Abn logo
May 23 2020 @ 23:57PM

అభద్రతా...!? మీ విలువ తెలుసుకోండి!!

Kaakateeya

‘‘సమాజంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు. అందువల్ల, బాధ్యతగా మన ప్రయత్నం మనం చేసి... చెప్పు చేతల్లో ఉండే విషయాల నియంత్రణలో మనం ఉందాం! అసంబద్ధ విషయాల గురించి ఆందోళన చెందుతూ... అనిశ్చితికి గురై మనపై విశ్వాసాన్ని కోల్పోయి అభద్రతా భావానికి లోనుకావద్దు. మన విలువ తెలుసుకొని ముందడుగు వేద్దాం’’ అని రష్మికా మందన్న అన్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలను పట్టించుకోవద్దని ఆమె చెప్పారు. లాక్‌డౌన్‌లో తాను అభద్రతకు లోనయ్యానని రష్మిక చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘నేనూ ఓ మనిషిగా చెబుతున్నా... కొన్నిసార్లు మన గురించో, ఇతరుల గురించో అభద్రతకు లోనవుతాం. అసంబద్ధ విషయాల గురించి ఆలోచిస్తాం. మన స్నేహితులను అడుగుతాం... ‘నేను బరువు పెరుగుతున్నానా? లేదా మరీ సన్నగా ఉన్నానా? నా చర్మం జిడ్డుగా ఉందా? పొడిబారిందా? రఫ్‌గా ఉందా?’ అని! ఒకవేళ ఎవరైనా ‘నీ ముఖానికి ఏమైంది?’ అని అడిగారో... అంతే సంగతులు! పది రోజులు దుప్పటి కిందే ఉంటాం!! ‘అభద్రతా భావాలుగా పిలవబడే చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడానికి మనం ఎంతో సమయం కేటాయించడం విలువైనదేనా?’ అని నేను అడుగుతున్నా. నిజాయతీగా చెప్పాలంటే... లాక్‌డౌన్‌ సమయంలో నేనూ అభద్రతా భావానికి లోనయ్యా. నా పని, శరీరాకృతి, మానసిక ఆరోగ్యం... ప్రతి విషయం గురించీ ఆందోళన చెందాను. కానీ, ప్రయోజనం లేదని తెలుసుకున్నా. ఇంతకీ, నేను చెప్పేది ఏంటంటే... మిమ్మల్ని ఆందోళనకు, అభద్రతకు గురి చేసే విషయాలను మీ బలాలుగా మార్చుకోండి. ‘నల్లగా ఉన్నావ్‌! చాలా సన్నగా ఉన్నావ్‌! నీ కళ్లు చాలా పెద్దగా ఉన్నాయ్‌!’ అని ఎవరైనా అంటే పర్లేదు. మీరు చేయాల్సిందల్లా... చివరి వరకూ మిమ్మల్ని మీరు నమ్మడం. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మనం పిలిచినా, లేకున్నా అభద్రతా భావం వచ్చి వెళుతుంటుంది. మన విలువ తెలుసుకోవాలంతే! మీరూ మీ విలువ తెలుసుకోండి’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement