతో ఆయనకు మైలేజ్ వచ్చిందని బీజేపీ హైకమాండ్‌కు సమాచారం అందిందట. ఇలాంటి సందర్భాల్లో ఏపీ బీజేపీ నేతలు సత్వరమే స్పందించాల్సింది పోయి.. మౌనంగా ఉండటంపై బీజేపీ అధిష్టాన పెద్దలకు ఆగ్రహం తెప్పించిందట. రాష్ట్రానికి చెందిన కొందరు పార్టీ నేతలతోపాటు ఐబీ వర్గాల ద్వారా సేకరించిన సమాచారంతో..రాష్ట్ర నాయకులకు గట్టిగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది. రామతీర్థం సంఘటనపై సత్వరమే స్పందించకపోవటంపై పార్టీ ఇన్‌చార్జ్‌లను కూడా నిలదీసినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఎక్కడికక్కడ గృహనిర్బంధం

ఢిల్లీ పెద్దలు తలంటడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు హడావుడిగా జనవరి 5న చలో రామతీర్థానికి పిలుపునిచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఆ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కమలం పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. విశాఖ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో ఆయన కిందపడిపోయారు. ఈ సంఘటనపై పార్టీ హైకమాండ్ స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా సోము వీర్రాజుకు ఫోన్ చేసి పరామర్శించారు. తమను రామతీర్థం కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


హైకమాండ్ ఏం చెప్పింది..!?

ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రామతీర్థం కొండపైకి అనుమతించి..తమను ఎందుకు అడ్డుకున్నారని బీజేపీ నేతలు పోలీసులను నిలదీశారు. జగన్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. చివరకు జరిగిన విషయాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేరుగా అమిత్ షాకు ఫోన్ చేసి వివరించారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచాలనీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కూడా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలనీ ఈ సందర్భంగా హైకమాండ్ పెద్దలు రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది. రెండు సీట్ల నుంచి బీజేపీని అధికారంలోకి అయోధ్య రాముడు తీసుకొచ్చారనీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకునే అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నారని రాష్ట్ర బీజేపీ నేత ఒకరు విశ్లేషించారట. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలకు అక్కడ హైకమాండ్ ఏం చెప్పిందనేది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ వ్యవహరాలు చూసే ఓ బీజేపీ ఇన్చార్జ్‌కి గట్టిగానే ఆక్షింతలు పడినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


తీవ్ర వాగ్వాదం..

ఆ తర్వాత జనవరి 7వ మరోసారి బీజేపీ నేతలు చలో రామతీర్థానికి పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు ర్యాలీగా బయల్దేరడంతో నెల్లిమర్ల జంక్షన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదుగురిని మాత్రమే కొండపైకి అనుమతిమస్తామని పోలీసులు అడ్డుచెప్పడంతో మరోసారి గొడవ రాజుకుంది. బారికేడ్లని అడ్డుపెట్టిన పోలీసులను తోసుకుంటూ సోము వీర్రాజుతో పాటు మరికొందరు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.



Updated Date - 2021-01-15T15:48:38+05:30 IST