Water ‘తాగేస్తున్న’ పరిశ్రమలు.. జీడిమెట్లలో తీగ లాగితే..!

ABN , First Publish Date - 2021-12-22T16:12:45+05:30 IST

Water ‘తాగేస్తున్న’ పరిశ్రమలు.. జీడిమెట్లలో తీగ లాగితే..!

Water ‘తాగేస్తున్న’ పరిశ్రమలు.. జీడిమెట్లలో తీగ లాగితే..!

  • వాడేది వేల కిలో లీటర్లు.. బిల్లు చెల్లించేది వందల కిలో లీటర్లకే.. 
  • క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలతో వాటర్‌బోర్డుకు రూ.కోట్లలో టోకరా 
  • యాజమాన్యాలకు సహకరిస్తున్న కొందరు అధికారులు 
  • అనుమతి లేకుండానే మీటర్ల మార్పు

హైదరాబాద్‌ సిటీ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమకు 75 ఎంఎం నల్లా కనెక్షన్‌ ఉంది. ఈ కనెక్షన్‌కు నెలకు కనీసం నీటి బిల్లు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు రావాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యం నెలకు రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది. ఉన్నతాధికారులు మీటర్‌ రీడింగ్‌ను పరిశీలిస్తే మోసం బయటపడుతుందని, ఇటీవల మీటర్‌ను మార్చేశారు. ప్రస్తుతం ఆ నీటి మీటర్‌లో రీడింగ్‌ 0070 మాత్రంగానే చూపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఓ ఉద్యోగి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మీటర్‌ మార్పులు, రీడింగ్‌లో అవకతవకలకు సహకరించి నందుకు ఆ డివిజన్‌లో కింది స్థాయి నుంచి సీజీఎం స్థాయి వరకు నెలకు కనీసం రూ.2 లక్షల వరకు ఆ కంపెనీ ముడుపులు ఇస్తున్నట్లు తెలిసింది.


వాటర్‌బోర్డు డివిజన్‌-12 చింతల్‌ పరిధిలోని పలు పారిశ్రామిక వాడల్లోని కొన్ని పరిశ్రమలు ఇదే దారిలో నడుస్తున్నాయి. పరిశ్రమ అవసరాల కోసం ప్రతీ నెలా వేల కిలో లీటర్ల (కిలోకు వెయ్యి లీటర్లు) నీటిని వినియోగిస్తున్నారు. వాటర్‌బోర్డుకు మాత్రం వందల కిలో లీటర్లకే బిల్లు చెల్లిస్తున్నారు. సుమారు వంద వరకు పరిశ్రమలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.  దీనికి డివిజన్‌లోని కొంత మంది అధికారులు అండదండలు ఉంటున్నాయి. దీంతో వాటర్‌బోర్డు నెలకు లక్షల్లో, ఏడాదికి కోట్లలో ఆదాయాన్ని కోల్పోతోంది.


కిలో లీటర్‌ రూ. 120..

జీడిమెట్ల, బాలానగర్‌ పాశ్రామికవాడల్లో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. వాటికి ఇండస్ర్టీయల్‌ కేటగిరి కింద వాటర్‌బోర్డు నీటి సరఫరా చేస్తోంది. ఒక్కో పరిశ్రమ నెలకు వంద కిలో లీటర్లకు పైగా వినియోగిస్తాయి. ఇండస్ర్టీయల్‌ కేటగిరిలో ఒక్కో కిలోకు రూ.120 రుసుం నిర్ణయించారు. ఒక పరిశ్రమ నెలకు 3వేల కిలో లీటర్ల నీటిని వినియోగిస్తే.. 35 శాతం సివరేజీ సెస్‌ కలుపుకొని రూ.4.85 లక్షల వరకు నీటి బిల్లు రావాలి. మెజార్టీ పరిశ్రమల బిల్లు మొత్తం అందులో సగం కూడా ఉండడం లేదు.


జీడిమెట్లలో తీగ లాగితే..

జీడిమెట్ల పారిశ్రామికవాడలో వివిధ పరిశ్రమలు చెల్లించే నీటి బిల్లులపై పలు అనుమానాలు తలెత్తడంతో ఇటీవల వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. విజిలెన్స్‌ అధికారులు పారిశ్రామిక వాడ పరిధిలోని 500కు పైగా పరిశ్రమల్లో ప్రతీ నీటి కనెక్షన్‌ను, మీటర్‌ను పరిశీలించినట్లు తెలిసింది. కొన్ని పరిశ్రమల్లో మీటర్‌ రీడింగ్‌ వెయ్యి కూడా దాటలేదని గుర్తించినట్లు సమాచారం. ఒక పరిశ్రమలో మీటర్‌ రీడింగ్‌ పొరపాట్లతో వాటర్‌బోర్డుకు ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్లే. ఈ లెక్కన ఏడాదికి రూ.25 కోట్లు బోర్డు ఆదాయం కోల్పోతోంది. పలు పరిశ్రమలు క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రలోభాలకు గురి చేసి బోర్డు ఆదాయానికి గండి కొడుతున్నాయి.


తనిఖీల్లో బయటపడకుండా..

ఉన్నతాధికారులు తనిఖీల సందర్భంలో మీటర్‌ రీడర్ల అవినీతి బయట పడకుండా క్షేత్రస్థాయి అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు. మీటర్లను ఆరు నెలలు, లేదా ఏడాదికోసారి మార్చేస్తున్నారు. వాస్తవానికి మీటర్‌ను మార్చుకోవాలంటే వాటర్‌బోర్డు రెవెన్యూ విభాగం అనుమతి ఉండాలి. అందుకోసం పరిశ్రమ యజమాని మీటర్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లుగా దరఖాస్తు చేసుకోవాలి. లేదా క్షేత్రస్థాయిలో మీటర్‌ రీడింగ్‌ చూసే వ్యక్తి పరిశీలించి ఉన్నతస్థాయిలో తెలపాలి. అనంతరం మీటర్‌ను పరిశీలించి అందులోని చివరి రీడింగ్‌ను నమోదు చేసుకుని మార్పునకు అనుమతిస్తారు. కొత్త మీటర్‌ను అమరుస్తారు. కానీ అలాంటి నిబంధనలను పాటించకుండానే ఇష్టానుసారంగా మీటర్లను మార్చేస్తున్నారు. ప్రతీ నెలా ఆయా కంపెనీలకు మినిమం నీటి బిల్లును మాత్రమే జారీ చేస్తున్నారు.


బిల్లుల జారీలోనే అవకతవకలు

ప్రతీ నెలా మీటర్‌ రీడింగ్‌ పరిశీలించి బిల్లు ఇవ్వడానికి క్షేత్రస్థాయి ఉద్యోగి, మీటర్‌ రీడర్లు వెళ్తుంటారు. కొన్ని పరిశ్రమల యజమానులు వారిని మచ్చిక చేసుకుంటున్నారు. దీంతో ఒక పరిశ్రమ నెలలో 3 వేల కిలో లీటర్ల నీటిని వినియోగిస్తే కేవలం వెయ్యి కిలోలీటర్లకే బిల్లు ఇస్తున్నారు. మరో వెయ్యి కిలో లీటర్ల బిల్లుకు సమానంగా మామూళ్లు తీసుకుంటూ, జేబులు నింపుకుంటున్నారు.

Updated Date - 2021-12-22T16:12:45+05:30 IST