బాబోయ్‌.. పురుగులు!

ABN , First Publish Date - 2022-08-08T06:56:16+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం.. నిర్వాహకుల నిర్లిప్తత కారణంగా పెంకు పురుగులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏళ్ల తరబడిగా పెంకు పురుగులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు.

బాబోయ్‌.. పురుగులు!
పెంకు పురుగులు వ్యాప్తి చెందడానికి కారణమైన గోదాములు

  • కొరుపల్లి గొడౌన్‌లనుంచి విస్తృతంగా పెంకు పురుగుల దాడి
  • గుంపులు గుంపులుగా గ్రామాలపైకి దండెత్తుతున్న వైనం
  • పట్టించుకోని నిర్వాహకులు.. ఆందోళనలో ప్రజలు

కరప, ఆగస్టు 7: అధికారుల నిర్లక్ష్యం.. నిర్వాహకుల నిర్లిప్తత కారణంగా పెంకు పురుగులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏళ్ల తరబడిగా పెంకు పురుగులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఎన్నిసార్లు చెప్పినా గోదాము యాజమాన్యం పెంకు పురుగులను నివారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పలు గ్రామాల ప్రజలకు నిత్యం వాటి బెడద తప్పడంలేదు. దీనిపై ఆయా గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

నిద్రపోనివ్వవు..

కరప మండలం కొరుపల్లి గ్రామంలో దాదాపు 1.5లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన 9 భారీ ప్రైవేట్‌ గొడౌన్‌లు ఉన్నాయి. ఈ గొడౌన్‌ల యజమానులు వీటిని సివిల్‌ సప్లయిస్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)లకు లీజుకు ఇచ్చారు. సీఎంఆర్‌ చేసిన బియ్యం నిల్వలు ఈ గొడౌన్‌ల్లో భారీగా ఉన్నాయి. సంబంధిత యజమాన్యం ఈ గొడౌన్‌ల్లో సరైన నిర్వహణ చర్యలు చేయకపోవడంతో పెంకు పురుగులు ఉధృతంగా పెరిగిపోతున్నాయని కొరుపల్లి, కరప, జడ్‌.బావారం, అరట్లకట్ట తదితర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గుంపులు గుంపులుగా అవి గ్రామాలపైకి దండెత్తుకు వస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లల్లో, నీటిలో, తినే ఆహారపదార్థాల్లో ఆ పురుగులు పడి భరించలేని వాసన వస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఇళ్లల్లోకి కుప్పలుగా దూరి తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. పడుకునే సమయంలో ముక్కుల్లోకి, చెవుల్లోకి చేరి నిద్రలేకుండా చేస్తున్నాయని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లల కళ్లల్లో అవి పడి భరించలేని మంటను పుట్టిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటి బారినుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారు తమ ఇంటి దర్వాజాలు, కిటికీలకు మెస్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినా మెస్‌ కన్నాల్లోంచి లోపలికి దూరి మరీ చిరాకు తెప్పిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఈ పురుగుల ప్రభావంతో కొరుపల్లి, దాని చుట్టుపక్కల గ్రామాల్లో వేసిన లేఅవుట్లలో సైట్లు అమ్ముడవక దారుణంగా నష్టపోతున్నట్టు పలువురు సైతం రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగుల ధాటికి సరిగా నిద్ర కూడా పట్టక పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. వీటి వాసన భరించలేక ఎలర్జీ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

ఇవి చేయాలి... 

వాస్తవానికి ఈ పురుగులు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా కెమికల్‌ స్ర్పేయింగ్‌ చేయాలి. బియ్యం నిల్వల మధ్యలో మందు బిళ్లలు పెట్టి వాటిపై కవర్లు కప్పా లి. గొడౌన్‌ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్వహణను గాలికొదిలేశారు. గోదాముల నిర్వహణ సక్రమంగా ఉందో లేదో పర్యవేక్షించాల్సిన సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఆమ్యామాల మత్తులో పత్తా లేకుండా పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెంకు పురుగులవల్ల గొడౌన్‌ల్లోని సరుకు పాడవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. విచ్చలవిడిగా పెరిగిపోయిన పెంకు పురుగులతో ఇళ్లల్లో ఉండ లేకపోతున్నామని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొరుపల్లి, అరట్లకట్ట, గొడ్డటిపాలెం, కరప గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, ప్రజలు సోమవారం కరప వచ్చిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబును కలిసి పెంకుపురుగులవల్ల తాము పడుతున్న బాధలను ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గొడౌన్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని తహశీల్దార్‌, ఎంపీడీవోలకు ఆదేశించారు. పెంకు పురుగులను నిరోధించకపోతే గోదాముల అనుమతులను రద్దు చేసి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - 2022-08-08T06:56:16+05:30 IST