జగన్ సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా పట్టించుకోరా!?

ABN , First Publish Date - 2020-10-31T16:37:14+05:30 IST

సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో కొందరు నేతలు అధికారాన్ని...

జగన్ సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా పట్టించుకోరా!?

కడప జిల్లాలో అధికార వైసీపీ నేతల అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసు, రెవెన్యూ,మైనింగ్‌ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు,ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో కొందరు నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందినకాడికి దండుకుంటున్నారు. ఏకంగా అధికారిక డంపింగ్ స్టాక్‌ పాయింట్ నుంచే వేలాది టన్నుల ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. 60 వేల టన్నుల ఇసుకను కొల్లగొట్టారని విజిలెన్స్‌ అధికారులు తేల్చి ఏడాదైనా.. ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


కాసులే కాసులు!

కడప జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అంగబలం, అర్థబలం చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు వైసీపీ నేతలు అధికారం చేతిలో ఉందని అడ్డూఅదుపు లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. సహజ వనరులను అడ్డంగా దోచుకొని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇసుకపాలసీల అమలుకు సంబందించి జగన్ ప్రభుత్వం మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. ఇసుక కోసం ప్రజలు, భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కొరతతో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం కుదేలయింది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న రోజుకో కొత్త ఇసుక పాలసీ అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న నేతలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.


రాత్రికి రాత్రే..!

సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఈ దందా చేస్తున్నది అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతో..అడ్డుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. జిల్లాలో నాయకుల బరితెగింపు చేష్టలు చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొందరు వైసిపి శ్రేణులు ఏకంగా అధికారిక డంప్ స్టాక్ పాయింట్ నుంచే వేలాది టన్నుల ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్టాక్‌ పాయింట్ నుంచి సుమారు 60 వేల టన్నుల ఇసుకను అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు స్వయంగా విజిలెన్స్ అధికారులే తేల్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. 6 నెలలకు ముందు ఇసుక కొరత ఉన్న సమయంలో రాత్రికి రాత్రి వందలాది లారీల్లో ఇసుకను రవాణా చేసినట్లు తెలుస్తోంది. ఇసుకను బ్లాక్‌లో బిల్డర్లకు ఎక్కువ ధరలకు అమ్మి అందినకాడికి దండుకున్నట్లు తెలిసింది.


ఇంత జరుగుతున్నా చర్యలేవీ..!?

కడప నగర శివారుల్లో వున్న డంపిగ్ స్టాక్‌ పాయింట్ నుంచి ఓ వైసిపి నేత ఏకంగా 35 వేల టన్నుల ఇసుకను బ్లాక్‌లో విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై రిమ్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదుచేశారు. అయితే అసలు నాయకులను వదిలి పెట్టి  డ్రైవర్లు, కూలీలపై 'పిట్టి' కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. బద్వేల్‌లో 8 వేల టన్నులు, సికె దిన్నెలో 6 వేల టన్నులు డంపింగ్ పాయింట్ నుంచే ఇసుకను అక్రమంగా తరలించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇవే కాకుండా పోరుమామిళ్ళ, రాయచోటి ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో 60 వేల టన్నుల ఇసుక స్వాహా కేసును అధికారులు బయటపెట్టి...ఏడాది కావస్తున్నా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిందితులు అధికార పార్టీకి చెందిన లీడర్లు కావడంతో మంత్రులు పోలీస్‌ అధికారులపై ఒత్తిళ్లు పెంచి..కేసును తొక్కి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం సొంత ఇలాకాలో సొంత పార్టీ నేతలు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నా..చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీతివంతమైన పాలన అంటే ఇదేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-10-31T16:37:14+05:30 IST