స్వాత్రంత్య్ర దినోత్సవం వేళ అసాంఘికం

ABN , First Publish Date - 2022-08-17T05:59:22+05:30 IST

కంభం మండలంలోని పెద్ద నల్లకాల్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక చర్యలకు పాల్పడ్డారు.

స్వాత్రంత్య్ర దినోత్సవం వేళ అసాంఘికం
హైస్కూల్‌ తరగతి గదిలో ఉన్న మద్యం సీసాలు

నల్లకాల్వ హైస్కూల్‌లో మందుబాబుల వీరంగం

తరగతి గదిలో మందు, విందు 

పోలీసులకు హెచ్‌ఎం ఫిర్యాదు

బేస్తవారపేట (కంభం), ఆగస్టు 16: కంభం మండలంలోని పెద్ద నల్లకాల్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక చర్యలకు పాల్పడ్డారు. విద్యార్థులు చదువుకొనే తరగతి గది అన్న విచక్షణ మరచి మద్యం సేవించి అక్కడే సీసాలు పగలగొట్టారు. దీంతో పాటు వారు తెచ్చుకున్న ఆహార పదార్థాల వ్యర్థాలను కూడా తరగతి గది అంతా పరిచారు. ఇక ఆ తరగతి గదిలోనే కాకుండా పాఠశాల మైదానంలో జాతీయజెండా ఆవిష్కరించిన స్తంభం వద్ద కూడా మద్యం సీసాలు పగలగొట్టారు.  మత్తులో తరగతి గదుల్లోనే మూత్ర విసర్జనను సైతం చేశారు. పాఠశాల వస్తువులను చిందరవందర చేశారు. గ్రామంలో ఎవరో  రాత్రివేళ భారీఎత్తున పార్టీ చేసుకొని ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ ఆనవాళ్లు ఉన్నాయి. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు గౌస్‌బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాతంత్య్ర దినాన మద్యం అమ్మకాలు, తాగడం నిషిద్ధం. అయినప్పటికీ, భారీఎత్తున మద్యంతో పార్టీ జరగడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. ఇక తరగతి గదులను అపరిశుభ్రం చేయడంపై హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత టెక్నాలజీ కాలంలో నిందితులను గుర్తించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే అంత చిత్తశుద్ధిగా, పోలీసులు వ్యవహరిస్తారో..? షరా‘మామూలే’ అన్నట్లు మిన్నుకుండిపోతారో..? వేచిచూడాల్సి ఉంది.


Updated Date - 2022-08-17T05:59:22+05:30 IST