ఇందిర ‘సారీ’ చెప్పినా క్షమించలేదు..మోదీనీ ప్రజలు క్షమించరు: మమత

ABN , First Publish Date - 2021-12-03T08:04:16+05:30 IST

వ్యవసాయ చట్టాల రద్దు, రైతులు చేపట్టిన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును ప్రజలు క్షమించరని టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ అన్నారు.

ఇందిర ‘సారీ’ చెప్పినా క్షమించలేదు..మోదీనీ ప్రజలు క్షమించరు: మమత

ముంబై, డిసెంబరు 2: వ్యవసాయ చట్టాల రద్దు, రైతులు చేపట్టిన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును ప్రజలు క్షమించరని టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. ‘‘దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీ 1977లో క్షమాపణలు చెప్పారు. కానీ ప్రజలు ఆమెను క్షమించలేదు. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోదీ కూడా క్షమాపణలు కోరారు. ఆయన్ను సైతం ప్రజలు క్షమించరు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘ఎలాంటి చర్చా లేకుండానే వ్యవసాయ చట్టాలను మోదీ రద్దు చేశారు. యూపీ ఎన్నికల కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం అందరికీ తెలుసు’’ అని మమత వ్యాఖ్యానించారు. కాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ పేరు మార్చే యోచనలో ఉందని, అలాగే పార్టీ నిబంధనావళిని కూడా సవరించాలని భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. మరో మూడు నెలల్లోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.  


కాంగ్రె్‌సకు దూరం కావాలనుకుంటున్నారు.. 

పశ్చిమ బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కాంగ్రె్‌సకు దూరం కావాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత ఫడణవీస్‌ అన్నారు. ప్రతిపక్షాల మధ్య అంతర్గత కలహాలున్నట్లు కనిపిస్తోందన్నారు. వారు వాటిని పరిష్కరించుకున్న తర్వాత బీజేపీకి సవాలు విసిరేది ఎవరనే విషయం తేలుతుందన్నారు. 2019లో బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడానికి విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, అలాంటి పొత్తులను ప్రజలు విశ్వసించబోరన్నారు. 

Updated Date - 2021-12-03T08:04:16+05:30 IST