మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-05-19T07:09:21+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లకు బుధవారం ఆ పార్టీనేతలు శ్రీకారం చుట్టారు.

మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం
భూమి పూజ చేస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

భూమిపూజ చేసి ప్రారంభించిన అచ్చెన్నాయుడు

పలువురు రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలు హాజరు

మండవవారిపాలెం గ్రామపెద్దలతో భేటీ

ప్రాంగణంలో ఏర్పాట్లపై కీలక నేతలతో సమీక్ష

రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం నాటి రోజులు  పునరావృతం

ప్రత్యేక పరిస్థితులతోనే ఒంగోలును ఎంపిక చేసినట్లు వెల్లడి


ఒంగోలు, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లకు బుధవారం ఆ పార్టీనేతలు శ్రీకారం చుట్టారు. ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు పార్టీ నిర్ణయించిన విషయం విదితమే. ఒంగోలు ఉత్తర బైపాస్‌ జంక్షన్‌ సమీపంలోని బృందావనం కల్యాణమండపం వెనుక వైపున మండవవారిపాలెం గ్రామపరిధిలో రైతులకు చెందిన వంద ఎకరాల్లో మహానాడు ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు. అందులోభాగంగా బుధవారం ఉదయం 11.11గంటలకు టీడీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో పలువురు రాష్ట్ర, ఉమ్మడి జిల్లా ముఖ్యనేతల సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర ముఖ్యనేతలైన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, కేంద్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్లతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బీఎన్‌ విజయ్‌కుమార్‌, అశోక్‌రెడ్డి, దివి శివరాం, నారపుశెట్టి పాపారావు, ఎరిక్షన్‌బాబు, పమిడి రమేష్‌, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులతో పాటు జిల్లాలోని ముఖ్యనేతలు పాల్గొన్నారు.


ఈ మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యం

భూమిపూజ కార్యక్రమానికి ముందు స్థానిక విష్ణుప్రియ కల్యాణ మండపంలో మహానాడు ఏర్పాట్లపై ముఖ్య నేతలు, మండవవారిపాలెం రైతులతోనూ అచ్చెన్నాయుడు.. ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయుతీ కాగా రెండేళ్లు కొవిడ్‌తో బహిరంగంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలా రెండేళ్ల అనంతరం మూడో ఏడాది ప్రత్యేకించి టీడీపీకి దేవుడైన ఎన్టీఆర్‌ శత జయంతి నేపథ్యంలో ఒంగోలులో మహానాడు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రంలో జగన్‌ సాగిస్తున్న దుర్మార్గపు పాలనలో అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ దాడులకు గురవుతున్నారన్నారు. ప్రకాశం జిల్లాలో అనేక సమస్యలతో అత్యధిక మంది ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం సంక్షోభంలో పడి రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుండగా, చేనేతలు ఇతర వర్గాల ప్రజలను ఆదుకొనే వారు లేక అల్లాడుతున్నారన్నారు. పరిశ్రమలు లేక ఉపాధి దొరక్క యువకులు, పేదలు వలసలు భారీగా ఉంటుండటం, సేద్యానికి సాగునీరు అందక, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా అభివృద్ధిపై అసలు దృష్టిపెట్టలేదని మండిపడ్డారు. ఇలాంటి బాధలు పడుతున్న, వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్న ప్రకాశంలో మహానాడు నిర్వహించి రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనను తరిమికొట్టేందుకు ప్రతినబూననున్నామన్నారు. 


తొలిరోజు 10వేల మందితో ప్రతినిధుల సభ

తొలిరోజు 10వేల మందితో జరిగే ప్రతినిధుల సభలో 17 అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే 28 మధ్యాహ్నం 3గంటల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే టీడీపీ శ్రేణులతో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు. మహానాడు ప్రాంగణంలో వేదిక నిర్మాణం, ప్రతినిధుల సభ, రక్తదాన శిబిరం, పొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు, పార్కింగ్‌ ఇతరత్రా వాటికి స్థలం కేటాయింపు తదితరాలపై రూపొందించిన ప్రాంగణం స్కెచ్‌ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై కీలక నేతలతో సమీక్షించి తగు సూచనలు చేశారు. 


మినీ స్టేడియం జగన్‌ జాగీరా!

మహానాడు ఏర్పాటుకు నిబంధనల ప్రకారం ఒంగోలులో మినీస్టేడియం ఇవ్వాలని కోరితే తొలుత అంగీకరించిన అధికారులు తర్వాత సీఎం సూచనలు, సీఎంవో ఒత్తిళ్లతో ఎగ్గొట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంగోలు స్టేడియం జగన్‌ తండ్రిదా, లేక అతని జాగీరా అని మండిపడ్డ అచ్చెన్నాయుడు ప్రభుత్వపరంగా అడ్డంకులు సృష్టించినా మండవవారి పాలెం పొలాల్లో రైతుల సహకారంతో మహానాడును దిగ్విజయంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం నాడు పార్టీ పట్ల ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో తిరిగి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తున్నదన్నారు. అందుకు చంద్రబాబునాయుడు పర్యటనలు విజయవంతం, గడపగడపకూ నిలదీతలే నిదర్శనమన్నారు. కాగా 27, 28 తేదీల్లో జరిగే మహానాడులో కేవలం టీడీపీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా చర్చకు పరిమితంకామని రాష్ట్ర భవిష్యత్‌, ప్రజల సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీగా చేయాల్సిన కృషిపై దృష్టిపెడతామన్నారు. 


టీడీపీ చరిత్రలో మండవవారిపాలెం నిలిచిపోతుంది

 ‘ఒంగోలులో మహానాడు నిర్వహించేందుకు స్టేడియాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. వైసీపీ దుర్మార్గపు పాలనను లెక్క చేయకుండా మహానాడు నిర్వహణకు మండవవారిపాలెం రైతులు పొలాలు ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల టీడీపీశ్రేణులు, అధినేత చంద్రబాబునాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు’ అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడు నిర్వహణకు సహృదయంతో అంగీకరించడంతో టీడీపీ చరిత్రలో మండవవారిపాలెం నిలిచిపోతుందన్నారు. ఈనెల 27,28 తేదీల్లో ఒంగోలులో జరగనున్న మహానాడును నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో నిర్వహించేలా పార్టీ ముఖ్యనేతలు నిర్ణయం తీసుకోగా ఆ గ్రామ రైతులు స్వాగతించారు. బుధవారం ఉదయం మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ సందర్భంగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో మండవవారిపాలెం గ్రామపెద్దలు, రైతులతో అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇతర రాష్ట్ర, జిల్లా నేతలు భేటీ అయ్యారు. తమ గ్రామపరిధిలో మహానాడు నిర్వహించాలని అధినేత నిర్ణయం తీసుకోవడాన్ని గ్రామస్థులంతా స్వాగతిస్తున్నారని మాజీ సర్పంచ్‌ కారుమూడి శ్రీమన్నారాయణ తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌ తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంలో కూడా తమ గ్రామ దళితవాడలో బస చేశారని గుర్తుచేసిన ఆయన ఆ స్ఫూర్తితో మహానాడుకు సహకరిస్తామన్నారు. మహానాడును ఇక్కడ నిర్వహించడం సంతోషంగా ఉందని గ్రామం తరఫున ఎలాంటి అవసరం ఉన్నా సంపూర్ణంగా అందరం భాగస్వాములం అవుతామని సర్పంచ్‌ మండవ వెంకటసుబ్బయ్య చెప్పారు. మాజీ సర్పంచ్‌ రామకృష్ణ పలువురు గ్రామపెద్దలు, రైతులు హాజరుకాగా వారినుద్దేశించి మాట్లాడిన అచ్చెన్నాయుడు మహానాడు సందర్భంగా గ్రామపెద్దలు, మహిళలతో పార్టీ అధినేత ప్రత్యేకంగా మాట్లాడే ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మహానాడుకు వచ్చేవారిని గ్రామ అతిథుల్లా మీరంతా భావించడాన్ని పార్టీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెడతామన్నారు. ఇక్కడ మహానాడు నిర్వహణతో దేశ, విదేశాల్లోని తెలుగు వారందరికీ మండవవారిపాలెం గురించి తెలుస్తుందన్నారు. 




Updated Date - 2022-05-19T07:09:21+05:30 IST