క్రీడలపైనా.. బాడుడే

ABN , First Publish Date - 2022-07-21T06:23:46+05:30 IST

డబ్బులు ఉంటేనే ఇక ఆటలు ఆడుకోవాలి. క్రీడలకు బాదుడే బాదుడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

క్రీడలపైనా.. బాడుడే
నరసరావుపేటలోని ఇండోర్‌ స్టేడియం

డబ్బులు చెల్లించి ఆడుకోండి

ఇండోర్‌ స్టేడియానికి అధికారుల తాళం  

ప్రభుత్వ నిర్ణయంపై షటిల్‌ క్రీడాకారుల నిరసన


నరసరావుపేట, జూలై 20: డబ్బులు ఉంటేనే ఇక ఆటలు ఆడుకోవాలి. క్రీడలకు బాదుడే బాదుడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అంటే పేదలు, డబ్బులు లేని వారు క్రీడలపై ఆసక్తి ఉన్నా ఆడుకునేందుకు అవకాశం లేదు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టి ఫీజులు చెల్లిస్తేనే ఆటలు అన్న పథకాన్ని నరసరావుపేటలో అధికారులు అమల్లోకి తెచ్చారు. షటిల్‌ ఆడుకోవాలంటే ఖచ్చితంగా నెల వారీ ఫీజు చెల్లించాల్సిందేనని నరసరావుపేటలోని ఇండోర్‌ స్టేయంలో అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఫీజు చెల్లించలేదని బుధవారం నిర్వహణ అధికారులు ఇండోర్‌ స్టేడయానికి తాళాలు వేశారు. దీంతో రోజూ షటిల్‌ ఆడే క్రీడాకారులు స్టేడియం వద్ద నిరసన తెలిపారు. 


రూ.వెయ్యి చొప్పున ఫీజు

నరసరావుపేట ప్రాంతంలో క్రీడాకారులను తయారు చేసే ఉన్నత ఆశయంతో స్టేడియం నిర్మించారు. దీని నిర్వహణలో వ్యాపార ధోరణులను శాప్‌ ప్రవేశ పెట్టింది.   ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడుకునేందుకు రుసుంను ఒక్కొక్కరికి నెలకు రూ.వెయ్యిగా శాప్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఫీజు చెల్లిస్తేనే స్టేడియంలోకి అడగుపెట్టాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు ఫీజుల నిర్ణయం పట్టికను కూడా ప్రకటించారు. అండర్‌ 13, అండర్‌ 15 రాష్ట్ర స్థాయిలో షటిల్‌ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు సైతం ఈ రుసుము చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. 14 ఏళ్లు పైబడిని వారికి నెలకు ఫీజు రూ.1000, డిపాజిట్‌ రూ.2000, 14 ఏళ్ళ లోపు వారికి డిపాజిట్‌ రూ 1000, నెలకు ఫీజు నెలకు రూ.500గా నిర్ణయించి నోటీసు బోర్డులో ప్రకటనను అంటించారు. బుధవారం రోజు వలే షటిల్‌ ఆడుకునేందుకు ఇండోర్‌ స్టేడియానికి వచ్చిన క్రీడాకారులకు చేదుఅనుభవం ఎదురైంది. డబ్బు చెల్లించేందుకు గడువు ఇవ్వాలని క్రీడాకారులు కోరినా కుదరదంటూ కోచ్‌ స్టేడియానికి తాళం వేశారు.


గతంలో ప్రోత్సాహం.. నేడు ఫీజులు

గతంలో నరసరావుపేట ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ క్రీడాకారులను ప్రోత్సహించేవారు. ఇక్కడ శిక్షణ పొందేవారు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చూపేవారు. దీంతో వారికి బ్యాట్‌లతో పాటు షూలు ఇతర క్రీడా సామగ్రి పంపిణీ చేసేవారు. అంతేగాకుండా ఇక్కడ ఉచితంగా శిక్షణ పొందేవారు. ఈ పరిస్థితుల్లో స్టేడయం నిర్వహణకు అవసరమైన సామగ్రిని కూడా సొంతంగా పలువురు క్రీడాకారులు కొనుగోలు చేశారు. ఈ విధంగా క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. అయితే ప్రస్తుతం ప్రోత్సాహం సంగతి దేవుడు ఎరుగు డబ్బులు కట్టాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో పోటీల్లో ఆడుతున్నారనేది ముఖ్యం కాదని డబ్బు చెల్లిస్తేనే స్టేడియంలోకి అడుగు పెట్టనిస్తామని శాప్‌ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో క్రీడాకారులు క్రీడలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. స్టేడియంలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని, నిర్వహణ కూడా సక్రమంగా లేదని అయినా నగదు చెల్లించాల్సి వస్తున్నదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో ప్రైవేట్‌ ఇండోర్‌ స్టేడియాల్లో కేవలం రూ.700 వసూలు చేస్తున్నారని, ఇక్కడ అధికంగా వసూలు చేయడం  దారుణమని తెలిపారు. 


ప్రైవేటుకు స్టేడియం..

స్టేడియంలోని జిమ్‌, ఇండోర్‌ స్టేడయంలను ప్రైవేటకు అప్పగించనున్నారు. వీటి నిర్వహణ నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నది.  వీటి నిర్వహణను వేలం వేసేందుకు శాప్‌ రంగం సిద్ధం చేస్తున్నది. వేలం దక్కించుకున్న వారు క్రీడాకారుల నుంచి నగదు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. స్డేయం అభివృద్ధికి ఎంతోమంది దాతలు సహకారం అందించారు. ఇటుంటి క్రీడా ప్రాంగణాన్ని ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతుండటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-07-21T06:23:46+05:30 IST