అన్యాయ యుద్ధం, అనుకూల పరిణామాలు

ABN , First Publish Date - 2022-03-03T10:05:13+05:30 IST

మాతో ఉన్నారా సరే, లేదంటే టెర్రరిస్టులతో ఉన్నట్టే- అని జార్జి బుష్ జూనియర్ 2001లో మహాభవనాల జంట విధ్వంసానికీ, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి మధ్య అన్నారు. ఈ వ్యక్తీకరణ...

అన్యాయ యుద్ధం, అనుకూల పరిణామాలు

మాతో ఉన్నారా సరే, లేదంటే టెర్రరిస్టులతో ఉన్నట్టే- అని జార్జి బుష్ జూనియర్ 2001లో మహాభవనాల జంట విధ్వంసానికీ, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి మధ్య అన్నారు. ఈ వ్యక్తీకరణ ఆయన సొంతమేమీ కాదు, బైబిల్‌లో దేవపుత్రుడే ఆ మాట అన్నాడు, ఎందరెందరో రచయితలు, నాయకులు, తాత్వికులు గతంలో ఆ మాటలన్నారు. దాదాపు అదే సమయంలో హిల్లరీ క్లింటన్ కూడా కొంచెం అటూ ఇటూగా అదే మాట అన్నారు. అయినా, ఆ మాటకు కాపీరైటు, పేటెంటు అన్నీ బుష్ దొరగారికే దక్కాయి. అమెరికాలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లూ అంతిమ పరిశీలనలో ఒకటే అయినా, వారి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలలో వాచాలత్వం ఒకటి. అమెరికన్ రిపబ్లికన్ల కంటె, డొనాల్డ్ ట్రంపు కంటె కూడా పరమ నాటు మనిషి ఎవరైనా ఉన్నారా అంటే, ఆయన పేరు వ్లాదిమీర్ పుతిన్. రష్యాకు చిరకాలపు అధ్యక్షుడు. అందరికంటె, ట్రంపుకు ఆత్మీయంగా నిలిచినవాడు కూడా అతనే. ట్రంపును మొదట గెలిపించింది పుతినే అన్న చర్చ తెలిసిందే కదా, రెండోసారి కూడా గెలిపించాలని చూశారు కానీ విధి వక్రించింది. (నరేంద్రమోదీ కూడా ట్రంపు గెలవాలని ఆశించి కొంత మాటసాయం చేయడం గురించి ఇక్కడ పెద్దగా చెప్పుకోనక్కరలేదు, ముగ్గురూ ముగ్గురికి అభిమానులే అన్న నిర్ధారణ మరీ అన్యాయమైంది అవుతుందేమో?) నా వైపు ఉండండి అని పుతిన్ ఎవరినీ అభ్యర్థించలేదు. మిత్రుడూ శత్రువూ అనే వర్గీకరణ ఏదీ చేయలేదు. నేను ఓ దేశం మీద దాడి చేస్తున్నాను, అడ్డం వచ్చారంటే ఖబడ్దార్ అన్నాడు. అణ్వాయుధాలను యుద్ధనౌకల మీద ఝళిపిస్తూ ప్రపంచానికి గుబులు పుట్టిస్తున్నాడు. ఇంత సుతిమెత్తటి సున్నితమైన దేశాధినేత, రెండవ రాకడ జరుగుతున్న రష్యన్ సామ్రాజ్యవాదానికి ప్రతినిధిగా ఇప్పుడు జెండా ఎగరేస్తున్నాడు. కొత్తా దేవుడండీ. 


ఇటువంటి జబర్దస్తీ జరుగుతుండగా, ఎవరి పక్కన ఉండాలో ఎంచుకోవడం కష్టమే. అలీనవిధానం అంటే గోడమీద పిల్లి వాటం కాదు. పెద్ద పెద్ద దేశాలకు తోకలుగా మారకుండా, సొంత అస్తిత్వాన్ని నిలుపుకోవాలనుకునే దేశాల ఉద్యమం అది. కానీ, బలహీనుల మీద బలవంతుడు దాడి చేస్తుంటే తటస్థంగా ఉంటాననడం అలీనవాదం కాదు. ఈ సందర్భంలో తటస్థత అంటే బలవంతుడి పక్షాన నిలవడమే. అందుకే, ఇండియా చేసిన గైర్హాజరీని రష్యా మెచ్చుకున్నది. భారత్ విధానాన్ని అమెరికా కూడా ‘అర్థం’ చేసుకున్నది. అమెరికా జేబులో ఉన్నదనుకున్న పాకిస్థానే తటస్థత పేరుతో రష్యా వైపు మొగ్గుతుండగా, భారత్‌ను అమెరికా ఎట్లా తప్పుపట్టగలదు? ప్రపంచం అమెరికా, సోవియట్ శిబిరాలుగా ఉండిన ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో, కాంగ్రెస్ తాను సోషలిస్టుగా భ్రమింపజేస్తూ సోవియట్ శిబిరం వైపు మొగ్గు చూపుతుంటే, భారతీయ జనతాపార్టీ పూర్వ రూపం జనసంఘ్ అమెరికా అనుయాయిగా ఉండేది. సోవియట్ యూనియన్ విచ్ఛిత్తి, మొదటి గల్ఫ్ యుద్ధమూ ఒకేసారి జరిగాయి. అదే సమయంలో, మన ఆర్థిక విధానాలూ మారిపోయాయి. మొదటి గల్ఫ్‌ యుద్ధంలో కానీ, రెండో గల్ఫ్‌ యుద్ధంలో కానీ, భారత్ అంతర్జాతీయవేదికల మీద అసమ్మతిని ప్రకటించింది లేదు. కశ్మీర్ విషయంలో ఉక్రెయిన్ వైఖరిని ప్రస్తావించి, ఆ దేశానికి భారత్ మద్దతు ఇవ్వకూడదు అని కొందరు వాదిస్తున్నారు కానీ, అదే ప్రమాణమైతే, కశ్మీర్ వివాదంలో భారత్ వైఖరికి మద్దతుగా నిలిచినవాడు సద్దాం హుస్సేన్. అతనికి మాత్రం భారత్ ఏమాత్రం కృతజ్ఞత చూపింది? అతన్ని ఉరితీసినప్పుడు దురదృష్టకరమనడం తప్ప? ఇరాక్ విషయంలోనే కాదు, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, ఇరాన్ దేశాలపై యుద్ధాలూ, ఆంక్షలూ ముసిరినప్పుడు, ఎక్కడా అభ్యంతరం చెప్పిన దేశం కాదు భారత్. వీటిలో చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తీసుకున్న వైఖరులే కాబట్టి, ఇప్పుడు నరేంద్రమోదీ చేసినది కొత్త తప్పూ కాదు, కొత్త ఒప్పూ కాదు. కాకపోతే, గల్ఫ్‌ నుంచి పెద్దసంఖ్యలో భారతీయులను సురక్షితంగా స్వదేశం రప్పించడానికి అప్పటి కేంద్రప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ తీసుకున్నాయి. యుద్ధం రానున్న దేశాల ప్రభుత్వాలూ సహకరించాయి. ఇప్పుడేమిటో, బాధిత దేశమూ సాయపడలేకపోతోంది, దాడి చేసే దేశమూ దయచూపలేకపోతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ పరిస్థితిని ఎంతగా ఉపయోగించాలనుకుంటున్నా, నరేంద్రమోదీకి పరిస్థితులు అనుకూలించడం లేదు. అమెరికా ప్రోత్సాహంతో చైనాతో ఢీ కొట్టడానికి కూడా సిద్ధపడి, ఇప్పుడేమో చైనా బలపరుస్తున్న రష్యాకు, అదిన్నీ అమెరికా ప్రయోజనాలకు భంగకారి అయిన దాడికి పరోక్షంగా మద్దతు ఇవ్వవలసి రావడం విధి వైపరీత్యమే.


ఉక్రెయిన్ భారతదేశానికి చాలా కావలసిన దేశమే. ఆ దేశం నుంచి, ఆ దేశం  ద్వారా మనకు చాలా దిగుమతులున్నాయి. మన దేశం నుంచి వెళ్లి విద్యార్థులు వైద్యవిద్య చదువుకోవడం ఆ దేశానికి మంచి వ్యాపారం. సోవియట్ యూనియన్ విభాగం తరువాత, ఆయా దేశాలలో చాలా మార్పులు జరిగాయి. వ్యవస్థలు మారాయి, అంతరాలు పెరిగాయి, కొత్త సంస్కృతి కొత్త రుగ్మతలను తెచ్చింది. రష్యాలో మాఫియా, శరీర వ్యాపారం, చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగినట్టే, తక్కిన మాజీ రిపబ్లిక్‌లలోనూ శాయశక్తులా ఏవో దుర్మార్గాలు పెరిగాయి. దుబాయితో సహా పర్యాటక ఆకర్షణలున్న గల్ఫ్‌ దేశాలలో అనేక మంది ఉక్రెయిన్ అమ్మాయిలు లైంగిక సేవలు అందించే వృత్తుల్లో కనిపిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయనేతలు అనేకులు గల్ఫ్ దేశాలకు ఎందుకు వెడతారో బహిరంగ రహస్యమే. 


నేపాల్ మాదిరిగా భారత్ కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తే, ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక మీద మాత్రమే ఇవ్వాలి. చిన్న దేశంమీద పెద్ద దేశం, చర్చల ద్వారా కాకుండా దౌర్జన్యాన్ని ఆశ్రయించి, మొదట దాడి చేయడం అన్న కారణంతో చేయాలి. అటువంటి సూత్రబద్ధ వైఖరి గతంలో కూడా లేదన్నసంగతి చూశాము. ఇప్పుడు కొత్తగా ఆ వైఖరి తీసుకోవడం వల్ల, ఆసియా, ఐరోపా ఖండాలలో రూపొందుతున్న సరికొత్త భద్రతా చిత్రపటం మీద భారత్ ఏకాకి అవుతుంది. రష్యా మీదకు ఉక్రెయిన్‌ను ఎగదోసిన అమెరికాయే రంగంలోకి దిగడానికి సంశయించే పరిస్థితి ఉంటే, రేపు చైనాతో ఏదైనా సమస్య వస్తే, మన తరఫున మాట్లాడేవాడు కూడా లేకుండా పోతారు. అందుకే, ఒకనాడు ప్రారంభించి, తరువాత నిద్రాణం చేయతలపెట్టిన బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా కూటమి స్ఫూర్తికి కొంత ప్రాణం పోశారు. ఈ మధ్య కాలంలో హడావుడి చేస్తున్న ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతా కూటములు, ప్రయత్నాలు ప్రస్తుతానికి అటకెక్కవలసిందేనేమో? భద్రతావ్యూహాత్మక కారణాలతో అనివార్యమైన దాడి చేయడం సహేతుకమే అని వాదిస్తున్న రష్యా, రేపు భారత్‌కు కానీ, చైనాకు కానీ అటువంటి సదుపాయాన్ని అనుమతిస్తుందా అన్నది సందేహమే. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, రష్యా అమెరికా కలసి తమ ప్రయోజనాల రీత్యా అంచనాలు వేసుకుంటాయి కాబోలు. అప్పుడు మరొక సంక్షోభం వచ్చి, మరొక పునరేకీకరణ అవసరం కావచ్చు. మూడు దశాబ్దాలుగా తూర్పు యూరప్‌ను కొద్దికొద్దిగా కొరుక్కుతింటున్న అమెరికాకు ఇప్పుడు బ్రేక్ పడింది. రష్యాతోను, చైనాతోనూ కలసి ప్రపంచాన్ని పంచుకోవలసిందే కానీ ఏకఛత్రాధిపత్యం కుదరదని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి.


అది మంచిదే కదా? ఏకధ్రువ ప్రపంచం కంటె, ఇద్దరు ముగ్గురు దొరల ప్రపంచంలో, బలహీనులకు కాస్త వెసులుబాటు ఉంటుంది. అన్నిటికంటె, సానుకూల పరిణామం, ఈ యుద్ధంలో అంతర్జాతీయ ఉగ్రవాదం అనే భూతం లేదు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో జరిగిన యుద్ధాలు, పోరాటాలు అన్నీ ఇస్లామిక్ ఉగ్రవాదం చుట్టూ తిరిగాయి. ఇది ఒకే మతానికి చెందిన రెండు దేశాల మధ్య పోరు. సెక్యులర్ యుద్ధం ఇది. అంతర్జాతీయ ఉగ్రవాదం బూచితో, దేశదేశాలలో విస్తరిస్తున్న మెజారిటేరియన్ తీవ్రజాతీయవాదానికి ఈ పరిణామం విఘాతం కలిగించవచ్చు. కనీసం అంతర్జాతీయ ప్రోత్సాహం తగ్గిపోవచ్చు. భారత్ వంటి దేశాలలో ఇది సానుకూల పరిణామాలకు దోహదం చేయవచ్చు. నయా నాజీవాదులు అని ఉక్రెయిన్ పాలకులను పుతిన్ అంటున్నాడు కానీ, అతని ఇటీవలి ప్రసంగాలు వింటుంటే, పూర్వపు రష్యా సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి అతి మితవాద జాతీయవాదాన్ని తప్పక ఆశ్రయిస్తాడనిపిస్తోంది. కాకపోతే, దాని ప్రాతిపదిక మతం కాదు.


మునుపటి యుద్ధాల కాలంలో సామాజిక మాధ్యమాలు పెద్దగా లేకపోవడం వల్ల, అందరికీ వైఖరులు తీసుకోవలసిన అవసరం లేకపోయేది. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా దాడి మీద మాట్లాడవలసిన అవసరం వచ్చిపడింది. మీడియా చూస్తేనేమో, పశ్చిమ దేశాల వార్తాసంస్థలు గుమ్మరించే సమాచారంతో స్పందనలను రూపొందించుకుంటోంది. రష్యాకేమో గ్లోబల్ మీడియాను ప్రభావితం చేసే శక్తి రాలేదు. గూగుల్, ఫేస్‌బుక్‌ సహా మనోభావాల వ్యాపారాలు చేసే సంస్థలన్నీ రష్యా వ్యతిరేక వైఖరి తీసుకున్నాయి. మనం వింటున్నవి, రాస్తున్నవి, చదువుతున్నవి అనేకం, అమెరికా పక్షం రూపొందించి వదిలినవి. సహజ లోకజ్ఞానంతో, ఉద్యమాలు, పఠనం, వివేచన ఆధారంగా కొందరు మంచిచెడ్డలు చెబుతున్నారు కానీ, విపరీత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది అంత తొందరగా నిర్ధారణ చేసే అంశం కాదు. యుద్ధ వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. అట్లాగే, అమెరికా వ్యతిరేకతా సరిపోదు. సమస్యలోని సంక్లిష్టతను యథాతథంగా గుర్తించడమే చేయవలసిన పని. సాధ్యమైనంత ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి, తగినంత మనుగడను, భవిష్యత్తును మిగుల్చుకోవడమే మన వంటి దేశాలు చేయవలసిన పని. మహాశక్తుల ఘర్షణలో తలదూర్చకుండా, వాటి వైరుధ్యాల నుంచి లాభపడడం ఎట్లాగో, ఆ మార్గాన్ని దేశభక్తులైన పాలకులు అనుసరించాలి. మారుతున్న ప్రపంచపటం చూడండి. ఒకనాటి రవి అస్తమించని సామ్రాజ్యం ఒక చిన్న ఐరోపా రాజ్యంగా మారడాన్ని చూశాము. ప్రపంచాన్ని గడగడలాడించిన అమెరికా రానున్న దశాబ్దాలలో ఒకానొక అగ్రరాజ్యంగా మాత్రమే, కోరలు తీసిన పాములా మారిపోవడం చూస్తామేమో?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-03-03T10:05:13+05:30 IST