ఇండోనేషియా రాజధాని మార్పు

ABN , First Publish Date - 2022-01-19T21:39:42+05:30 IST

ఇండోనేషియా ప్రస్తుత రాజధాని నగరం జకార్తా సముద్రంలో

ఇండోనేషియా రాజధాని మార్పు

న్యూఢిల్లీ : ఇండోనేషియా ప్రస్తుత రాజధాని నగరం జకార్తా సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో కాళీమంటన్‌కు మార్చేందుకు ఆ దేశ ప్రతినిధుల సభ (పార్లమెంటు) మంగళవారం ఆమోదం తెలిపింది. బోర్నియో ద్వీపానికి తూర్పున అటవీ ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో జకార్తా నగరం వేగంగా మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతుండటంతో కొత్త రాజధాని నగరం అవసరమైంది. 


ఇండోనేషియా నేషనల్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ శాఖ మంత్రి సుహార్సో మోనోఅర్ఫా ఆ దేశ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ, అనేక అంశాలను పరిశీలించి, ప్రాంతీయ సానుకూలతలను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాళీమంటన్‌ను నూతన రాజధాని నగరంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ద్వీపాల మధ్యలో నూతన ఆర్థిక కేంద్రం ఆవిర్భవించాలనే దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


ఇండోనేషియా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యానీ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఐదు దశల్లో నూతన రాజధాని నగర నిర్మాణం జరుగుతుందన్నారు. తొలి దశ 2022లో ప్రారంభమవుతుందన్నారు. 2045నాటికి ఈ నగరం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం 32 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. 


రాజధాని నగరం మార్పు గురించి ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో 2019లో మొదటిసారి ప్రకటించారు. ప్రస్తుత రాజధాని నగరం జకార్తా పర్యావరణం, ఆర్థిక సుస్థిరతలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జావా సముద్రానికి సమీపంలో జకార్తా నగరం ఉంటుంది. వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భూమిపై వేగంగా మునిగిపోతున్న నగరాల్లో ఇదొకటని వరల్డ్ ఎకనమిక్ ఫోరం తెలిపింది. భూగర్భ జలాలను మితిమీరి తోడేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇండోనేషియా  నేషనల్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లెక్కల ప్రకారం కొత్త రాజధాని నగరాన్ని దాదాపు 2,56,143 హెక్టార్లలో నిర్మిస్తారు. అంటే దాదాపు 2,561 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతుంది. ఈ భూమిని అటవీ ప్రాంతం నుంచి సేకరించారు. 


Updated Date - 2022-01-19T21:39:42+05:30 IST