డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ

ABN , First Publish Date - 2021-10-22T05:38:08+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో డ్రోన్‌తో క్రిమిసంహారక మందుల పిచికారీ ప్రయోగం నిర్వహించారు.

డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ
పరిశీలిస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

  1. 45 నిమిషాల్లో 4 ఎకరాల్లో పూర్తి
  2. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ప్రయోగం విజయవంతం


నంద్యాల టౌన్‌, అక్టోబరు 21: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో డ్రోన్‌తో క్రిమిసంహారక మందుల పిచికారీ ప్రయోగం నిర్వహించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఏడీఆర్‌ డా.సరళమ్మ ఆధ్వర్యంలో సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ డా.మంజునాథ్‌ నేతృత్వంలో సీనియర్‌ శాస్త్రవేత్తలు డా.విజయలక్ష్మి, డా.లక్ష్మీకల్యాణి, డా.రవిప్రకాష్‌రెడ్డి, డా.మోహన్‌విష్ణు, డా.ప్రభాకర్‌, డా.సతీష్‌ల బృందం గురువారం డ్రోన్‌తో మందుల పిచికారీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ను ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా గుర్తించారు. దీంతో ఇక్కడ డ్రోన్‌తో పిచికారీ ప్రయోగం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన జనరల్‌ ఎరోనాటికల్‌ సంస్థ డ్రోన్‌ సాంకేతికత సహకారంతో ప్రయోగం జరిగింది. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో నిర్వహించిన ప్రయోగంలో నాలుగు ఎకరాల పంటపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడానికి కేవలం 45 నిమిషాలు పట్టింది. డ్రోన్‌కు సాంకేతికతను ఇన్‌స్టాల్‌ చేసి, పిచికారీ చేయాల్సిన పంట పొలాన్ని అనుసంధానం చేసి పంపితే డ్రోన్‌ దానికదే పంటపై స్ర్పే ప్రక్రియ పూర్తి చేసి తిరిగి నిర్దేశించిన స్థలంలోకి వచ్చి ల్యాండ్‌ అవుతుంది. సాధారణంగా పంట పొలాల్లో చేతి స్ర్పేయర్‌తో క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు ఒక్క ఎకరాకు 200 లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తుంది. పవర్‌ స్ర్పేయర్‌తో ఎకరాకు పిచికారీ చేసేందుకు 120 లీటర్ల నీటిని వినియోగించాలి. డ్రోన్‌ ద్వారా కేవలం 8 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగించి ఒక ఎకరా పంటకు పురుగుల మందును పిచికారీ చేయొచ్చని ఎంటమాలజిస్ట్‌ డా.మంజునాథ్‌ తెలిపారు. పొలంలోకి మనుషులు వెళ్లలేని స్థితి ఉన్నప్పుడు డ్రోన్‌ ద్వారా క్రిమిసంహారక మందు పిచికారీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, చెరుకులాంటి ఏపుగా పెరిగే పంటలపై డ్రోన్‌తో సులభంగా మందు పిచికారీ చేయొచ్చు. ఒకే పొలంలో వరి, శనగ, పత్తి లాంటి పంటలు విస్తారంగా పండించే చోట క్రిమిసంహారకమందుల పిచికారీకి శ్రామికుల సంఖ్య పూర్తిగా తగ్గుతుందని, డ్రోన్‌ ద్వారా త్వరితగతిన పిచికారీ పూర్తవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Updated Date - 2021-10-22T05:38:08+05:30 IST