హెటెరో పైప్‌లైన్‌ పనులు ఆపాలని వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-12-06T05:54:58+05:30 IST

హెటెరో ఔషధ పరిశ్రమ చేపట్టిన పైప్‌లైన్‌ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని రాజయ్యపేట తీరం వద్ద మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

హెటెరో పైప్‌లైన్‌ పనులు ఆపాలని వినూత్న నిరసన
మెడకు ఉరితాడు తగిలించుకుని మత్స్యకారులు నిరసన

నక్కపల్లి, డిసెంబరు 5 : హెటెరో ఔషధ పరిశ్రమ చేపట్టిన పైప్‌లైన్‌ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని రాజయ్యపేట తీరం వద్ద మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత నాలుగు రోజులుగా ఈ అంశంపై వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఆదివారం వారంతా మెడకు ఉరితాడు తగిలించుకుని  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే రసాయన పరిశ్రమలు సముద్రంలోకి వదులుతున్న వ్యర్థ జలాల వల్ల మత్స్య సంపద నాశనం అవుతోందని వాపోయారు. దీని వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. వెంటనే ఇక్కడి పైప్‌లైన్‌ పనులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల అమ్మోరియ్య, ఉపాధ్యక్షుడు మేరుగు కొర్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు జి.నూకరాజు, సీహెచ్‌.రామకృష్ణ, సీపీఎం నాయకుడు ఎం.అప్పాలరాజు, నక్కపల్లి జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పిక్కి కామేశ్వరరావు, సత్తయ్య, గంగ, గోసల స్వామిలతో పాటు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T05:54:58+05:30 IST