పారిశ్రామిక హబ్‌.. కలేనా?

ABN , First Publish Date - 2022-05-26T05:15:37+05:30 IST

పారిశ్రామిక హబ్‌.. కలేనా?

పారిశ్రామిక హబ్‌.. కలేనా?
టెక్కలి సమీపంలో ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటుకు గుర్తించిన స్థలం

- టెక్కలి, పలాస డివిజన్లలో కానరాని ఇండస్ట్రీయల్‌ పార్క్‌లు

- నిధులు కేటాయించని ఏపీఐఐసీ

(టెక్కలి)

టెక్కలి, పలాస డివిజన్లకు పారిశ్రామిక హబ్‌.. దశాబ్దాల తరబడి కలగానే మిగిలిపోతోంది. ఈ రెండు డివిజన్లలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమ, ఉద్దానం జీడి, కొబ్బరి, తీరప్రాంతంలో మత్స్యసంపద ఉంది. కానీ, పారిశ్రామిక హబ్‌లు నెలకొల్పడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలో గ్రానైట్‌ కోసం, పలాస మండలం రామకృష్ణాపురం వద్ద జీడి, కొబ్బరి ఉత్పత్తుల కోసం ఇండస్ర్టీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. వీటితో పాటు ఇచ్ఛాపురంలో మత్స్యసంపద కోసం, మెళియాపుట్టిలో గిరిజన అటవీ ఉత్పత్తుల కోసం పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో అప్పటి జేసీ చక్రధర్‌బాబు, ఆర్డీవో వెంకటేశ్వరరావులు రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఇండస్ర్టీయల్‌ పార్క్‌లకు అవసరమైన స్థలాలను గుర్తించి.. ల్యాండ్‌ ఎక్విజేషన్‌ ప్రక్రియ కొనసాగించారు. 


- టెక్కలి మండలం భీంపురంలో గ్రానైట్‌ కటింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు సర్వేనెం.1లో 50 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గ్రానైట్‌ వేస్ట్‌మెటీరియల్‌తో వినియోగించుకునే క్రషర్‌లు, గృహనిర్మాణ సామగ్రి తయారీకి గాను ఫైళ్లు ముందుకు కదిపారు. ఈ స్థలాలను ఏపీఐఐసీకి చూపించారు. 


- మెళియాపుట్టిలో సుమారు 70 ఎకరాలు, పలాస మండలం రామకృష్ణాపురం వద్ద సుమారు సుమారు 30 ఎకరాలు ఇండస్ట్రీయల్‌ పార్క్‌లు ఏర్పాటుకు అవసరమని గుర్తించి లేఅవుట్లు, ఇతర ప్రణాళికలను సిద్ధం చేశారు. 

ఈలోగా సార్వత్రిక ఎన్నికలు సమీపించి  వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల పాలన పూర్తయినా.. ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఊసెత్తడం లేదు.  ప్రభుత్వం ఏపీఐఐసీకి అనుకున్న నిధులు కేటాయించకపోవడంతో నాటి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏపీఐఐసీ అధికారులు సైతం మౌనం దాల్చారు. టెక్కలి, పలాస, మెళియాపుట్టి, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటుచేసి కొత్తగా ఎంటర్‌పెన్యూర్‌లుగా చేరాలనుకునే వారందరూ నిరాశకు గురయ్యారు. ఇండస్ర్టీయల్‌ పార్క్‌ల విషయమై ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ యతిరాజులు వద్ద ప్రస్తావించగా.. ల్యాండ్‌ ఎక్విజేషన్‌ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో చేపట్టామన్నారు. పలాసలో 20 ఎకరాలు, మెళియాపుట్టిలో 14 ఎకరాలను గుర్తించి లేఅవుట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మిగిలిన చోట ల్యాండ్‌ ఎక్విజేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు.  

Updated Date - 2022-05-26T05:15:37+05:30 IST