దీక్షలు బాబోయ్‌ దీక్షలు

ABN , First Publish Date - 2021-12-09T05:03:12+05:30 IST

‘మమ్మల్ని నమ్మండి.. మేం పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తున్నాం.. జిల్లాలో మద్యం విక్రయాల తగ్గుదలకు ప్రజల్లో పెరిగిన భక్తి భావమే కారణం. కరోనా అనంతరం ఈ ఏడాదే అయ్యప్ప మాలలు ఎక్కువ మంది వేశారు. దానికితోడు రాష్ట్ర ప్రజలు పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చింది. అందుకే జిల్లాలో మద్యం విక్రయాలు తగ్గాయి’. ఇదీ జిల్లాలోని సెబ్‌ అధికారులు ప్రభుత్వానికి వినిపిస్తున్న మొర. ఆ మేరకు నివేదికపై నివేదికలు కూడా పంపారు.

దీక్షలు బాబోయ్‌ దీక్షలు

మద్యం విక్రయాలు తగ్గడానికి అదే కారణం 

సెబ్‌ అధికారుల గగ్గోలు

అటు స్వామి మాలలు,

ఇటు కార్తీకమాసం ప్రభావం

ఇతర రాష్ట్రాల మద్యం రాకే కారణమన్న 

అనుమానల్లో ప్రభుత్వం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

‘మమ్మల్ని నమ్మండి.. మేం పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తున్నాం.. జిల్లాలో మద్యం విక్రయాల తగ్గుదలకు ప్రజల్లో పెరిగిన భక్తి భావమే కారణం. కరోనా అనంతరం ఈ ఏడాదే అయ్యప్ప మాలలు ఎక్కువ మంది వేశారు. దానికితోడు రాష్ట్ర ప్రజలు పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చింది. అందుకే జిల్లాలో మద్యం విక్రయాలు తగ్గాయి’. ఇదీ జిల్లాలోని సెబ్‌ అధికారులు ప్రభుత్వానికి వినిపిస్తున్న మొర. ఆ మేరకు నివేదికపై నివేదికలు కూడా పంపారు. రాష్ట్రంలో ఇటీవల మద్యం విక్రయాలు తగ్గాయి. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా కలెక్టర్లతో వారంవారం సమీక్ష చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిఽధంగా ప్రస్తుతం రోజువారీ మద్యం విక్రయాలపై ఆధారపడిన ప్రభుత్వం ఆదాయం తగ్గడానికి ఇతర రాష్ట్రాల మద్యం రాకే కారణమని భావిస్తోంది. అయితే అదేంకాదు కార్తీకమాసం, అయ్యప్ప దీక్షల ప్రభావమే కారణమని సెబ్‌ అధికారులు వివరణ ఇచ్చుకుంటున్నారు. 


రోజుకు రూ.కోటి మేర తగ్గిన అమ్మకాలు 

జిల్లాలో ప్రభుత్వ దుకాణాల ద్వారా రోజువారీ సరాసరిన రూ.4.50 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆ ప్రకారం  వారానికి రూ.31.50 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. అయితే నవంబరు ఆరంభం నుంచి విక్రయాలు పడిపోయాయి. రోజువారీ సరాసరిన రూ.3.50 కోట్ల మద్యం మాత్రమే విక్రయిస్తున్నారు. తదనుగుణంగా రోజుకు రూ.కోటికిపైగా ఆదాయం తగ్గిపోయింది.  జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు 220 ఉండగా, ఇటీవల మరో 15 మాల్స్‌ను ప్రారంభించారు. అయినా విక్రయాలు పడిపోయాయి. దీంతో  సంక్షేమ పథకాల అమలు, ఇతర నిర్వహణకు సంబంధించి మద్యం ఆదాయంపైనే ఆధారపడిన ప్రభుత్వం కలవరపడుతోంది. వారంవారం చీఫ్‌ సెక్రటరీనే ఉన్నతాధికారులతో నేరుగా సమీక్షించడం, వారు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచడం జరుగుతోంది.


జోరుగా పొరుగు మద్యం విక్రయాలు 

రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతోపాటు, నాణ్యతలోనూ తేడా ఉందన్న భావన మద్యపానప్రియుల్లో ఉంది. తదనుగుణంగా అవకాశం ఉంటే ఇటు తెలంగాణ, అటు కర్ణాటక నుంచి లేదా ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని  అక్రమంగా తెచ్చి విక్రయిస్తున్న వారి వద్ద కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ అనుమానంతోనే షాపు వారీ విక్రయాలపై, ప్రత్యేకించి ఆయా దుకాణాల పరిధిలో నెలకొన్న పరిస్థితులను ఉటంకిస్తూ సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. అయితే అసలు సిసలు కారణం ఏదైనప్పటికీ సెబ్‌ అధికారులు మాత్రం ‘నవంబరు 5 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఆ నెలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే కుటుంబాల్లోని మద్యపానప్రియులు మందుకు దూరంగా ఉంటారు. ఇక ఈ సమయంలోనే అయ్యప్ప దీక్షధారులు కూడా అధికంగా ఉంటారు. ఈ ఏడాది కరోనా ఉధృతి కూడా తగ్గడంతో మాలలు వేసుకున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో మద్యం విక్రయాలు తగ్గాయే తప్ప ఇతరత్రా తమ లోపం లేదని’ ఉన్నతాధికారులకు వివరణ పంపుతున్నారు. అయినప్పటికీ జిల్లాలో మద్యం అమ్మకాల లక్ష్యాలను పెంచుతూ ప్రభుత్వం సరికొత్త్త నిర్ణయం తీసుకుంది. గతంలో వారానికి రూ.31.5 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతూ ఇప్పుడు అది రూ.27 కోట్లకు పడిపోయినప్పటికీ తాజాగా వారానికి రూ.36 కోట్ల విలువైన మాద్యాన్ని అమ్మాలని ప్రభుత్వం టార్గెట్‌ విధించింది. దీన్ని బట్టి ప్రభుత్వానికి మద్యమే మహాఆదాయంగా మారినట్లు అర్థమవుతుంది. 

Updated Date - 2021-12-09T05:03:12+05:30 IST