అకాడమీ విధానంతో అన్యాయం

ABN , First Publish Date - 2020-12-05T06:25:01+05:30 IST

సాహిత్యం పట్ల అభిరుచి, ఎంతో కొంత సృజనాత్మక కృషి ఉన్న సాహిత్యపరులకు కూడా, కేంద్ర సాహిత్య అకాడమీ పని...

అకాడమీ విధానంతో అన్యాయం

కేంద్ర సాహిత్య అకాడమీ విధానం వల్ల ప్రముఖ రచయితలుగా పేరు పొందినవారు ఎందరో పురస్కారానికి అర్హత కోల్పోతున్నారు, కోల్పోయారు. సీనియర్లు, ఎన్నో పుస్తకాలు రాసినవారు, వయసు పైబడినవారు, జ్ఞానపీఠం, సరస్వతీ సమ్మాన్‌ అవార్డులకే అర్హులైనవారు ఎందరో ఉండగా పిన్న వయస్కులు, ఒకే ఒక పుస్తకం రాసినవారు పురస్కారం పొందటం అనుచితం, అక్రమం, అన్యాయం.


సాహిత్యం పట్ల అభిరుచి, ఎంతో కొంత సృజనాత్మక కృషి ఉన్న సాహిత్యపరులకు కూడా, కేంద్ర సాహిత్య అకాడమీ పని తీరుతెన్నుల గురించి, ముఖ్యంగా ప్రతిఏటా ఇచ్చే పురస్కారాల పరిగణన, ఎంపిక గురించిన ప్రాథమిక విషయాలేవీ తెలియవు. స్వీయరచన, అనువాదం, యువరచయిత పురస్కారం, బాలసాహిత్యం.. ఇలా దేనిలోనైనా పురస్కారం పొందాలంటే ఆ పుస్తక ప్రచురణ జరిగి మూడేళ్ళకు మించకూడదు. అప్పుడే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, 2020కు గాను గత మూడు సంవత్సరాలలో ప్రచురితమైన పుస్తకాలు మాత్రమే అర్హమవుతాయి. అంటే 2017, 2018, 2019 సంవత్సరాలలో వచ్చిన పుస్తకాలనే పరిగణిస్తారు. 2016, ఇంకా అంతకు ముందు ప్రచురితమైతే వాటిని పరిగణించరు. అంతేకాక ఆ రచయిత అప్పటివరకూ చేసిన సాహిత్య కృషి లెక్కకు రాదు. దీనివల్ల ప్రముఖ రచయితలుగా పేరు పొందినవారు ఎందరో పురస్కారానికి అర్హతను కోల్పోతున్నారు, కోల్పోయారు. ఈ విషయమై యథాలాపంగా సద్యఃస్ఫురణగా నాకు 40 మంది తెలుగు రచయితలపైనే గుర్తుకువచ్చారు. ఆ పేర్లన్నీ రాస్తే ఈ రచన ద్వారా నేనుద్దేశించిన విషయం ఏమిటో చెప్పటానికి అవకాశం ఉండదు. అందువల్ల కొందరి ముఖ్యమైన పేర్లు మాత్రమే పేర్కొంటున్నాను. 


దాశరధి రంగాచార్య, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ముదిగంటి సుజాతారెడ్డి, ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి, ముక్తేవి భారతి, డి. కామేశ్వరి, సి. ఆనందారామం వంటి రచయిత్రులు, పులిగడ్డ విశ్వనాధరావు, శీలావీర్రాజు, చాసో, భాస్కరభట్ల కృష్ణారావు, రంధి సోమరాజు, కాలువ మల్లయ్య, కల్లూరి భాస్కరం, పల్లేటి రఘోత్తమరెడ్డి, నందిని సిధారెడ్డి మొదలైన వారికి సృజనాత్మక లేదా అనువాద రచయితల పురస్కారం రాలేదు. ఇది దురదృష్టకరం, అన్యాయం, అక్రమం. కేంద్ర సాహిత్య అకాడమీ 1954 నుంచి పురస్కారాలు ఇస్తున్నది. ఇక పాతతరం వారిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కరుణకుమార, చింతాదీక్షితులు, కొ.కు వంటి వారికి రాలేదు. తిరుమల రామచంద్రకు మరణానంతరం వచ్చింది. ఆయన స్వీయచరిత్ర ‘హంపీ నుంచి హరప్పా దాక’ ఒక శతాబ్ది కాలంలోనే గొప్ప పుస్తకాల పరిగణనలో ఒకటిగా నిలుస్తుంది. అట్లాగే గడియారం రామకృష్ణ శర్మకు అకాడమీ పురస్కారం మరణానంతరం లభించింది. సామల సదాశివకు నా పట్టుదల వల్ల బతికుండగానే వచ్చింది. నేను ఐదు సంవత్సరాల పాటు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కన్వీనరుగా ఉన్నాను. భద్రిరాజు కృష్ణమూర్తి సుమారు 15 సంవత్సరాల పాటు కేంద్ర సాహిత్య అకాడమీలో వివిధ స్థాయిల్లో అధికారిక హోదాలో ఉన్నారు. వారిని ఒకసారి, ‘నిజంగా సాహిత్య అకాడమీ పురస్కారాలు రావల్సిన వారికి ఎందుకు రావటం లేదు’ అని అడిగాను. ‘ఇప్పటి వరకూ పొందిన వారు అర్హులు కారా’ అని ఆయన గడుసుగా ఎదురుప్రశ్న వేశారు? ‘కావచ్చు కానీ, సీనియర్లు, ఎన్నో పుస్తకాలు రాసినవారు, వయసు పైబడినవారు ఉండగా, తక్కువ వయస్కులు, ఒకే ఒక పుస్తకం రాసినవారు పురస్కారం పొందటం అనుచితం, అక్రమం, అన్యాయం కాదా’ అని అడిగాను. కోడూరి ప్రభాకరరెడ్డి, ఘండికోట బ్రహ్మాజీరావు, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, దాశరధి రంగాచార్య, ఆవంత్స సోమసుందర్‌, కె.వి. రమణారెడ్డి వంటి వారు జ్ఞానపీఠం, సరస్వతీ సమ్మాన్‌ అవార్డులకే అర్హులు కదా? మరి వారికెందుకు సాహిత్య అకాడమీ పురస్కారం రాలేదు? గడచిన 15 సంవత్సరాల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కమిటీల సభ్యులెవరో వెల్లడి అయితే ఈ విషయం కుండ బద్దలు కొట్టకుండానే స్పష్టమవుతుంది. 1954 నుంచి అకాడమీ పురస్కారాలనిస్తున్నది. రచయితలు, కవులతో ‘సాయం సంధ్యాగోష్ఠి’, ‘మీ అభిమాన రచయితతో ఒక సాయంత్రం’ మొదలైన కార్యక్రమాలను కూడా అకాడమీ నిర్వహిస్తోంది. వాటిని సైతం నిర్వాహకులు వారి చిత్తానుసారం జరుపుతున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, సత్కారాలు 66 సంవత్సరాలుగా రావాల్సిన సీనియర్‌ రచయితలకు బహు సకృతుగా మాత్రమే వచ్చాయి.

అక్కిరాజు రమాపతిరావు

Updated Date - 2020-12-05T06:25:01+05:30 IST