Abn logo
May 28 2020 @ 05:43AM

ఆశించింది కొండంత..

  • సాధించింది గోరంత!
  • తొలిఏడాదిలో పారిశ్రామిక ప్రగతి అంతంతే!
  • ఊసేలేని కొత్త పరిశ్రమల ఏర్పాటు
  • వివాదాల్లో ఇండస్ట్రియల్‌ పార్కులు
  • సీబీఐసీ కింద కొలిక్కి రాని భూసేకరణ
  • శంకుస్థాపన దాకా వచ్చి ఆగిన ‘మిథానీ’

నెల్లూరు, మే 27 (ఆంధ్రజ్యోతి) : కొన్నేళ్ల నుంచి పారిశ్రామికంగా జిల్లా ఎంతో ప్రగతి సాధించింది. అనేక మెగా, భారీ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఇంకొన్ని పరిశ్రమలు నిర్మాణ, ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. అయితే ఆ ఊపు గడిచిన ఏడాది కాలంలో కనిపించలేదు. కొత్తగా భారీ పరిశ్రమలు ఏవీ జిల్లా వైపు చూడలేదు. కొన్ని చర్చల దశలోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిర్మాణ పనులు మొదలు పెట్టి ఈ ఏడాది పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన పెద్ద పరిశ్రమలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా రూ.443.73 కోట్ల పెట్టుబడులకు 300 మందికి ఉపాధి లభించింది. అలానే 878 ఎంఎస్‌ఎంఈలు కూడా ఈ ఏడాది నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి మొదలుపెట్టాయి. రూ.196.75 కోట్ల పెట్టుబడులకు 5,380 మందికి ఉపాధి దొరికింది. ఈ ఏడాది కాలంలో సింగిల్‌ విండో పాలసీ కింద 161 పరిశ్రమల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో పురోగతి సాధించాల్సి ఉంది. కొన్నేళ్ల నుంచి పారిశ్రామిక పురోగతి ఆశాజనకంగా ఉండటంతో కొత్త ప్రభుత్వంలో అది మరింత పెరుగుతుందని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశలు మరో ఏడాది కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. 


ఆగిన మిథాని.. పత్తాలేని క్రిబ్‌కో

జిల్లాలో ఏర్పాటు కావాల్సిన రెండు ప్రతిష్టాత్మక భారీ పరిశ్రమలు అర్ధంతరంగా ఆగిపోయాయి. కేంద్ర రక్షణ సంస్థకు చెందిన మిథానీ పరిశ్రమను కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం వద్ద ఏర్పాటు చేసేలా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కృషి చేశారు. ఈ సంస్థ జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రత్యక్ష, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది. మిథానీ ఏర్పాటుకు భూమి కేటాయింపులు కూడా పూర్తవగా శంకుస్థాపన వరకు ఆగిపోయింది. ఈ సంస్థకు కేటాయించిన భూములపై కొందరు కోర్టుకెళ్లడంతో బ్రేక్‌ పడింది. భూ సమస్య పరిష్కరించడంలో అధికారులు కూడా వైఫల్యం చెందారు. దీనిపై ఓ సందర్భంలో ఉపరాష్ట్రపతి కూడా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక మరో ప్రతిష్టాత్మకమైన ఎరువుల తయారీ సంస్థ క్రిబ్‌కో కూడా పత్తాలేకుండా పోయింది. ఐదేళ్ల క్రితం భారీ యూనిట్‌ ఏర్పాటుకు వెంకటాచలం మండలంలో భూమి కేటాయించారు. కానీ అక్కడ భూ సమస్యలు ఏర్పడటంతో క్రిబ్‌కో వెనక్కు తగ్గినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇంత వరకు ఈ విషయంలో స్పష్టత లేదు. 


వివాదాల్లో ఇండస్ట్రియల్‌ పార్కులు

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జిల్లాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మూడు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేశారు. వివిధ రకాల ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు ప్రారంభించారు. కానీ ఆదిలోనే హంసపాదులా నెల్లూరు రూరల్‌ మండలం ఆమంచర్లలో వేసిన ఇండస్ట్రియల్‌ పార్కు లేఅవుట్‌ అటవీ స్థలంలో నిర్మించారంటూ అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పడంతో అది అర్ధంతరంగా ఆగిపోయింది. ఇక దగదర్తి మండలం కేకే గుంట, బొడ్డువారిపాలెంలో నిర్మించిన ఇండస్ట్రియల్‌ పార్కులపై కూడా వివాదాలు చెలరేగడంతో ఎక్కువ మంది ఔత్సాహికులు ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. 


కొలిక్కి రాని భూసేకరణ

చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సీబీఐసీ) కింద కోట, చిల్లకూరు మండలాల్లో చేపట్టిన భూసేకరణ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారానికి రైతులు ఒప్పుకోకపోవడంతో సమస్య ఏర్పడింది. ఓ వైపు కారిడార్‌ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. కేవలం ప్రభుత్వ భూములను మాత్రమే సేకరించి తొలి దశలో పారిశ్రామిక అవసరాలకు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ వైపు సముద్రతీరం, పోర్టు, ఇంకోవైపు జాతీయ రహదారి, రైలు మార్గం, మరో వైపు చెన్నై నగరం దగ్గరగా ఉన్న అనుకూలతల ఫలితంగా ఈ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఎంత త్వరగా అభివృద్ధి చేస్తే జిల్లాకు, రాష్ట్రానికి అంత ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. 


రాయితీలు కొంత ఊరట

గడిచిన ఐదేళ్ల నుంచి జిల్లాలోని పలు పరిశ్రమలకు రాయితీల బకాయిలు నిలిచిపోయాయి. అయితే ఆ బకాయిలను ఈ నెలలో విడుదల చేయడం కొంత ఊరటనిచ్చే అంశం. జిల్లాకు సుమారు రూ.45 కోట్ల రాయితీలు రావాల్సి ఉండగా రూ.21 కోట్లు విడుదలయ్యాఇయ. మిగిలిన రూ.24 కోట్లు ఇస్తే చిన్న చిన్న పరిశ్రమలు ఆర్థికంగా కొంత కోలుకుంటాయి. 

Advertisement
Advertisement
Advertisement