ఆయిల్‌ఫెడ్‌ ఆక్రమాలపై విచారణ

ABN , First Publish Date - 2020-05-31T10:10:26+05:30 IST

వేరుశనగ విత్తన కాయల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయిల్‌ ఫెడ్‌ నిర్ణయించింది. జిల్లాలో డిసెంబరు నుంచి రైతుల వద్ద

ఆయిల్‌ఫెడ్‌ ఆక్రమాలపై విచారణ

  • జిల్లా మేనేజర్‌ జీతం నిలుపుదల 


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 30: వేరుశనగ విత్తన కాయల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయిల్‌ ఫెడ్‌ నిర్ణయించింది. జిల్లాలో డిసెంబరు నుంచి రైతుల వద్ద వ్యాపారులు వేరుశనగ కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేశారు. క్వింటానికి రూ.5,090 మాత్రమే చెల్లించారు. వీటినే తిరిగి ఆయిల్‌ఫెడ్‌ అధికారులు డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా తిరిగి కొనుగోలు చేశారని రైతుసంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం ఆయిల్‌ఫెడ్‌ ఎండీకి ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొని, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇచ్చారని, రైతులకు అన్యాయం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు  జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన ఆయిల్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయిల్‌ఫెడ్‌ ఎండీ, జిల్లా ఆయిల్‌ఫెడ్‌ మేనేజర్‌ విశ్వనాథంపై విచారణకు ఆదేశించారు.


అనంతపురం జిల్లా ఆయిల్‌ఫెడ్‌ డిప్యూటీ అధికారి మన్సూర్‌ అహ్మద్‌ను విచారణ అధికారిగా నియమించారు. త్వరలోనే ఆయన విచారణ ప్రారంభిస్తారని, రైతులతో పాటు రైతుసంఘం జిల్లా ప్రతినిధులను కలిసి అక్రమాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో దాదాపు రూ.56 కోట్ల విలువైన వేరుశనగ కాయలను ఆయిల్‌ఫెడ్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఇందులో సగం దాకా వ్యాపారుల నుంచే కొనుగోలు చేశారని రైతుసంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో మేనేజర్‌ విశ్వనాథం జీతాన్ని నిలుపుదల చేశారు.

Updated Date - 2020-05-31T10:10:26+05:30 IST