పురాల్లో నిఘా....

ABN , First Publish Date - 2021-03-08T04:57:27+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల వేళ.. పట్టణాల్లో నిఘా పెరిగింది. ఈ నెల 10న ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రచారానికి నేటితో (సోమవారం) గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థుల కదలికలపై అధికారపార్టీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా షాడో బృందాలను నియమించారు. ఈ బృందాలు టీడీపీ నాయకుల కదలికపై ప్రత్యేకంగా నిఘా పెట్టాయి.

పురాల్లో నిఘా....

అభ్యర్థుల కదలికలపై ఆరా

ద్వితీయ స్థాయి నాయకులపైనా ప్రత్యేక దృష్టి

ఎప్పటికప్పుడు ‘షాడో బృందాలతో’ సమాచార సేకరణ

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

మునిసిపల్‌ ఎన్నికల వేళ.. పట్టణాల్లో నిఘా పెరిగింది. ఈ నెల 10న ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రచారానికి నేటితో (సోమవారం) గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థుల కదలికలపై అధికారపార్టీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా షాడో బృందాలను నియమించారు. ఈ బృందాలు టీడీపీ నాయకుల కదలికపై ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. ద్వితీయస్థాయి నాయకులు ఎక్కడా ప్రలోభాలకు గురికాకుండా... కేడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ద్వితీయశ్రేణి నాయకులపైనా అధికారపార్టీకి చెందిన షాడో బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీల్లో షాడో బృందాలు అధికంగా సంచరిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది.  ఏ అభ్యర్థి ఎవరితో మంతనాలు చేస్తున్నారు. ఆ అభ్యర్థికి ఉన్న జనాధరణ వివరాలపై  సమాచారాన్ని షాడో బృందాలు సేకరిస్తున్నాయి. వాటిని నివేదిక రూపంలో జిల్లాలో ఉన్నతస్థాయి నేతలకు అందజేస్తున్నాయి. దాని ఆధారంగా మునిసిపాలిటీలు, వార్డుల్లో పరిస్థితిపై నేతలు అంచనాకు వస్తున్నారు. అక్కడ లోటుపాట్లు సరిదిద్ది ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్రలోభాలు, హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకూ అందజేసిన ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా లబ్ధిపొందిన వారి వివరాలను వార్డులవారీ జాబితాగా సిద్ధం చేసుకున్నారు. ఆ పథకాలను ఓటర్లకు వివరిస్తూ వైసీపీ పాలనలో ఎంతో మేలు చేకూర్చామని ప్రచారం చేస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో వైసీపీని ఆదరించకపోతే పథకాలన్నీ నిలిచిపోతాయని పరోక్షంగా ఓటర్లను హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలకు గురికావద్దని, బెదిరింపులకు భయపడొద్దంటూ టీడీపీ నేతలు ఓటర్లకు సూచిస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఈ నెల 14న తేలనుంది. 

 

Updated Date - 2021-03-08T04:57:27+05:30 IST