ఉపాధి హామీ పనులపై విచారణ

ABN , First Publish Date - 2022-01-29T06:11:38+05:30 IST

2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన ఉపాధి హామీ పనులపై గ్రామస్థాయి సోషల్‌ అడిట్‌ గ్రామసభ శుక్రవారం బొడ్డపాడులో నిర్వహించారు.

ఉపాధి హామీ పనులపై విచారణ
బొడ్డపాడులో అధికారుల విచారణ

హాజరు నమోదులో అన్యాయం జరిగిందని కూలీల ఫిర్యాదు 

 ఏఫ్‌ఏకు అధికారుల హెచ్చరిక

తోట్లవల్లూరు, జనవరి 28 : 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన ఉపాధి హామీ పనులపై గ్రామస్థాయి సోషల్‌ అడిట్‌ గ్రామసభ శుక్రవారం బొడ్డపాడులో నిర్వహించారు. సర్పంచ్‌ మూడే శివశంకర్‌ అధ్యక్షతన  జరిగిన గ్రామసభకు సోషల్‌ ఆడిట్‌ ఏపీవో జి.వెంకటేశ్వరరెడ్డి, స్టేట్‌ రీసోర్స్‌ పర్సన్‌ బి.సూర్యనారాయణ, డీఆర్‌పీ  నరేష్‌, ఎంపీటీసీ సభ్యురాలు డి.రోజారాణి, కార్యదర్శి అంజనాదేవి హాజరయ్యారు. గ్రామసభలో పలువురు కూలీలు తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. 21 రోజులు పనిచేస్తే ఏడు రోజుల పనిచేసినట్టు హాజరు వేశారు, డబ్బులు ఇంత వరకు రాలేదని, జాబ్‌కార్డు లేని వ్యక్తులు పనిచేస్తే ఇతరులకు హాజరు వేశారని ఆరోపించారు. అనేక అక్రమాలు జరిగాయని మహిళలు ఆరోపించారు. 600 మొక్కలు తెచ్చి ఎఫ్‌ఏ ప్రసాద్‌ సక్రమంగా నాటించలేదని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నాడని సర్పంచ్‌ మూడే శివశంకర్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఏ ప్రసాద్‌ని అధికారులు ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగం తీసేస్తామని హెచ్చరించారు. కూలీల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన స్టేట్‌ రీసోర్స్‌ పర్సన్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ  ఫిబ్రవరి 2వ తేదీన తోట్లవల్లూరులో మండలస్థాయి షోషల్‌ ఆడిట్‌ గ్రామసభ జరుగుతుందని, అక్కడ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉప సర్పంచ్‌ శివశంకరరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T06:11:38+05:30 IST