మూడేళ్లలోనే పారిశ్రామిక ప్రగతి

ABN , First Publish Date - 2022-08-17T10:10:38+05:30 IST

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడేళ్లలోనే పారిశ్రామిక ప్రగతి సాధించామని, ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతరమైన విధానాలు, ప్రోత్సాహం వల్లే ఇది సాకారమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

మూడేళ్లలోనే పారిశ్రామిక ప్రగతి

  • 39 వేల కోట్ల పెట్టుబడులు.. 98 భారీ పరిశ్రమలు!
  • 60 మందికి ఉపాధి కల్పించాం: సీఎం
  • అచ్యుతాపురం సెజ్‌లో ‘యొకొహామా’
  • టైర్ల కంపెనీ యూనిట్‌కు శ్రీకారం
  • మరో 8 కంపెనీల విస్తరణకు శంకుస్థాపన
  • విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు వచ్చే నెలలో భూమి పూజ: జగన్‌


అనకాపల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడేళ్లలోనే పారిశ్రామిక ప్రగతి సాధించామని, ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతరమైన విధానాలు, ప్రోత్సాహం వల్లే ఇది సాకారమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. జపాన్‌కు చెందిన ‘యొకొహామా’ కంపెనీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని సెజ్‌లో రూ.1,250 కోట్లతో ఏర్పాటుచేసిన టైర్ల కంపెనీ (ఏటీజీ) తొలి యూనిట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. కంపెనీ రెండో దశ పనులతో పాటు మరో 8 కంపెనీల విస్తరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఉదయం 11.45 గంటలకు హెలికాప్టర్‌లో కంపెనీ ప్రాంగణానికి చేరుకున్న ఆయన.. తొలుత ఉత్పత్తి యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఉత్పత్తి చేసిన టైర్‌పై ప్రారంభోత్సవానికి సూచికగా సంతకం చేశారు.


 అనంతరం యూనిట్‌ ప్రాంగణంలో 800 మంది ప్రత్యేక ఆహ్వానితులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. గడచిన మూడేళ్లలో రూ.39 వేల కోట్ల పెట్టుబడులతో 98 పరిశ్రమలను నెలకొల్పి.. 60 వేల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. మరో 31 వేల ఎంఎ్‌సఎంఈలను రూ.8,285 కోట్లతో ఏర్పాటుచేశామని, వీటి ద్వారా 1.98 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. రాబోయే రెండేళ్లలో మరో 56 అతి భారీ, భారీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ‘రెండో దశ పనులను కేవలం 12 నెలల్లో (2023 ఆగస్టు నాటికి) పూర్తి చేస్తామని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. తొలి దశలో రూ.1,250 కోట్ల పెట్టుబడి పెట్టి దాదాపు 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. రెండో దశలో మరో 800 మందికి ఉపాధి లభిస్తుంది. పరిశ్రమల యాజమాన్యాలకు స్థానికులు భరోసాగా నిలవాలి. వారితో చిన్న చిన్న సమస్యలు ఎదురైతే సామరస్యంగా  చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని సీఎం సూచించారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ఆదిత్యా బిర్లా, అదానీ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ‘యొకొహామా’ కౌన్సిల్‌ జనరల్‌ మాసా యుకీసన్‌, సీఈవోలు నితిన్‌మంత్రి, అనిల్‌గుప్తా,  రాష్ట్ర ప్రతినిధి ప్రహ్లాద్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌, ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, ముత్యాల నాయుడు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టరు రవి పట్టన్‌శెట్టి, జేసీ కల్పనకుమారి, ఎస్పీ గౌతమి శాలి పాల్గొన్నారు.


శంకుస్థాపన చేసిన పనులివీ..

‘యొకొహామా’ ప్రాంగణంలో ఏటీజీ టైర్స్‌ రెండో దశ (రూ.816 కోట్లు), పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ (రూ.202 కోట్లు), ఆప్టిమస్‌ డ్రగ్స్‌ కంపెనీ (రూ.125 కోట్లు), మేఘా ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ (రూ.185 కోట్లు), ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌  (రూ.145 కోట్లు), విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ (రూ.107 కోట్లు), సైనాస్టిక్స్‌ ల్యాబ్స్‌ (రూ.82 కోట్లు), స్లైరాక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ (రూ.87 కోట్లు), ఇషా రిసోర్సెస్‌ పనుల(రూ.68 కోట్లు)కు సీఎం శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2022-08-17T10:10:38+05:30 IST