బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో Indrakaran Reddy చర్చలు

ABN , First Publish Date - 2022-06-18T23:51:09+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో Indrakaran Reddy చర్చలు

నిర్మల్‌: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలపై మంత్రికి డైరెక్టర్ ప్రొ. సతీష్‌కుమార్‌ నివేదిక ఇచ్చారు. విద్యార్థులు తమ సమస్యలను ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ 12 డిమాండ్లు తీర్చాల్సిందేనని విద్యార్థుల పట్టుపట్టారు. అయితే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంపై పీఠముడి పడింది. చర్చలకు సహకరించాలని విద్యార్థులకు విద్యామంత్రి సబిత ఇంద్రారెడ్డి లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని సబిత హామీ ఇచ్చారు. 



బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ) విద్యార్థులు వర్సిటీలో సమస్యలు పరిష్కరించాల్సిందేనంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా.. దారికి తెచ్చుకునేందుకు విద్యుత్తు, మంచినీటి సరఫరా బంద్‌ చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థులు మరింత పట్టుదలతో ఆందోళన నిర్వహించడంతో ఆ సౌకర్యాలను అధికారులు పునరుద్ధరించక తప్పలేదు. వర్సిటీలో రెగ్యులర్‌ వీసీ నియామకమే తమ ప్రధాన డిమాండ్‌ అంటూ ఆందోళన కొనసాగించారు. యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి తమ సమస్యలు విని.. పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. కాగా.. వర్సిటీ పరిసరాలతో పాటు బాసరలో భారీగా పోలీసులను మోహరించారు.


Updated Date - 2022-06-18T23:51:09+05:30 IST