ఇన్ఫోసిస్‌ అదుర్స్‌

ABN , First Publish Date - 2020-07-16T05:54:54+05:30 IST

కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తన సత్తా చాటింది. జూన్‌, 2020తో ముగిసిన తొలి త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.23,665 కోట్ల ఆదాయంపై...

ఇన్ఫోసిస్‌ అదుర్స్‌

  • త్రైమాసిక లాభం 4272 కోట్లు


బెంగళూరు: కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తన సత్తా చాటింది. జూన్‌, 2020తో ముగిసిన తొలి త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.23,665 కోట్ల ఆదాయంపై రూ.4,272 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 8.5 శాతం, నికర లాభం 12.4 శాతం పెరిగాయి. కొన్ని ఇబ్బందులున్నా ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఆదాయ వృద్ధి రెండు శాతం ఉండొచ్చని తెలిపింది. కంపెనీ డిజిటల్‌ టెక్నాలజీ సేవల ఆదాయమూ 25 శాతం పెరిగి 138 కోట్ల డాలర్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఇది 44.5 శాతానికి సమానం. నిర్వహణ లాభం 20 శాతం పెరిగి రూ.5,365 కోట్లకు చేరింది. నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం నిర్వహణ లాభం 8.9 శాతం మాత్రమే పెరిగింది. 


20,000 మంది ఫ్రెషర్స్‌కు జాబ్స్‌: కోవిడ్‌తో వ్యాపార అనిశ్చితి నెలకొన్నా జూలై-సెప్టెంబరు  త్రైమాసికంలో కొత్తగా 20,000 మందికిపైగా ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఇన్ఫోసిస్‌ సిద్ధమవుతోంది. అక్టోబరు తర్వాత దశలవారీగా తీసుకుంటామని తెలిపింది. వీరికి తోడు ఐటీ సేవల్లో అనుభవం ఉన్న వారికి ఇచ్చిన జాబ్‌ ఆఫర్స్‌లోనూ, 90 శాతం మంది ఇప్పటికే చేరినట్టు కంపెనీ సీఓఓ ప్రవీణ్‌ రావు చెప్పారు. దీంతో జూన్‌, 2020 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,233కు చేరింది. 

తగ్గిన అట్రిషన్‌: మంచి అవకాశాల కోసం తమంతట తాము కంపెనీ నుంచి తప్పుకునే ఉద్యోగుల సంఖ్య జూన్‌ త్రైమాసికంలో బాగా తగ్గింది. అట్రిషన్‌ రేటు గత ఏడాది ఇదే కాలంలో 20.2 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 11.7 శాతానికి తగ్గింది. 

ఈపీఎస్‌ రూ.9.98: ఆదాయం, నికర లాభంతో పాటు జూన్‌ త్రైమాసికంలో ఒక్కో వాటాపై ఆర్జించే ఈపీఎ్‌సను కంపెనీ రూ.9.98కు పెంచుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13.1 శాతం ఎక్కువ. అయితే మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం, జూన్‌ త్రైమాసికంలో ఈపీఎస్‌ రెండు శాతం తగ్గింది. 

170 కోట్ల డాలర్ల కొత్త డీల్స్‌: జూన్‌ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ కొత్తగా 170 కోట్ల డాలర్ల విలువైన డీల్స్‌ కొత్తగా సంపాదించింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది అయిదు కోట్ల డాలర్లు ఎక్కువ. ఈ ఏడాది మార్చి నాటికి 1,411 కంపెనీలు కంపెనీ నుంచి ఐటీ సేవలు అందుకుంటున్నాయి. జూన్‌ నాటికి ఇది 1,458కు చేరింది. ఇందులో కోటి డాలర్ల కంటే ఎక్కువ విలువైన డీల్స్‌ రెండు కంపెనీల నుంచి ఉండగా 11 కంపెనీల నుంచి 10 లక్షల డాలర్ల కంటే ఎక్కువ విలువైన డీల్స్‌  లభించాయి. అయితే ఇదే  కాలంలో కంపెనీ 10 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ విలువైన డీల్స్‌ ఇచ్చే మూడు కంపెనీలను, అయిదు కోట్ల డాలర్ల కంటే ఎక్కువ విలువైన డీల్‌ ఇచ్చిన ఒక కంపెనీని కోల్పోయింది.


Updated Date - 2020-07-16T05:54:54+05:30 IST