పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:56:13+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకులు, మందుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.

పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలి
నిరసన తెలుపుతున్న వామపక్షాల నేతలు

వామపక్షాలు డిమాండ్‌ 

సిరిపురం , జూన్‌ 18: పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకులు, మందుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు,  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర  ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్క మే నెలలో 22 సార్లు పెంచిందని, దీంతో సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా, ధరలు పెంచి అధిక భారం మోపడం దుర్మార్గమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వలన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు రోజు గడవని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి పరిపాలిస్తోందని, సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. మరో పక్క  రాష్ట్రంలో వైసీపీ విద్యుత్‌ చార్జీలను పెంచిందన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టకపోతే దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు, సీపీఐ నగర కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, నాయకులు ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, బి.జగన్‌, యూఎస్‌ఎన్‌ రాజు, పి.చంద్రశేఖర్‌, లక్ష్మణరావు, జి.వామనమూర్తి, ఎం.మన్మథరావు, కె.కుమారి తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-06-19T05:56:13+05:30 IST