‘సాకర్‌’ విషాదాలు..

ABN , First Publish Date - 2022-10-03T09:19:07+05:30 IST

ఫుట్‌బాల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. దాంతో పెద్ద మ్యాచ్‌లకే కాదు చిన్నపాటి పోటీలకూ స్టేడియాలు కిక్కిరిసిపోతాయి.

‘సాకర్‌’ విషాదాలు..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): ఫుట్‌బాల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. దాంతో పెద్ద మ్యాచ్‌లకే కాదు చిన్నపాటి పోటీలకూ స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. ఇకపోతే ఓడిన జట్ల అభిమానులు పాల్పడే హిసంతోపాటు, ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయే స్టేడియాలలో ప్రమాదవశాత్తు చోటుచేసుకొని దుర్ఘటనలు తీవ్ర విషాదాలు నింపుతున్నాయి. ఇండోనేసియాలో శనివారం జరిగిన ఫుట్‌బాల్‌ పోరులో తొక్కిసలాట నేపథ్యంలో సాకర్‌ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన విషాద ఘట్టాలను చూస్తే..


మే 24, 1964: పెరూ-లిమా జట్ల మధ్య లిమా జాతీయ స్టేడియంలో జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకొని 320 మంది మరణించారు. వేయి మందికిపైగా గాయపడ్డారు.

అక్టోబరు 20, 1982: స్పార్టకా మాస్కో-హాలెండ్‌కు చెందిన హార్లెమ్‌ జట్ల నడుమ మాస్కోలోని లుజ్నికీ స్టేడియంలో జరిగిన యూఈఎ్‌ఫఏ కప్‌ పోరులో తొక్కిసలాట జరిగి 66 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. కానీ 340 మందికిపైగానే మరణించినట్టు ఓ సోవియట్‌ పత్రిక వెల్లడించింది.

మే 9, 2001: ఘనాలోని అఖ్రాలో హెర్ట్స్‌ ఆఫ్‌ ఓక్ర్‌తో మ్యాచ్‌లో ఓడడంతో కుమాసీ జట్టు మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 126 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏప్రిల్‌ 15, 1989: లివర్‌పూల్‌-నాటింగ్‌హామ్‌ జట్ల మద్య ఎఫ్‌ఏ కప్‌ సెమీస్‌ సందర్భంగా షఫీల్డ్‌లోని హిల్స్‌బరో స్టేడియంలోని ఓ స్టాండ్‌లో తొక్కిసలాట జరిగింది. అందులో 97 మంది లివర్‌పూల్‌ ఫ్యాన్స్‌ మృత్యువాతపడ్డారు.

మే 11, 1985: బ్రాడ్‌ఫోర్డ్‌-లింకన్‌ సిటీ జట్ల మధ్య.. బ్రాడ్‌ఫోర్ట్‌ సిటీ (ఇంగ్లండ్‌) స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెక్క స్టాండ్‌లో మంటలు చెలరేగి 56 మంది మరణించారు.




అక్టోబరు 16, 1996: గ్వాటెమాల-కోస్టారికా జట్ల మధ్య ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ పురస్కరించుకొని గ్వాటెమాల స్టేడియంలో తొక్కిసలాట చోటుచేసుకొని 80 మంది మృతి చెందారు.

జనవరి 2, 1971: స్కాట్లాండ్‌ ఇబ్రాక్స్‌ స్టేడియంలో రేంజర్స్‌-సెల్టిక్‌ డెర్బీ జట్ల పోరు సందర్భంగా తొక్కిసలాట జరిగి 66 మంది మృతి చెందారు.

ఫిబ్రవరి 1, 2012: ఈజిప్టులోని పోర్ట్‌సెడ్‌లో స్థానిక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం జరిగిన ఘర్షణల్లో 74 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏప్రిల్‌ 11, 2001: జొహాన్నెస్‌బర్గ్‌ ఎలిస్‌పార్క్‌ స్టేడియంలో మ్యాచ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 43 మంది మరణించారు.

జనవరి 13, 1991: సౌతాఫ్రికా జట్లు ఒర్లాండో పైరేట్స్‌-కైజన్‌ చెఫ్స్‌ల మ్యాచ్‌ సందర్భంగా జరిగిన కొట్లాటలో 40మంది మృతి చెందారు.

29 మే, 1985: బ్రస్సెల్స్‌లోని హేసెల్‌ స్టేడియంలో లివర్‌పూల్‌ ఫ్యాన్స్‌ నుంచి తప్పించుకోబోయిన సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది యువెంటస్‌ ఫ్యాన్స్‌ మరణించారు.

మే 5, 1992: కోర్సికాలోని ఫ్యురెయిన్‌ స్టేడియం కప్పుకూలి 18 మంది మృతి చెందగా, 2300 మంది గాయపడ్డారు.

జనవరి 24, 2022: కామెరూన్‌ రాజధాని యోండేలో ఆఫ్రికన్‌ నేషన్స్‌ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. 


Updated Date - 2022-10-03T09:19:07+05:30 IST