అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-03-15T02:06:05+05:30 IST

అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణ పై సుప్రీంకోర్టులో

అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దువ్వాడు సాగర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్‌పై విచారించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది. తెలంగాణలో అక్రమ లే ఔట్లలో ప్లాట్ల రిజస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి పిటీషనర్ జువ్వాడి సాగర్ రావు, తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ తీసుకొచ్చారు. తెలంగాణలో అక్రమ లే ఔట్లను క్రమబద్దీకరించాలని 20 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పిటీషనర్ తెలిపారు. అక్రమ లే ఔట్లకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే, ఆంధ్రప్రదేశ్‌లో 46 వేలు అక్రమ ప్లాట్లని క్రమబద్దీకరించినట్లు  పిటీషనర్ తెలిపారు.


అక్రమ లేఔట్ల క్రయవిక్రయాలను ఎందుకు అనుమతిస్తున్నారని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ లే ఔట్లని తరచూ క్రమబద్దీకరించే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీని చట్టబద్దతను నిర్ణయించడం కోసమే, అన్ని రాష్ట్రాలను పార్టీలుగా చేర్చి విచారణ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.


ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే లే ఔట్లను తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తోందని ధర్మాసనానికి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమగ్ర విచారణ జరపాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.సీబీఐతో సహా, మిగిలిన కొంతమంది పార్టీలు ( రాష్ట్రాలు) కూడా కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 26కు ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2022-03-15T02:06:05+05:30 IST