Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఇందిర, మోదీ, ప్రజాస్వామ్య పతనం

twitter-iconwatsapp-iconfb-icon
ఇందిర, మోదీ, ప్రజాస్వామ్య పతనం

ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సంవత్సరాలలో భారత ప్రజాస్వామ్య సంస్థలు, విలువలకు ఎనలేని హాని జరిగింది. నెమ్మదిగానే అయినప్పటికీ అవి పునరుజ్జీవితమయ్యాయి. మన రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలకు పూర్తిగా ఊపిరి పోయకపోయినప్పటికీ 1989-–2014 మధ్యకాలంలో భారత్ ఇంకా ఒక ప్రజాస్వామ్య రాజ్యం-గా (లోపభూయిష్టమూ, అపరిపూర్ణమూ అయినప్పటికీ) పరిగణితమయింది. మరి నరేంద్ర మోదీ పాలనా కాలంలో భ్రష్టమైన భారత ప్రజాస్వామ్య సంస్థలూ, సంప్రదాయాలూ ఎప్పటికైనా పునరుద్ధరింపబడతాయా అన్నది ఒక సమాధానం లేని ప్రశ్న.


ఎన్నికలు నిర్వహించడానికి మాత్రమే మన ప్రజాస్వామ్యం పరిమితమా? భారత్ అటువంటి ప్రమాదంలోకి జారిపోతున్నదని ఇంచుమించు ఐదు సంవత్సరాల క్రితం నేను భయాన్ని వ్యక్తం చేశాను. ఎన్నికలలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తక్షణమే అధికార పార్టీ అధినేత, ఇతర నాయకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పరిపాటి అయింది. 


నిజమైన ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ పదవులకు ఎన్నికైన వారి నియంతృత్వ ధోరణులను పార్లమెంటు, మీడియా, సివిల్ సర్వీస్, న్యాయవ్యవస్థలు అదుపు చేస్తాయి. స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా పనిచేయడం ద్వారా ఆ వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలో అటువంటి ప్రజాస్వామ్యమే వర్థిల్లుతోంది. మన ప్రజాస్వామ్యం కూడా అలానే చురుగ్గా పనిచేయాలని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. వారు నిర్దేశించిన విధంగా, స్వతంత్ర భారతదేశం మొదటి రెండు దశాబ్దాలలో మన ప్రజాస్వామ్యం పని చేసింది. ఇందిరాగాంధీ తన ప్రధానమంత్రిత్వం తొలి సంవత్సరాలలో జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తిని అనుసరించారు. పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే వారు. శ్రద్ధగా చర్చలను వినేవారు; తానూ చురుగ్గా చర్చల్లో పాల్గొనే వారు. సివిల్ సర్వీస్ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ కార్యకలాపాలలో రాజకీయ జోక్యాలకు తావిచ్చే వారు కాదు. మీడియాను బెదిరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. 


1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చివేసిన తరువాత ఆ సమున్నత పాలనా సంప్రదాయాల పట్ల ఆమె వైఖరి పూర్తిగా మారిపోయింది. ‘నిబద్ధ’ న్యాయవ్యవస్థ కావాలని, ‘నిబద్ధ’ బ్యూరోక్రసీ అవసరమని ఆమె ఉద్ఘోషించారు. పార్లమెంటు ప్రాధాన్యాన్ని అలక్ష్యం చేశారు. మీడియా యజమానులు, ఎడిటర్లను బెదిరింపులతో లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పరిమార్చారు. 


ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వతంత్ర సంస్థలు, వ్యవస్థలను ఇలా నిస్సారం చేయడమనేది ఎమర్జెన్సీకి చాలా సంవత్సరాల పూర్వమే ప్రారంభమయిందన్న వాస్తవాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. 1975 జూన్- 1977 మార్చి మధ్య కాలంలో భారత ప్రజాస్వామ్యం అధికారికంగా హతమారిపోయింది. ఆశ్చర్యజనకంగా ఇందిరే ఎన్నికలను నిర్వహించడం ద్వారా దాని పునరుత్థానానికి కారకులయ్యారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓటర్లు పూర్తిగా తిరస్కరించారు. 1977 అనంతరం భారత ప్రజాస్వామ్య సంస్థలు మళ్ళీ స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయసాగాయి. మీడియా విషయంలో ఇది మరింత నిజం. బహు ముఖీనంగా విస్తరించిన భారతీయ పత్రికారంగం ప్రజాస్వామిక చైతన్యాన్ని ఇతోధికంగా పెంచింది. అలాగే న్యాయవ్యవస్థ కూడా సంపూర్ణ స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్ధరించుకున్నది. సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులను వెలువరించింది. ఇదిలా వుండగా 1980,90 దశకాలలో పార్లమెంటులో చర్చలు 1950ల్లో వలే చురుగ్గా, ప్రభావశీలంగా, ప్రయోజనకరంగా జరిగేవి. ప్రజాస్వామ్య సంస్థల, వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తి పునరుద్ధరణ పాక్షికంగా అసంపూర్ణంగా మాత్రమే అయినప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాతల మహా సంకల్పాలను సాధించే దిశగానే భారత ప్రజాస్వామ్యం పురోగమిస్తుందని పలువురు పరిశీలకులు (ఈ వ్యాస కర్తకూడా వారిలో ఒకరు) భావించారు. 


ఇంతలో 2014 సార్వత్రక ఎన్నికలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి తన పాలన తీరుతెన్నులలో ఇందిరాగాంధీని తలదన్నిన రాజకీయవేత్త. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే నరేంద్రమోదీ రాజ్యాంగ సంస్థల స్వతంత్రత పట్ల ఇందిర కంటే ఎక్కువగా అసహన వైఖరి చూపారు. వాటి స్వతంత్రతను అణచివేసేందుకు ఆయన మరింతగా కృతనిశ్చయులయ్యారు. ఇందిరవలే మోదీ సైతం మీడియాను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు; రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థ క్రియాశీలతను సారరహితం చేశారు. గతంలో ఎన్నడూ రాజకీయ జోక్యాలకు ఆస్కారమివ్వని సైన్యం, రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం మొదలైన వాటిని కూడా స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం హానికరంగా ప్రభావితం చేసేందుకు పూనుకున్నారు. వాటిని పూర్తిగా తమకు అనుకూలంగా నియంత్రించాలన్నదే ఆయన ధ్యేయం. మోదీ కొంతమేరకు తన లక్ష్య పరిపూర్తిలో సఫలమయ్యారు.


పార్టీ, ప్రభుత్వం, దేశంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించాలన్నదే ప్రధాని మోదీ ఆరాటం. ఈ విషయంలో ఆయనకు అన్ని విధాల సహాయమందిస్తున్న వ్యక్తి అమిత్ షా. తొలుత బీజేపీ అధ్యక్షుడుగాను, ఇప్పుడు కేంద్ర హోం మంత్రిగాను ప్రజాస్వామిక ప్రతిపక్షాలను ప్రభావ రహితంగా చేయడంలో అమిత్ షా ఒక కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రధానమంత్రి, అధికార పక్ష అభీష్టాలను నెరవేర్చేందుకు ఈయన ఎంత దూరమైనా పోతున్నారు. కేంద్రంలో మోదీ-షా రాజకీయ జుగల్ బందీని ఏడాదిన్నరపాటు చూసిన తరువాతనే 2015 డిసెంబర్‌లో ‘ఎన్నికలకు మాత్రమే పరిమితమవుతున్న ప్రజాస్వామ్యం’గా భారత్‌ను నేను అభివర్ణించాను. అయ్యో, ఎంత పొరపాటు! ఈ అభిప్రాయాన్ని మార్చుకోవల్సిన సమయమాసన్నమయింది. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం మరింతగా భ్రష్టమైపోయింది. ఎంతగా దిగజారిపోయిందంటే ఎన్నికలను సైతం అంతకంతకూ ఒక అల్ప వ్యవహారంగా చూచే దశకు చేరాము! స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకంటే అధోగతి మరేముంటుంది? 


కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సన్నిహిత సహచరులపై ఆదాయపు పన్ను శాఖ దాడులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జైపూర్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నంలో భాగంగా గెహ్లోత్ పై తిరుగుబాటుకు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రోద్బలిస్తున్న సమయంలో ఆ దాడులకు ఆదేశించడం గమనార్హం. అయితే దేశ పాలకపక్షం కుయుక్తులు ఇప్పటికి విఫలమయివుండొచ్చుగానీ అసలు కరోనా ఆపత్కాలంలో ఇటువంటి రాజకీయాలకు పాల్పడమేమిటి? రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య విలువలు, కార్యసరళిపట్ల మోదీ-షాలకు ఎంత తిరస్కార భావమున్నదో రాజస్థాన్ వ్యవహారం స్పష్టం చేశాయి. గత మార్చిలో మధ్యప్రదేశ్‌లోను, పోయినేడాది కర్ణాటకలోను సంభవించిన సంఘటనలే రాజస్థాన్‌లో ఇప్పుడు సంభవించాయి. ఈ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ ఆధ్వర్యం వహించని ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్, కర్ణాటకలో జనతాదళ్–-కాంగ్రెస్- అధికారంలోకి వచ్చాయి. కానీ, ఓటర్ల తీర్పును అలక్ష్యం చేసి, తాము అధికారంలోకి వచ్చేందుకు వీలుగా అధికార పక్ష ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడేందుకు లేదా శాసనసభ్యత్వానికి రాజీనామాచేసేందుకు బీజేపీ పురిగొల్పింది. 


తమకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల తీర్పును వమ్ముచేసేందుకు ఆ మూడు రాష్ట్రాలలోనూ అనైతిక, అప్రజాస్వామిక పద్ధతులను బీజేపీ అనుసరించింది. అయితే ఆ అక్రమాలు ఆ మూడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనవి కావు. గోవా, మణిపూర్‌లలో ఇండిపెండెంట్, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేలా పురిగొల్పారు. నరేంద్రమోదీ నాయకత్వం పట్ల విశ్వాసంతోను, హిందూత్వ భావజాలంతో ఏకీభావంతో వారు బీజేపీలో చేరారా? లేదు. ఆర్థిక, ఆర్థికేతర ప్రలోభాలే వారిని ప్రభావితం చేశాయని చెప్పక తప్పదు. అలాగే రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లోనూ, మరికొన్ని ఇతర రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వెనుక కూడా బీజేపీ అపార ఆర్థిక వనరుల ప్రభావం లేదంటారా? బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఈ శాసనసభ్యులకు ఎంత డబ్బు చెల్లించివుంటారు? అంచనాలు వేర్వేరుగా వున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అయితే బీజేపీలో చేరేందుకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని వెల్లడించారు. నాకు తెలిసిన పాత్రికేయులైతే ఆ మొత్తం ఇంకా అధికంగా ఉంటుందని ఘంటాపథంగా చెప్పారు. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఇచ్చివుండొచ్చని తెలిపారు. ఈ అక్రమ లావాదేవీలు ఒక మౌలిక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. శాసనసభ్యులను ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థిక ప్రలోభాలతో ఆకట్టుకుంటున్నప్పుడు అసలు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమిటి? ఆ బేరసారాలతో సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసిన లక్షలాది ఓటర్ల ప్రజాస్వామిక సంకల్పం పూర్తిగా నిరర్థకం కాలేదూ? స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ప్రజాస్వామిక ప్రక్రియగా భావింపబడుతున్న ఎన్నికల ఫలితాలను బీజేపీ తన అపార ఆర్థిక వనరులతో ఇలా అవహేళన చేస్తుంటే భారత్ తనను తాను ‘ఎన్నికలను మాత్రమే నిర్వహించే’ ప్రజాస్వామ్యంగా నైనా చెప్పుకోగలదా?


నరేంద్రమోదీ, ఇందిరాగాంధీని తలదన్నిన రాజకీయవేత్త అని పేర్కొన్నాను. ఇలా అనడంలో నా భావం ఆయన జిత్తుల మారి, నిర్దయగా వ్యవహరించే వ్యక్తి అని. ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచేందుకు ఇందిర ఖుర్పీ (తవ్వుగోల) ఉపయోగించగా మోదీ ఒక పదునైన ఖడ్గాన్ని ఉపయోగించారు. ఇందిర తన చర్యలు, నిర్ణయాలు, ముఖ్యంగా ఎమర్జెన్సీ విధింపు పై పునరాలోచన చేశారు. అయితే పశ్చాత్తాపం, అపరాధ భావం అనేవి నరేంద్ర మోదీ మనస్తత్వంలో ఏమాత్రంలేని గుణాలు. ఎన్నిలోపాలు ఉన్నప్పటికీ మత బహుళ వాదానికి చిత్తశుద్ధితో నిబద్ధమయిన విజ్ఞురాలు ఇందిరాగాంధీ. నరేంద్రమోదీ నిరంకుశ పాలకుడు మాత్రమే కాక అధిక సంఖ్యాకవర్గ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే రాజకీయ వాది కూడా. ఇందిరా గాంధీ అధికారంలో ఉన్న సంవత్సరాలలో భారత ప్రజాస్వామ్య సంస్థలు, విలువలకు ఎనలేని హాని జరిగింది. నెమ్మదిగానే అయినప్పటికీ అవి పునరుజ్జీవితమయ్యాయి. మన రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలకు పూర్తిగా ఊపిరి పోయకపోయినప్పటికీ, 1989-–2014 మధ్యకాలంలో భారత్ ఇంకా ఒక ప్రజాస్వామ్య రాజ్యం -(లోపభూయిష్టమూ, అపరిపూర్ణమూ అయినప్పటికీ-) గా పరిగణితమయింది. మరి నరేంద్ర మోదీ పాలనా కాలంలో భ్రష్టమైన భారత ప్రజాస్వామ్య సంస్థలూ, సంప్రదాయాలూ ఎప్పటికైనా పునరుద్ధరింపబడతాయా అన్నది ఇంకా ఒక సమాధానం లేని ప్రశ్న.

ఇందిర, మోదీ, ప్రజాస్వామ్య పతనం

gరామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.