ఇన్నర్‌ టెర్రర్‌!

ABN , First Publish Date - 2022-05-07T06:36:23+05:30 IST

హైదరాబాద్‌ - కోల్‌కతా మధ్య వాహనాలు రాకపోకలు సాగించే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.

ఇన్నర్‌ టెర్రర్‌!
ఇది విజయవాడ నగరంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు. 16, 65వ నెంబర్‌ జాతీయ రహదారులను అనుసంధానించే ఈ ప్రధాన మార్గం అడుగడుగునా అధ్వానమే. పది కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ రహదారి నిర్వహణ విషయంలో ఏపీ సీఆర్డీయే ఘోరంగా విఫలమవుతోంది.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అడుగడుగునా గోతులే

ప్రతిసారీ ప్యాచ్‌వర్క్‌లతోనే సరి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్‌ - కోల్‌కతా మధ్య వాహనాలు రాకపోకలు సాగించే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ వద్ద ఎన్‌హెచ్‌-65కు అనుసంధానంగా ప్రారంభమై రామవరప్పాడు రింగ్‌కు కాస్త ఎగువన ఎన్‌హెచ్‌-16తో కలుస్తుంది. ఈ రోడ్డు నాలుగేళ్ల క్రితమే దెబ్బతినడం మొదలైంది. ఇప్పుడు పూర్తిగా గోతులమయమయింది. 


ఫ్లై ఓవర్లపై పొంచి ఉన్న ప్రమాదం

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అంతర్భాగంగా ఉన్న ఫ్లై ఓవర్ల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వంతెనలపై స్పాన్ల మధ్య కాంక్రీట్‌ కొట్టుకుపోవటంతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అప్పట్లో కొంతవరకు మరమ్మతులు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఫ్లై ఓవర్‌పై కొత్తగా గోతులు ఏర్పడ్డాయి. వీటి కారణంగా వేగంగా వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌పై ఇప్పటికి రెండుసార్లు వాహనాలు క్రాష్‌ బ్యారియర్స్‌ను ఢీకొట్టాయి. మొదటి ప్రమాదంలో క్రాష్‌ బ్యారియర్‌ పగిలి కింద పడింది. ఇటీవల జరిగిన రెండో ప్రమాదంలో కారు క్రాష్‌ బ్యారియర్‌ పైకి ఎక్కి అలా ఉండిపోయింది. ఈ ప్రమాదాలకు కారణం రోడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడమే. ప్రమాదకర మలుపులు ఉన్న చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటం, రేడియం స్టిక్కర్లు అంటించటం, వీధి దీపాలు వెలిగేలా చూడటం జంక్షన్ల దగ్గర స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయటం ఇవన్నీ రోడ్డు నిర్వహణలో భాగమే. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై ఇవేమీ కనిపించవు. భద్రతా ప్రమాణాలు కూడా పెద్దగా పాటించటం లేదు. 


రైల్వేస్టేషన్‌ రోడ్డును పట్టించుకునేదెవరు? 

విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్రధాన రోడ్డు ఇది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకమే. ఇది సగం కార్పొరేషన్‌ పరిధిలోకి, సగం రైల్వే పరిధిలోకి వస్తుంది. రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఉన్న ప్రాంతమంతా రైల్వే పరిధిలోకి వస్తుంది. బయట కార్పొరేషన్‌ పరిధిలోకి వస్తుంది. రైల్వేస్టేషన్‌ ఆవరణలో సర్క్యులేటెడ్‌ ఏరియాను అభివృద్ధి చేసినప్పటికీ రోడ్లను మాత్రం రైల్వే, కార్పొరేషన్‌ రెండూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ పార్శిల్‌ ఆఫీసు రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. 

Read more