అర్హులకు దక్కని.. ‘పట్టా’భిషేకం

ABN , First Publish Date - 2021-01-07T05:06:25+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ అనేకచోట్ల వివాదాస్పదమవుతోంది. అర్హత ఉన్నా కొంతమందికి పట్టాలు అందడం లేదు. వైసీపీ నాయకులు చెప్పిన వాళ్లకే పట్టాలు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, స్పీకర్‌ల సొంత నియోజకవర్గాల్లోనే అర్హులను పక్కనపెట్టి.. ఇళ్లు ఉన్న వారికే మళ్లీ పట్టాలు కేటాయించినట్లు పెద్దఎత్తున దుమారం రేగుతోంది. పోలాకి మండలం ప్రియాగ్రహారంలో అర్హులకు పట్టాలు ఇవ్వలేదు. పట్టా కావాలంటే డబ్బులు చెల్లించాలని చోటా నాయకుడు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

అర్హులకు దక్కని.. ‘పట్టా’భిషేకం
ఇచ్ఛాపురం రూరల్‌ : లొద్దపుట్టిలో నిరసన తెలియజేస్తున్న గ్రామస్థులు

ఇళ్ల పట్టాల మంజూరులో అన్యాయం

వైసీపీ నేతల సిఫారసులకు ప్రాధాన్యం

లొద్దపుట్టిలో వెల్లువెత్తిన నిరసనలు 

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/ఇచ్ఛాపురం రూరల్‌)

ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ అనేకచోట్ల వివాదాస్పదమవుతోంది. అర్హత ఉన్నా కొంతమందికి పట్టాలు అందడం లేదు. వైసీపీ నాయకులు చెప్పిన వాళ్లకే పట్టాలు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, స్పీకర్‌ల సొంత నియోజకవర్గాల్లోనే అర్హులను పక్కనపెట్టి..  ఇళ్లు ఉన్న వారికే మళ్లీ పట్టాలు కేటాయించినట్లు పెద్దఎత్తున దుమారం రేగుతోంది. పోలాకి మండలం ప్రియాగ్రహారంలో అర్హులకు పట్టాలు ఇవ్వలేదు. పట్టా కావాలంటే డబ్బులు చెల్లించాలని  చోటా నాయకుడు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. టెక్కలి మేజర్‌ పంచాయతీలో 360 మంది అనర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు స్వయంగా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి.. ముఖ్యమంత్రి జగన్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. టెక్కలి, తలగాం, తేలినీలాపురం, బన్నువాడ గ్రామాల్లో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయుంచడంతో పట్టాల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఇచ్ఛాపురంలో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదంటూ స్థానికులు నిరసన తెలిపారు. పలాస నియోజకవర్గంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల పట్టాల పంపిణీ ముందుకు సాగడం లేదు. పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీపై అనేక విమర్శలు వస్తున్నాయి. రేగిడి మండలం సంకిలి గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని పట్టాల పంపిణీకి కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అక్కడ అనేకమందికి అర్హత ఉన్నా పట్టా అందలేదని బాధితులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. 


జాబితాలో పేర్లు తొలగిస్తారా?


ఇళ్ల పట్టాల పంపిణీలో అనర్హులకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో నేతలు, అధికారుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం లొద్దపుట్టిలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సొంత ఇళ్లు ఉన్నవారికే పట్టాలు మంజూరు చేయగా.. నిరుపేదల పేర్లు మాత్రం జాబితాలో కనిపించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. తొలిజాబితాలో ఉన్న కొందరి పేర్లు... పంపిణీ సమయంలో తొలగించారు. దీనిపై స్థానికులు సుమారు 50 మంది నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వెనుదిరిగారు.  జాబితాలో పేర్లు తొలగిస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ మండిపడ్డారు. దీంతో పోలీసుల సాయంతో సభను నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ విషయమై తహసీల్దార్‌ బి.మురళీమోహన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. వివిధ సాంకేతిక కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జాబితాను సరిచేసి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. 


 సచివాలయాల్లో జాబితాలు ఏవీ...


ప్రభుత్వం ప్రకటించిన విధంగా గ్రామాల్లో ఇళ్ల పట్టాల అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేయాలి. కానీ స్థానిక వైసీపీ నేతల ఆజ్ఞలను పాటిస్తున్న అధికారులు సచివాలయాల్లో ఎక్కడా లబ్ధిదారుల జాబితా ఏర్పాటు చేయలేదు. ఇదేమని ప్రశ్నిస్తే, సాంకేతిక చిక్కుల కారణంగా జాబితాలు రూపొందిచలేదని బదులిస్తున్నారు. 


నాయకులు చెబితేనే... 


అర్హులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు సిఫారసు చేసిన వారికే పట్టాలు మంజూరవడం విమర్శలకు తావిస్తోంది. కొందరు చోటా నాయకులు లబ్ధిదారుల జాబితాలను తమవద్ద పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు సిఫారసు చేసిన వారికే అధికారులు పట్టాలు అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థలాల కేటాయింపులో అనుయాయులకు ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. రహదారి పక్కన అయితే ఒక విధంగా... కాస్త దూరంగా ఉంటే మరో విధంగా వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులకు పట్టాలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.  


నిరాశే మిగిలింది


అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తోందని తెలిసి ఎంతో సంబరపడ్డాం. వలంటీరు రెండుసార్లు ఇంటికి వచ్చి సర్వే చేసి.. అర్హులుగా గుర్తించామని తెలిపారు. గ్రామసభకు వెళ్లి చూడగా.. మా పేరు అర్హుల జాబితాలో లేదు. నిరాశతో వెనుదిరిగాను. సొంతిల్లు ఉన్నవారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు తప్ప.. పేదలకు న్యాయం చేయడం లేదు. 

- సాడి రోహిణి, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం


తొలిజాబితాలో పేరున్నా..

మాకు సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని తెలుసుకుని వలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. తొలిజాబితాలో మా పేరు కనిపించింది. పంపిణీ సమయంలో పట్టా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదని అడిగినా ఎవరూ స్పందించడం లేదు. అధికారులే మాకు న్యాయం చేయాలి. 

-నైన మాధురి, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం

Updated Date - 2021-01-07T05:06:25+05:30 IST