కరోనాతో ‘ఐటీ’కి సవాలే!

ABN , First Publish Date - 2020-03-12T07:03:44+05:30 IST

కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటం భారత ఐటీ కంపెనీలకూ సవాలేనని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎ్‌ఫఓ వీ బాలకృష్ణన్‌ అన్నారు. ఈ వైరస్‌ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్ల వ్యాపారం తీవ్రంగా...

కరోనాతో ‘ఐటీ’కి సవాలే!

  • 2020-21లో ఇండస్ట్రీ వృద్ధిపై తీవ్ర ప్రభావం
  • ‘2008 మాంద్యం’ పరిస్థితులు పునరావృతం
  • ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ బాలకృష్ణన్‌ 

బెంగళూరు: కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటం భారత ఐటీ కంపెనీలకూ సవాలేనని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ వీ బాలకృష్ణన్‌ అన్నారు. ఈ వైరస్‌ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్ల వ్యాపారం తీవ్రంగా ప్రభావితమవుతోందని, దాంతో క్లయింట్లు తమ ఐటీ వ్యయాలను తగ్గించుకోవచ్చన్నారు. తత్ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత ఐటీ రంగ వృద్ధి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఆయనింకా ఏమన్నారంటే..


విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మన ఐటీ కంపెనీల ఆన్‌-సైట్‌ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే రిమోట్‌ సేవల ద్వారా ఈ ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోగలిగే వెసులుబాటు ఉంటుంది. 

ఆర్థిక సేవలు, ఎయిర్‌లైన్స్‌, రిటైల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలే మన ఐటీ ఇండస్ట్రీకి  ప్రధాన క్లయింట్లు. ఈ రంగాల కంపెనీలపై ‘కరోనా’ అధిక ప్రభావం చూపుతోంది. దాంతో ఈ రంగాలకు చెందిన క్లయింట్లు ఐటీ, డిజిటల్‌ పరివర్తనం కోసం కేటాయించుకున్న బడ్జెట్‌ను కుదించుకోవచ్చు. 

ఐటీ కంపెనీలపై క్లయింట్ల వ్యయ నియంత్రణ ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి లో కనపడనుంది.

2008 ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు పునరావృతం కావచ్చని నాకన్పిస్తోంది. కాకపోతే, ఈసారి ఎదుర్కోబోతున్న సమస్య వేరు. వైరస్‌ ప్రభావం ఎన్నాళ్లనేది ఇప్పుడే చెప్పలేం. 

ఇప్పటికే అమెరికా, యూరప్‌, జపాన్‌ ఆర్థిక వృద్ధి మందగమనంలోకి జారుకుంది. ఇది ఇండస్ర్టీ క్లయింట్ల ఐటీ ఖర్చులపై తీవ్రప్రభావం చూపనుంది. 


వృద్ధి 2 శాతం వరకు తగ్గొచ్చు: బార్‌క్లేస్‌

ఆర్థిక వృద్ధి రేటుకు కరోనా వైరస్‌ వ్యాప్తితో మరింత గండిపడవచ్చని బ్రిటన్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ హెచ్చరించింది. ఈ వైరస్‌ నియంత్రణ కోసం చేపట్టే చర్యలు అంతర్గత, విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని.. తత్ఫలితంగా జీడీపీ వృద్ధి 2 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని తాజా నివేదికలో అంచనా వేసింది. ఈమధ్యకాలంలో ముడి చమురు ధరలు అనూహ్యంగా తగ్గడం మాత్రం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశమని, జీడీపీ వృద్ధికి 0.50 శాతం మేర దోహదపడవచ్చని అంటోంది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లోని 1.10 లక్షలకు పైగా మందికి కరోనా వైరస్‌ సోకింది. భారత్‌లో వీరి సంఖ్య 60 దాటింది. 


అడిడాస్‌, ప్యూమా గజగజ!

ఈ ఏడాది తమ వ్యాపారాన్ని కరోనా వైరస్‌ భారీగా దెబ్బతీయవచ్చని అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్‌ ఉత్పత్తుల బ్రాండ్లు అడిడాస్‌, ప్యూమా ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా తొలి త్రైమాసికంలో(జనవరి-మార్చి) పనితీరుపై తీవ్ర ప్రభా వం పడవచ్చని అంటున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాతోపాటు పలు దేశాల్లో ఈ రెండు కంపెనీలు తమ రిటైల్‌ స్టోర్లు మూసేయాల్సి వచ్చింది. 


వాహన ఉత్పత్తికి విఘాతం: సియామ్‌ 

కరోనా దెబ్బకు దేశంలో అన్ని రకాల వాహనాల ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలగనుందని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) అంటోంది. మన ఆటో కంపెనీలు 10 శాతం వరకు ముడి సరుకులను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తితో చైనాలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. మిగతా వాటిల్లోనూ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుత పరిణామం బీఎస్‌-6 వాహనాల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపవచ్చని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా అన్నారు. ఇతర దేశాల నుంచి విడిభాగాల దిగుమతి కోసం ఆటో కంపెనీలు ప్రయత్నాలు జరుపుతున్నాయన్నారు. కొత్త మార్గాల్లో దిగుమతయ్యే విడిభాగాలకు నియంత్రణ మండలి పరీక్షలు జరిపి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుందని రాజన్‌ తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశీయంగా వాహన ఉత్పత్తి మళ్లీ పుంజుకునేందుకు సమయం పట్టవచ్చన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. 


భారత పరిశ్రమలపై ప్రభావం: గోయల్‌ 

చైనాలో కరోనా వైరస్‌ విజృంభణ భారత పరిశ్రమలపైనా ప్రభావం చూపనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ముడి సరుకులు, విడిభాగాలు, ఇతర పరికరాల కోసం ప్రధానంగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్న దేశీయ ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌, ఆటోమొబైల్‌ కంపెనీలు అధికంగా ప్రభావితం కానున్నాయని తెలిపారు.


పత్తి ఎగుమతులపై ప్రభావం లేదు: సీఏఐ

పత్తి ఎగుమతులపై కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదని కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంటోంది. ఈ సీజన్‌లో మొత్తం పత్తి ఎగుమతులు 42 లక్షల బేళ్ల స్థాయిలో ఉండవచ్చని అంచనా వేసింది. పత్తి ఎగుమతుల సీజన్‌ అక్టోబరులో మొదలవుతుంది. క్రితం సీజన్‌లో చైనాకు 8 లక్షల బేళ్ల పత్తిని ఎగుమతి చేశారు.

Updated Date - 2020-03-12T07:03:44+05:30 IST