ములకలపల్లి, జనవరి 24: ఇటీవల సంచలనం రేపిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగు ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారి దాడి ఘటనపై అధికారులు సోమవారం విచారణ నిర్వహించారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఐటీడీఏ ఎపీవో డేవిడ్ కుమార్, డీటీ శ్రీనివాసరావు, ఆర్‌ఎ్‌సఐ పద్మావతి, ఐసీడీఎస్ డీసీపీవో హరికుమారి, సీడీపీవో రేవతి తదితరులు బాధిత మహిళలతో మాట్లాడి ఘటన పూర్వపరాలను తెలుసుకున్నారు. తాము తెలుసుకున్న అంశాల ఆధారంగా నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని విచారణ అధికారులు వెల్లడించారు.
పౌరహక్కుల సంఘంతో నిజనిర్ధారణ చేయాలి
సాకివాగు ఘటనపై పౌరహక్కుల సంఘం (సీఎల్‌సీ) ఆధ్వర్యంలో నిజనిర్ధారణ జరిపించాలని దాడికి పాల్పడిన వ్యక్తిని విధుల నుంచి తొలగించాలని సంఘం జిల్లా కార్యదర్శి సింగు ఉపేంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆ గ్రామాన్ని సందర్శించి ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.