సంతానలేమితో సతమతం

ABN , First Publish Date - 2022-05-22T07:02:35+05:30 IST

సంతానలేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది.

సంతానలేమితో సతమతం

వందకు ఏడెనిమిది జంటల్లో కనిపిస్తున్న సమస్య

ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, స్మోకింగ్‌, డ్రింకింగ్‌ అలవాట్లు, ఒబెసిటీ ప్రధాన కారణం

ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా...

ఇరువురిలో శారీరకపరమైన లోపాలు కూడా కారణం కావొచ్చు

పెళ్లయిన రెండేళ్లలోపు పిల్లలు పుట్టకపోతే పరీక్షలు తప్పనిసరి

నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సంతానలేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య  ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆరోగ్యవంతులైన దంపతులు ఏ విధమైన గర్భ నిరోధక జాగ్రత్తలు తీసుకోకపోయినా రెండేళ్లకు కూడా పిల్లలు కలగకపోవడాన్ని సంతానలేమిగా పేర్కొంటారు. ఈ సమస్యకు స్ర్తీ, పురుషుల్లో ఎవరైనా కారణం కావచ్చు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం ఈ సమస్య గణనీయంగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంతానలేమికి కారణాలు, వాటి పరిష్కార మార్గాలు తదితర అంశాలపై కథనం... 


7-8 శాతం మందిలో సమస్య.. 

గతంలో వేలాది మంది దంపతుల్లో ఒకటి, రెండు జంటల్లో మాత్రమే ఈ సంతానలేమి కనిపించేది. ప్రస్తుతం ఈ సమస్య ప్రతి వంద మంది దంపతుల్లో ఏడెనిమిది జంటల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంతో పోలిస్తే నగరం, పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.


వివాహాలు ఆలస్యం కావడం వల్ల

మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంటివి సంతాన లేమికి కొంతవరకూ కారణాలుగా ఉంటున్నాయి. అదే సమయంలో జీవితంలో స్థిరపడిన తరువాతే పెళ్లిళ్లు చేసుకోవాలన్న ఉద్దేశంతో నేటి యువత ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. ఇది సంతాన లేమికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పిల్లలను కనడానికి అమ్మాయిలకు 25-28 ఏళ్ల మధ్య వయసు అత్యుత్తమ సమయంగా పేర్కొంటున్నారు. అయితే, ప్రస్తుతం ఎక్కువ మంది జీవితంలో స్థిరపడిన తరువాతే పెళ్లి అనే ఉద్దేశంతో 30 ఏళ్ల వరకూ వివాహాలు చేసుకోవడం లేదని, దీంతో సంతాన లేమి కలుగుతోందన్నారు. 30 ఏళ్లు దాటిన తరువాత అమ్మాయిల్లో అండాల విడుదల సంఖ్య తగ్గుతుందని, ఆ సంఖ్య తగ్గుతున్న కొద్దీ గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.


మహిళల్లో సమస్యలు.. 

స్ర్తీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మార్పులు, గర్భ సంచి  చిన్నగా ఉండడం, అసలు లేకపోవడం, రెండు గదులుగా ఉండే గర్భ సంచి ట్యూబ్స్‌ మూసుకుపోవడం, అండాశయంలో సరైన ఎదుగుదల లేకపోవడం, యోనిమార్గం చిన్నదిగా ఉండడం, మూసుకుపోవడం, హార్మోన్‌ సమస్యలు, ఒబెసిటీ, రుతుచక్రంలో అసమతుల్యతలు కూడా సంతానలేమికి కారణాలుగా చెబుతున్నారు.


పురుషుల్లో సమస్యలు.. 

పురుషుల్లో శుక్రకణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఉన్న వాటిలో కదలికలు తగ్గడం, శుక్రకణాల నిర్మాణంలో తేడాలు, వృషణాల్లో ఉండే రక్తనాళాలు వాపునకు గురై వెరికో సిల్‌ సమస్య తలెత్తడం, వాటిలో నీరు చేరి హైడ్రోసిల్‌ సమస్య వస్తే శుక్రకణాలు ఉత్పత్తి తగ్గడం వల్ల సంతాలేమికి కారణం కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. పిట్యుటరీ, థైరాయిడ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల శుక్రకణాల ఉత్పత్తిపై ప్రభావం పడి సంతానలేమికి దారితీస్తోందన్నారు. అలాగే, అధిక బరువు, షుగర్‌ వంటి సమస్యలు, ఆలస్యంగా వివాహాలు, ఒత్తిడి వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం, తదితర అంశాలు సంతానలేమికి కారణమవుతున్నాయన్నారు.. 


ఏడాది దాటిన తరువాత.. 

వివాహమై ఏడాది దాటినా గర్భధారణ జరగకపోతే వైద్యులను సంప్రతించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యకు కారణాలను గుర్తించి మందులను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


వీటికి దూరంగా ఉండాలి.. 

వీలైనంత వరకు దంపతులు ఒత్తిడితో కూడిన జీవనానికి దూరంగా ఉండాలి. షిఫ్టుల వారీగా ఉద్యోగాలు చేస్తుండడం వల్ల భార్య,భర్తల మధ్య అన్యోన్యతకు అవకాశం ఉండడం లేదని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో సంతానలేమికి ఇదో ప్రధాన కారణంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్‌, ఒబెసిటీ, షుగర్‌ సమస్యతో ఇద్దరిలో ఎవరో ఒకరు బాధపడుతున్నా, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ అలవాట్లు ఉన్నా, సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోయినా ఈ సంతానలేమి వేధించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.


రెండేళ్లలోపు గర్భధారణ జరగకుంటే ఏదో సమస్య ఉన్నట్టే

- డాక్టర్‌ పద్మావతి, ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణులు

సంతానలేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. లేట్‌ మ్యారేజెస్‌, ఒబెసిటీ అమ్మాయిల్లో ఈ సమస్యకి ప్రధాన కారణం. అలాగే ఆల్కహాల్‌ తీసుకోవడం, స్మోకింగ్‌ అలవాట్లు కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు ఈ సమస్యకు దారితీస్తున్నాయి. వివాహమై రెండేళ్లు దాటుతున్నా గర్భధారణ జరగకపోతే ఏదో సమస్య ఉన్నట్టుగానే భావించాలి. కొందరు ఏళ్లు గడుస్తున్నా వైద్యులకు చూపించకుండా సమస్యను తీవ్రతరం చేసుకుంటారు. ఇది మంచిది కాదు. 



Updated Date - 2022-05-22T07:02:35+05:30 IST