ప్రణయ్‌ హత్య కేసులో విచారణ మొదలు

ABN , First Publish Date - 2022-01-12T09:02:47+05:30 IST

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణను ప్రారంభించింది.

ప్రణయ్‌ హత్య కేసులో విచారణ మొదలు

  • జూలై 21వరకు విచారించనున్న కోర్టు
  • ప్రణయ్‌ తల్లిదండ్రులు, భార్య విచారణ పూర్తి 
  • వివరాలు కోర్టుకు తెలిపిన బాధిత కుటుంబం


మిర్యాలగూడ, జనవరి 11: సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణను ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభం కాగా.. జూలై 21 వరకు కొనసాగనుంది. రోజువారీగా 102 మందిని విచారించనుండగా.. కోర్టు ఇప్పటికే ప్రణయ్‌ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. 2018 సెప్టెంబరు 14వ తేదీన గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా.. దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి, హతమార్చిన విషయం తెలిసిందే.


కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అదే ఏడాది సెప్టెంబరు 18న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో అమృత తండ్రి మారుతీరావు, సుభా్‌షశర్మ, అబ్దుల్‌బారీ, అస్గర్‌అలీ, అబ్దుల్‌ కరీం, శ్రవణ్‌కుమార్‌, డ్రైవర్‌ శివ, నిజాం ఉన్నారు. బెయిల్‌పై బయటకొచ్చిన మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది జనవరి నుంచి విచారణ ప్రారంభించాల్సి ఉండగా.. కొవిడ్‌ కేసుల ఉధృతి కారణంగా కోర్టుల్లో భౌతిక విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 3న ప్రారంభమైన విచారణలో కోర్టు మంగళవారం వరకు ప్రణయ్‌ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృతవర్షిణి నుంచి వివరాలను నమోదు చేసుకుంది.

Updated Date - 2022-01-12T09:02:47+05:30 IST