Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్ఫీ లాభం రూ.5,809 కోట్లు

ఆదాయ వృద్ధి అంచనా 19.5-20 శాతానికి పెంపు 


ఐటీ రంగంలో రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్‌ లాభం డిసెంబరు త్రైమాసికంలో 11.8 శాతం పెరిగి రూ.5,809 కోట్లుగా నమోదయింది. అంతక్రితం సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.5,197 కోట్లు. గత 3 నెలల్లో కంపెనీ ఆదాయం 22.9 శాతం వృద్ధితో రూ.31,867 కోట్లకు చేరుకుంది. అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ అంచనాలను 16.5-17.5 శాతం నుంచి 19.5-20 శాతానికి పెంచింది. సాధారణంగా ఐటీ రంగంలో బలహీన త్రైమాసికంగా పరిగణించే అక్టోరు-డిసెంబరు కాలంలోనూ తాము పటిష్ఠ పనితీరు కనబర్చగలిగామని కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. వ్యాపారాల డిజిటల్‌ పరివర్తనం ఊపందుకోవడంతో అన్ని విభాగాలు, మార్కెట్లలో మంచి వృద్ధి నమోదైందని, కొత్త ఆర్డర్లు సమృద్ధిగా ఉన్నాయని కంపెనీ అంటోంది. గత త్రైమాసికంలో రూ.253 కోట్ల డాలర్ల విలువైన బడా కాంట్రాక్టులు లభించాయి. గత మూడు నెలల కాలానికి కంపెనీ నిర్వహణ లాభా ల మార్జిన్‌ 23.5 శాతంగా నమోదైంది. అయితే, వార్షిక ప్రాతిపదికన 1.9 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 0.1 శాతం తగ్గింది. ఇన్ఫోసిస్‌ మొత్తం ఆదాయంలో డిజిటల్‌ సేవల విభాగం ద్వారా సమకూరిన వాటా 58.5 శాతంగా ఉంది. 


ఫ్రెషర్ల నియామకాలు 55 వేలు

గత త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు మాత్రం 25.5 శాతానికి ఎగబాకింది. దాంతో కంపెనీ నియామకాలను మరింత పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఫ్రెషర్ల నియామకాలు 55,000 దాటవచ్చని కంపెనీ భావిస్తోంది. గతంలో ప్రకటించిన 45,000 ప్రాంగణ నియామకాల ప్రణాళికతో పోలి స్తే ఇది 10 వేలు అధికం. డిసెంబరు 31 నాటికి కంపెనీలో మొత్తం 2,92,067 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2020 డిసెంబరుతో పోలిస్తే సిబ్బంది సంఖ్య మరో 42,755 మేర పెరిగింది.

Advertisement
Advertisement