భారీ అగ్ని ప్రమాదం.. భయం.. భయం..

ABN , First Publish Date - 2021-07-29T07:06:04+05:30 IST

దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న

భారీ అగ్ని ప్రమాదం.. భయం.. భయం..
కెమికల్‌ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు

  • పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు
  • ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు
  • కుటుంబాల్లో తీరని విషాదం
  • యాజమాన్యాల ధనదాహమే కారణమా?
  • నిబంధనల అమలుపై అధికారులకు లేని శ్రద్ధ


జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కెమికల్‌ కంపెనీల్లో సంభవిస్తున్న భారీ విస్పోటనాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. వరుస ప్రమాదాల్లో పొట్టకూటి కోసం పని చేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు కాళ్లు, చేతులు కోల్పోయి విగతజీవులుగా కాలం వెళ్లదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల ధనదాహానికి కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. బుధవారం కూడా ఇక్కడి ఓ పరిశ్రమలో విస్ఫోటనం జరిగింది. 


జీడిమెట్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న జీడిమెట్ల పారిశ్రామికవాడలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా వీటిలో బల్క్‌డ్రగ్‌, ఫార్మా, ఫార్ములేషన్‌ సాల్వెంట్స్‌ రికవరీ పరిశ్రమలు కలిపి దాదాపు 90 ఉన్నాయి. వీటిలో ఖరీదైన మందులు, ముడిసరుకు తయారవుతుంటాయి. రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో కంపెనీ యాజమాన్యం నైపుణ్యం కలిగిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు తమ ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. 


నిబంధనలు భేఖాతర్‌ 

పారిశ్రామికవాడలోని చాలా కెమికల్‌ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను భేఖాతర్‌ చేస్తున్నాయి. రియాక్టర్ల వద్ద నైపుణ్యం కలిగిన కార్మికులతో పని చేయించాల్సి ఉన్నా, జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని యాజమాన్యాలు నైపుణ్యం లేని కాంట్రాక్టు కార్మికులను నియమిస్తున్నాయి. వారిలో కొందరికి కెమికల్స్‌పై సరైన అవగాహన లేక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో ఎక్కువగా బిహార్‌, అస్సోం, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఉంటున్నారు. కార్మికుల రక్షణ చర్యలను కొన్ని యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. కొన్నేళ్లుగా పారిశ్రామికవాడలో సంభవించిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే, యాజమాన్యాల నిర్లక్ష్యం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పీసీబీ, ఫైర్‌ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలు సూచించాల్సిన కొందరు అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ కంపెనీ యాజమాన్యాలకు దాసోహం అవుతున్నారు. మూసివేసిన కంపెనీలకు కూడా నెలల్లోనే మళ్లీ అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల ప్రాణాలకు వెలకట్టి రక్షణ చర్యలు చేపట్టకుండానే తమ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించేస్తున్నాయి. 


తరలింపు ఎప్పుడు?

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలకు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించి జీఓ కూడా జారీ చేసింది. సంవత్సరాలు గడుస్తున్నా జీఓ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.  దీంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడల్లా స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 


ఇటీవల సంభవించిన పలు ఘటనలు 

- మూడేళ్ల క్రితం ఎస్‌వీ కోఆపరేటివ్‌ సొసైటీలోని సుటిక్‌ పరిశ్రమలో సంభవించిన భారీ విస్పోటనంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు.

- కెమికల్‌ గోదాంలలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాల్లో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

- అపురూపాకాలనీ సమీపంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

- నాసెన్స్‌ ల్యాబ్‌లో జరిగిన భారీ విస్పోటనానికి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

- ఎస్‌వీ కో ఆపరేటివ్‌ సొసైటీ జీవికా లైఫ్‌సైన్స్‌లో రెండేళ్ల క్రితం భారీ ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. 


నాసెన్స్‌ లేబొరేటరీ్‌సలో రియాక్టర్‌ పేలి..

ప్లాంట్‌ మేనేజర్‌కు 90 శాతం కాలిన శరీరం

పలువురు కార్మికులకు స్వల్ప గాయాలు

కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు


జీడిమెట్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్‌వీ కోఆపరేటివ్‌ సొసైటీలో గౌతం అనే పారిశ్రామికవేత్త నిర్వహిస్తున్న నాసెన్స్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో బుధవారం ఉదయం 8 గంటలకు రియాక్టర్‌ పేలి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్లాంట్‌ మేనేజర్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా మంది కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులందరినీ యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది. ఉదయం అల్పాహార సమయం కావడం, కార్మికులందరూ బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. మంటలు చెలరేగగానే ఘటనా స్థలంలో ఉన్న కార్మికులు కొందరు మంటల్లోనే పరుగెత్తుకుంటూ బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొందరు గోడలు దూకి కాళ్లు విరగ్గొట్టుకున్నారు. పరిశ్రమలో మూడు షిఫ్ట్‌లకు గాను ఒక్కోషిఫ్ట్‌లో 80 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఉదయం 6 గంటలకు వచ్చిన కార్మికులు విధి నిర్వహణలో ఉన్నారు. రియాక్టర్‌లో బ్యాచ్‌ వేసి డిస్టిలేషన్‌ చేయడానికి సిద్ధమవుతుండగా.. రియాక్టర్‌ వద్ద ఉష్ణోగత అదుపుతప్పి రియాక్టర్‌ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్లాంట్‌ మేనేజర్‌ హరిప్రసాద్‌రెడ్డికి (42) మంటలంటుకుని 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని అధికారులు, జీడిమెట్ల సీఐ కె.బాలరాజు పరిశీలించారు. కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సమీపంలోని రామిరెడ్డినగర్‌ వాసులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.


Updated Date - 2021-07-29T07:06:04+05:30 IST