బడ్జెట్ 2022: స్టార్టప్‌ల ప్రోత్సాహంపై పరిశ్రమ అంచనాలివే..

ABN , First Publish Date - 2022-02-01T12:30:43+05:30 IST

కోవిడ్ మహమ్మారి ప్రతి రంగంపై అనేక సవాళ్లను విసిరింది.

బడ్జెట్ 2022: స్టార్టప్‌ల ప్రోత్సాహంపై పరిశ్రమ అంచనాలివే..

కోవిడ్ మహమ్మారి ప్రతి రంగంపై అనేక సవాళ్లను విసిరింది. ఫలితంగా ఆయా రంగాలు ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ సంస్థల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి అదనపు సహాయాన్ని కోరుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, మూలధన సేకరణలో సడలింపులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీని వలన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం టైర్- 2, టైర్-3 నగరాల్లో స్టార్టప్‌లకు ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు సులభతర పథకాలను బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు, ఇది భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ వంటి వివిధ ప్రాంతాల అభివృద్ధికి కూడా సహాయపడుతుందని వారు చెబుతున్నారు. స్టార్టప్ పార్క్‌లు, జోన్‌లు ఏర్పాటు చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. వాటిలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఖర్చులలో రాయితీ అందించాలని కోరుతున్నారు. అలాగే భారతీయ స్టార్టప్‌లను పరీక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్ ఫెయిర్‌లు నిర్వహించాలని సూచిస్తున్నాయి. 


దేశంలో డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, బ్లాక్‌చెయిన్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్ ఆప్టిమైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ వంటి స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో వర్క్‌ఫోర్స్ లభ్యతకు సంబంధించిన సమస్యలను భారతదేశం ఎదుర్కొంటోంది. అందుకే ఈ దిశగా నైపుణ్యతలను అందించే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావాలని పలువురు సూచిస్తున్నారు. ఫలితంగా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా, స్టార్టప్‌లను ప్రోత్సహించినట్లవుతుందని వారంటున్నారు. కాగా కార్పొరేట్, సాధారణ పన్ను చెల్లింపుదారులు పన్ను రేట్లలో తగ్గింపును ఆశిస్తున్నారు. పెరుగుతున్న పత్తి ధరలు, ఇంధన ధరల కారణంగా టెక్స్‌టైల్ రంగం ఒత్తిడిలో ఉంది. టెక్స్‌టైల్ పరిశ్రమ.. ఎగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆశిస్తోంది. ముడి పత్తి దిగుమతిపై విధించిన 5 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించాలని లేదా తగ్గించాలని ఆ పరిశ్రమ ఆశిస్తోంది. సేవా రంగంలో వేగవంతమైన వృద్ధిని ప్రోత్సహించడానికి పన్ను రాయితీని అందించాలని బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోరుతోంది.

Updated Date - 2022-02-01T12:30:43+05:30 IST