ఇంకుడు గుంత.. ఇదేం చింత

ABN , First Publish Date - 2021-03-05T06:13:03+05:30 IST

ఇంకుడు గుంత.. ఇదేం చింత

ఇంకుడు గుంత.. ఇదేం చింత

నిర్మాణాల్లో లోపం..  రెండేళ్లకే ఆనవాళ్లు కోల్పోతున్న వైనం

 పట్టించుకోని అధికారులు

బచ్చన్నపేట, మార్చి 4: పాతాళంలో చేరి ప్రమాదకర స్థాయికి చేరుకున్న భూగర్భ జలమట్టాలను పెంపొందించడంతో పాటు ఆరు బయటకు మురుగునీరు వెళ్లి అపరిశుభ్రంగా మారకుండా  ఉండేందుకు ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణాలను మూడు సంవత్సరాల క్రితం చేపట్టింది. ఇళ్లల్లో, పార్కుల్లో, రోడ్ల పక్కన, పొలాల వద్ద, గ్రామాల్లో వీధి నల్లాలు, వృథాగా వెళ్లే నీటి జాడలు గుర్తించి ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్ణయించారు. సరైన ప్రణాళికలతో నిర్మాణాలు చేయకపోవడంతో మురుగునీటితో నిండిపోయి, నీరు ఆరుబయటకు వెళుతున్నాయి. చాంబర్లతో పకడ్బంధీగా నిర్మాణాలు  చేపడితే పరిస్థితి ఇలా ఉండేది కాదని గ్రామస్థులు వాపోతున్నారు. 

ప్రస్తుతం చాంబర్ల తప్పని సరి చేస్తూ, కొన్ని మార్పులు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి సత్ఫలితాలు  ఇస్తాయని ఈజీఎస్‌ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తమకు మరోమారు ఇంకుడు గుంతలు నిర్మించుకునే అవకాశాలు కల్పించాలంటున్నారు. 

గతంలో జరిగిన పనులు చూస్తే లక్ష్య సాధనలో ప్రగతి చూపించుకునేందుకు పనులు చకచకా పూర్తి చేసినప్పటికీ  అనుకున్న ఆశయం మాత్రం నెరవేరట్లేదు. మూడేళ్ల కిందట ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టారు. ఇంటింటికీ అవి తప్పకుండా ఉండాలని ప్రచారం చేశారు. చేతి పంపుల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో నీరు నిలిచి, దుర్గంధం రాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో  ఇంకుడు గుంతలు నిర్మించారు. ఇళ్ల దగ్గర కట్టిన అనేక ఇంకుడు గుంతలతో పాటు,  కుళాయిలు, చేతిపంపసుల వద్ద నిర్మించిన గుంతలు మాత్రం పనికి రాకుండా చెత్తచెదారంతో నిండిపోయాయి. సామూహిక ఇంకుడు గుంతలు రెండు సైజులలో నిర్మించారు. 2.4 మీటర్ల పొడవు,  2.4 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతులో నిర్మించే వాటికి రూ. 10,314 లను ఉపాధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. రెండు మీటర్ల వెడల్పు, అంతే పొడవు, లోతుతో నిర్మించే వాటికి రూ. 7,855 చెల్లిస్తారు. ఇళ్లల్లో నిర్మాణాలు జరుపుకున్న వాటికి రూ. 4500 చొప్పున చెల్లిస్తారు. గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలను ప్రాధాన్యాన్ని బట్టి నిర్మాణాలను చేపట్టారు. వీటిని నిర్మించిన సమయంలో పైన ఇసుక వేయడం, ఛాంబర్‌ నిర్మించకుండా నేరుగా ఇంకుడు గుంతలోకి మళ్లించడంతో మట్టి, బురద అందులోకి వెళ్లి ఇసుక పైన పేరుకపోవడంతో నీరు ఇంకని పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల ఇలానే నిర్మాణం చేపట్టారు.  తర్వాత నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేయకపోవడం, మురికి పేరుకు పోయినా అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇంకుడు గుంతల్లో నీరు ఇంకక జనాలకు ఇబ్బందిగా మారాయి. 

నిర్మాణాల్లోను నిర్లక్ష్యం..

ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పధకా లు అందిస్తామని కొద్ది రోజుల పాటు విస్తృతంగా ప్రచారం కల్పించే ప్రయత్నాలు జీపీ, ఈజీఎస్‌ సిబ్బంది చేశారు. ఆ తరువాత పట్టింపు లేకపోవడం తో చాలా వరకు నిర్మాణాలు సగంలోనే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో 57,227 ఇంకుడు గుంతలు మంజూరుకాగా, 13,014 మాత్రమే పూర్తయ్యాయి. 11,211 ప్రోగ్రె్‌సలో ఉన్నట్టు చూపుతున్నారు. 

ఇంటికి ఒక ఇంకుడు గుంత మాత్రమే : ఈసీ

ఒక జాబ్‌ కార్డు కలిగిన కుటుంబానికి ఇంటి సమీపంలో ఒక ఇంకుడు గుంత నిర్మాణానికి మాత్రమే అవకాశం ఉంది. శిఽథిలమైన, కూడిపోయినా మరొకటి మంజూరు చేసే అవకాశాలు ఇప్పటి వరకు లేవు. ఎప్పటికప్పుడు నీరు ఇంకేలా నిర్వాహణ సరిగా చేపట్టకపోవడంతో తొందరగా నిండిపోయి నీరు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ముందు చాంబర్‌లు నిర్మించుకోవటం తప్పని సరిచేస్తాం.


Updated Date - 2021-03-05T06:13:03+05:30 IST