ఆటాడేస్తున్నారు

ABN , First Publish Date - 2020-10-23T08:33:16+05:30 IST

కాకినాడలో రూ.2.5 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ షటిల్‌ కోర్టుపై అధికార పార్టీ నేతలు గెద్దల్లా వాలిపోయారు. దీన్ని అడ్డంపెట్టుకుని భారీగా సంపాదించాలనే లక్ష్యంతో నిర్వహణ హక్కులు దక్కించుకునేందుకు అడ్డదారుల్లో ఆట మొదలుపెట్టారు.

ఆటాడేస్తున్నారు

  • కాకినాడలో రూ.2.5 కోట్లతో నిర్మించిన  ఇండోర్‌ షటిల్‌కోర్టుపై అధికార పార్టీ నేతల కన్ను
  • టెండర్‌ లేకుండా అనుయాయులకే నిర్వహణ కట్టబెట్టాలని కీలకనేత హుకుం
  • కాదని టెండర్‌ పిలిచిన కార్పొరేషన కమిషనర్‌
  • దీంతో ఇతరులెవరూ బిడ్‌ దాఖలు చేయకుండా చక్రం తిప్పుతున్న కీలక నేత బంధువు
  • ఫోన్లు చేసి కాంట్రాక్టర్లకు బెదిరింపులు..టెండర్‌ వేయొద్దంటూ హెచ్చరికలు
  • స్టేడియానికి తమ నేత పేరు పెట్టడం కోసం ప్రారంభోత్సవం కాకుండా అడ్డుపుల్ల

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కాకినాడలో రూ.2.5 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ షటిల్‌ కోర్టుపై అధికార పార్టీ నేతలు గెద్దల్లా వాలిపోయారు. దీన్ని అడ్డంపెట్టుకుని భారీగా సంపాదించాలనే లక్ష్యంతో నిర్వహణ హక్కులు దక్కించుకునేందుకు అడ్డదారుల్లో ఆట మొదలుపెట్టారు. నియోజకవర్గ కీలక నేత ఆశీస్సులు, అండదండలతో ఏకంగా బెదిరింపుల పర్వానికి దిగారు. తమకు తప్పించి  ఈ కాంట్రాక్టు వేరెవరికి దక్కకుండా కీలకనేత బంధువులు ఫోన్లలో వార్నింగ్‌లు మొదలు పెట్టారు. టెండర్‌ దాఖలు చేసే వెబ్‌సైట్‌ను సైతం పలుకుబడితో పనిచేయకుండా ఆపించేశారు. అటు కొత్త స్టేడియానికి తమ  నేత పేరు పెట్టడం కోసం టీడీపీ పాలనలో ఉన్న కార్పొరేషన అడ్డుపడుతుందనే సాకుతో ఏకంగా ప్రారంభించకుండా కీలక నేత అడ్డుపుల్ల వేసేశారు. 

కాకినాడ, 

కాకినాడలో ఇండోర్‌ స్టేడియం నిర్మించాలనే ప్రతిపాదన రెండేళ్ల కిందట వచ్చింది. దీంతో గాంధీనగర్‌ బాలభవనం ప్రాంగణంలో స్మార్ట్‌ సిటీ నిధుల నుంచి దీన్ని నిర్మించాలని అధి కారులు నిర్ణయించారు. ఈ మేరకు రూ.2.5 కోట్లు విడుదల చేశారు. అయిదు నెలల కిందట నిర్మాణం పూర్తయింది. మొత్తం నాలుగు షటిల్‌ కోర్టులు ఇందులో ఉండగా, ఒకటి ప్రజల కోసం, షటిల్‌ కోచింగ్‌ తీసుకునేవారికోసం రెండు, కార్పొరేషన ఉద్యోగుల కోసం ఒకటి కేటాయించారు. ఇదంతా ఒకెత్తయితే నిర్మాణం పూర్తి చేసుకున్న స్టేడియాన్ని అయిదేళ్లపాటు నిర్వహించే పనిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని తాజాగా అధికారులు నిర్ణయించా రు. దీంతో ఆ కాంట్రాక్టుపై అధికార పార్టీ నేత ఒకరు కన్నేశారు. దీని ద్వారా రెండుచేతులా డబ్బులు సంపాదించొచ్చని పథకం పన్నారు. అనుకున్నదే తడువుగా నియోజకవర్గ కీలకనేతను సంప్రదించారు. దీంతో సదరు నేత కమిషనర్‌కు ఫోన చేసి నిర్వ హణ కాంట్రాక్టు నామినేషన పద్ధతిలో తన మనిషికి ఇవ్వాలని హుకుం జారీచేశారు. టెండర్‌ లేకుండా అలా చేయడం కుదర దని కమిషనర్‌ చెప్పారు. దీంతో కీలకనేత తీవ్రస్థాయి ఒత్తిడి మొదలుపెట్టారు. అయినా ఖాతరు చేయని కమిషనర్‌ ఈనెల 16న టెండర్‌ ప్రకటన జారీ చేశారు. స్టేడియం నిర్వహణకు ఆసక్తిగల కాంట్రాక్టర్లు కాకినాడ స్మార్ట్‌సిటీ వెబ్‌సైట్‌లో ఆనలైన లో దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సదరు బంధువు ఇప్పుడు నిర్వహణ కాంట్రాక్టు కోసం ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా చేసేందుకు ఫోన్లలో బెదిరింపులకు దిగారు. ఎవరెవరు టెండర్‌ దాఖలు చేసే అవకాశం ఉందో ఆరా తీశారు. కీలక నేత చెప్పారని, ఆ పనికి టెండర్‌ దాఖలు చేయవద్దంటూ గడిచిన కొన్ని రోజులుగా బెదిరింపులకు దిగారు. ఇది ఫలించి చాలామంది వెనక్కుతగ్గారు. అయితే ఆనలైనలో ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్‌ వేసే అవకాశం ఉండడంతో స్మార్ట్‌ సిటీ టెండర్‌ వెబ్‌సైట్‌ పనిచేయకుండా పలుకుబడి ఉపయోగించారు. దీంతో ఈనెల 16న టెండర్‌ నోటిఫికేషన పడింది మొదలు ఇప్పటివరకు అది పనిచేయడం లేదు. అయితే కాంట్రాక్టర్లకు బిడ్‌దాఖలు చేసే గడువు విచిత్రంగా శుక్రవారంతో ముగియనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న స్టేడియాన్ని ఈపాటికే ప్రారంభించాల్సి ఉండగా, నియోజక వర్గ కీలకనేత అడ్డుపుల్ల వేశారు. ఈ స్టేడియానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని సదరు నేత తలంచారు. కానీ కాకినాడకు చెందిన దివంగత సీనియర్‌ నేత మల్లిపూడి మంగపతిరాజు పేరు పెట్టాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఇది కాస్తా వివాదంగా మారడంతో ప్రారంభోత్సవం ఆగిం ది. అయితే ఎలాగూ కాకినాడ కార్పొరేషన టీడీపీ పాలనలో ఉండడంతో మంగపతిరాజు పేరు ఖరారు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ కీలకనేత చక్రం తిప్పి ఆ పేరు ఉండడానికి వీల్లేదని కొర్రీ వేశారు. చివరకు తమ పంతం నెగ్గించుకోవడానికి ఈనెల 28న కౌన్సిల్‌ సమావేశంలో ఓటింగ్‌ పెట్టేలా వ్యుహం పన్నారు. ఎలాగూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని నెగ్గాలని ఆ నేత పథక రచన చేశారు.

Updated Date - 2020-10-23T08:33:16+05:30 IST