గ్రావెల్‌ దోపిడీపై విచారణ

ABN , First Publish Date - 2020-08-10T10:15:38+05:30 IST

ఆనందపురం, సబ్బవరం, మరికొన్ని ప్రాంతాల్లో కొండల నుంచి అక్రమంగా గ్రావెల్‌/ రాళ్లు తవ్వి వ్యాపారం చేస్తున్న ..

గ్రావెల్‌ దోపిడీపై విచారణ

జిల్లా కలెక్టర్‌కు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం

రెవెన్యూ శాఖ నుంచి వివరాల సేకరణ 

అధికారుల తీరుపై ఆగ్రహం

ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని అసంతృప్తి

వేములవలసలో తవ్వకందారులకు గనుల శాఖ నోటీసు


విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆనందపురం, సబ్బవరం, మరికొన్ని ప్రాంతాల్లో కొండల నుంచి అక్రమంగా గ్రావెల్‌/ రాళ్లు తవ్వి వ్యాపారం చేస్తున్న వ్యవహారాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్రంగా పరిగణించారు. దీనిపై రెవెన్యూ అధికారుల నుంచి పలు వివరాలు సేకరించారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో ఫోన్‌లో మాట్లాడి, గ్రావెల్‌ తరలింపుపై విచారణ చేయాలని ఆదేశించారు. 


రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం పలుచోట్ల కొండవాలు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ ప్రదేశాలను చదును చేసి, లేఅవుట్లుగా వేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఇదే అవకాశంగా భావించిన అధికార పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నేతలు, ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన కొండవాలు ప్రాంతాల్లో చదును పేరుతో గ్రావెల్‌, రాళ్లు తవ్వి అమ్ముకుంటున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వరుస కథనాలు ఇటు అక్రమార్కుల్లో, ఇటు రెవెన్యూ సిబ్బందిలో వణుకు పుట్టిస్తున్నాయి. వాస్తవంగా కొండవాలు చదును చేసే క్రమంలో ఎత్తు ప్రాంతంలో తీసిన మట్టిన అక్కడే లోతట్టు ప్రాంతంలో వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సాకుగా తీసుకుని కొందరు నేతలు తమ ప్రాంతంలో కొండల్ని కొల్లగొడుతున్నారు.


పేదలకు ఇళ్ల స్థలాల కోసం కొండ ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో అక్కడ నుంచి మట్టి, గ్రావెల్‌, రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే తమ అనుమతి తీసుకోవాలని ఐదు నెలల క్రితమే జిల్లాలో తహసీల్దార్లకు గనుల శాఖ లేఖ రాసింది. కానీ ఒక్క ఊరు నుంచి కూడా దరఖాస్తు రాలేదు. కొండవాలు ప్రాంతాలను ఇళ్ల స్థలాలకు ఎంపిన చేసిన గ్రామాల్లో చాలా వరకు గ్రావెల్‌ అమ్మకాలు జరిగినట్టు సమాచారం. ఇళ్ల స్థలాల లేఅవుట్‌కు ఎంపిక చేసిన స్థలంలోనే కాకుండా దానికి ఆనుకుని కూడా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి గ్రావెల్‌ తరలింపు ముమ్మరంగా సాగిందని ఉన్నతాధికారులకు, గనుల శాఖకు ఫిర్యాదులు అందాయి. వీటిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడంతోమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించి, ఆదివారం రెవెన్యూ అధికారుల నుంచి పలు వివరాలు సేకరించారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. కొండ ప్రాంతాల నుంచి గ్రావెల్‌ తరలింపుపై విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


తన నియోజకవర్గం పరిధిలో వున్న ఆనందపురం మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్‌ తవ్వకాలు, తరలింపు జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న రెవెన్యూ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 


నోటీసులు జారీకి సన్నద్ధం

వేములవలసలో సర్వే నంబరు 155లో కొండను తవ్వి గ్రావెల్‌, రాళ్లు విక్రయిస్తున్న వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని గనుల శాఖ నిర్ణయించింది. అనుమతిలేకుండా కొండను తవ్వుతున్న ప్రాంతాన్ని గనుల శాఖ అధికారులు పరిశీలించారు. ఏ మేరకు తవ్వకాలు జరిగాయో కొలతలు తీసిన తరువాత నోటీసులు అందజేస్తామని చెప్పారు. ఇదిలావుండగా ఆనందపురం మండలం రామవరంలో కొండలను అక్రమంగా తవ్వేసి, డి. ఫారం భూములను ఇళ్ల స్థలాలు విక్రయించిన వారిని గ్రామస్థులు వెంటపడి తరిమారు. ఈ వ్యవహారంపై పోలీసులకు, తహసీల్దారు కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-08-10T10:15:38+05:30 IST