విజయనగరం: గంటల వ్యవధిలో దంపతులు మృత్యువాత పడిన విషాద ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కలనిమెళ్లలో శుక్రవారం వెలుగుచూసింది. కలనిమెళ్లలో మీసాల కన్నాలు (80), అప్పలనర్సమ్మ (72) అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు జరగడంతో దంపతులిద్దరూ ఒంటరిగానే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటలకు కన్నాలు వయోభారంతో మృతిచెందారు. ఆ సమయానికి భార్య అప్పలనర్సమ్మ సతివాడలోని కుమార్తె ఇంటి వద్ద ఉంది. విషయం తెలుసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకుంది. భర్త విగతజీవిగా పడిఉండడాన్ని చూసి బోరుమంది. రాత్రంతా మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైంది. శుక్రవారం తెల్లవారుజాము పిల్లలందరూ ఇంటికి చేరుకోగా..వారిని పట్టుకొని రోదిస్తూ కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు గమనించేసరికి మృత్యువాత పడింది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో విషాదం అలుముకుంది.