బంగాళాఖాతంలో భారత్, బ్రిటన్ సంయుక్త నావికా విన్యాసాలు

ABN , First Publish Date - 2021-07-22T23:10:22+05:30 IST

భారత్, బ్రిటిష్ నావికా దళాలు బంగాళాఖాతంలో

బంగాళాఖాతంలో భారత్, బ్రిటన్ సంయుక్త నావికా విన్యాసాలు

న్యూఢిల్లీ : భారత్, బ్రిటిష్ నావికా దళాలు బంగాళాఖాతంలో సంయుక్తంగా విన్యాసాలు చేస్తున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల నావికా దళాలు సమాచారాన్ని ఇచ్చి, పుచ్చుకుంటూ పరస్పర సహకారంతో కార్యకలాపాలు నిర్వహించగలిగే శక్తిసామర్థ్యాలను పెంచుకోవడం కోసం ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బ్రిటన్‌కు చెందిన అతి పెద్ద యుద్ధ నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్, భారత నావికా దళంతో కలిసి సంక్లిష్టమైన విన్యాసాలు చేస్తోంది. 


ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ఉనికిని పటిష్టం చేసుకోవడం కోసం బ్రిటన్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్‌ను, దాని టాస్క్ గ్రూప్‌ను హిందూ మహా సముద్రానికి పంపించింది. తదుపరి మోహరింపులో ఈ టాస్క్ గ్రూపు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి వెళ్ళబోతోంది. 


భారత్, బ్రిటిష్ నావికా దళాల మధ్య మూడు రోజులపాటు జరిగే వార్షిక కొంకణ్ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల యుద్ధ నౌకల విన్యాసాలను చూడవచ్చు. మల్టీ షిప్, గగనతలం, సముద్రం, సముద్ర ఉపరితలానికి క్రింది భాగంలో విన్యాసాలు జరుగుతాయి. 


బ్రిటిష్ హై కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, త్వరలోనే ఈ యుద్ధ నౌకలు తిరిగి హిందూ మహా సముద్రంలోకి వెళ్తాయి. అంతకుముందు ఇరు దేశాల నావికా దళాల మధ్య పరస్పర సహకారంతో పని చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ విన్యాసాలు దోహదపడతాయి. ఈ సంయుక్త దళాలకు 10 నౌకలు, రెండు జలాంతర్గాములు, సుమారు 20 విమానాలు, దాదాపు 4,000 మంది సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ భద్రతకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించేవారికి గట్టి నిరోధంగా ఈ ఉమ్మడి దళాలు నిలవగలవు. హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ ఐదో తరం ఎఫ్-35బీ లైటనింగ్ మల్టీ రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పరిపుష్టమైంది. దీనిని రాయల్ ఎయిర్ ఫోర్స్, రాయల్ నేవీ, యూఎస్ మెరైన్ కార్ప్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ గ్రూపులో ఆరు రాయల్ నేవీ నౌకలు, ఓ జలాంతర్గామి, ఓ యూఎస్ నేవీ డిస్ట్రాయర్, ఓ నెదర్లాండ్స్ ఫ్రిగేట్, 32 యుద్ధ విమానాలు, 3,700 మంది నావికులు, ఏవియేటర్స్, మెరైన్స్ ఉన్నారు. వీరంతా బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందినవారు.



Updated Date - 2021-07-22T23:10:22+05:30 IST