సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-16T06:45:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో కూడిన సుపరిపాలనలో భాగంగా సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

సర్వతోముఖాభివృద్ధికి,  సంక్షేమానికి పెద్దపీట
నెల్లూరులోని పోలీస్‌పరేడ్‌ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు, కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఇతర అధికారులు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం కృషి

ప్రారంభానికి బ్యారేజీలు సిద్ధం

పురోగతిలో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు

10 భారీ పరిశ్రమలకు ప్రతిపాదన

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు

అంబరాన్నంటిన స్వాతంత్య్ర సంబరం


నెల్లూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో కూడిన సుపరిపాలనలో భాగంగా సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భగా సోమవారం ఉదయం 9.05 గంటలకు నెల్లూరులోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి  మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు ఈ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తోందన్నారు. గత ఏడాది వివిధ రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని మంత్రి  ఇలా వివరించారు. 

వ్యవసాయం : రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లాలో 2.05 లక్షల కుటుంబాలకు రూ.151 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద 401 గ్రూపులకు రూ.43 కోట్ల విలువైన యంత్రపరికరాలు సబ్సిడీ ధరకు ఇప్పించాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్‌లు నిర్మించాం. 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రూ.79.32 కోట్ల స్వల్పకాలిక, రూ.62.61 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాం. 

జలవనరుల శాఖ : నెల్లూరు నగరంలో రూ.87.73 కోట్లతో సర్వేపల్లి రిటైనింగ్‌వాల్స్‌, 9 కోట్లతో సర్వేపల్లి రిజర్వాయర్‌ పనులు చేపట్టాం. జాఫర్‌ కాలువ రక్షణ గోడ పనులు టెండర్ల దశ పూర్తయ్యింది. డేగపూడి-బండేపల్లి లింకు కెనాల్‌, పొట్టేళ్ల కాలువ ఫీడర్‌ ఛానెల్‌ నిర్మాణాలు రూ.26 కోట్లతో జరుగుతున్నాయి. దగదర్తి-రాళ్లపాడు, దగదర్తి-ముంగమూరు ఛానెల్‌ పనులు రూ.24 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయి. వెంకటాచలం మండలంలో సీఎం, సీడీ ప్రొటెక్షన్‌ పనులు రూ.16 కోట్లతో జరుగుతున్నాయి. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-2, ఉత్తర కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. పెన్నా, సంగం బ్యారేజీలు ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.  

మత్స్య శాఖ : బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. దీనివల్ల పదివేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. జిల్లాలో 10,689 మంది మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో  రూ.10వేలు చొప్పున రూ.10.68 కోట్లు పంపిణీ చేశాం. ఆక్వా రైతులకు విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు ఇస్తున్నాం. 

పశుసంవర్థక శాఖ : జంతు వ్యాధుల నిర్ధారణ లాబోరేటరీల ద్వారా వ్యాధుల నియంత్రణ చేస్తున్నాం. వైఎస్‌ఆర్‌ పశు నష్టపరిహారం పథకం ద్వారా 1,494 మంది పాడి రైతులకు రూ.4.11 కోట్ల పరిహారం చెల్లించాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా75 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. 40శాతం సబ్సిడీతో 414 గడ్డి కత్తిరించు యంత్రాలు సరఫరా చేశాం. 

జిల్లా గ్రామీణాభివృద్ధి : వైఎస్‌ఆర్‌ పింఛను పథకం ద్వారా ఈ ఏడాది కొత్తగా 38 వేల మందికి పింఛన్లు మంజూరు చేశాం. 30వేల స్వయం సహాయక సంఘాలకు 1,096 కోట్ల రుణాలు అందించాం. వైఎస్‌ఆర్‌ చేయూత పథకంలో లక్ష పదిహేనువేల మందికి రూ.190.41 కోట్ల ఆర్థిక సాయం చేశాం. జీవనోపాధిలో భాగంగా 11,825 మందికి రూ. 63.44 కోట్లతో గొర్రెలు, బర్రెల పెంపకానికి ఆర్థిక సాయం అందించాం. జగనన్న తోడు పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 16,842 మందికి రూ.10వేలు చొప్పున బ్యాంకు రుణాలు అందించాం. పేదలందరికి ఇల్లు పథకంలో 8,893 మందికి బ్యాంకుల ద్వారా రూ.31 కోట్ల రుణాలు ఇప్పించాం. వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం కింద రూ.43.91 కోట్ల రుణాలు మంజూరు చేశాం.

వైద్యం, ఆరోగ్యం : ఆరోగ్యశ్రీ పథకం కింద 67వేల మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా 61వేల మంది గర్బిణులకు ఆర్థిక సాయం అందించాం. శిశుమరణాల రేటును తగ్గించడంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్ని ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం. 100 శాతం కొవిడ్‌ వాక్సినేషన్‌ పూర్తి చేశాం. 

పరిశ్రమలు : జిల్లాల 10 భారీ పరిశ్రమలకు ప్రతిపాదించబడ్డాయి. క్రిబ్కో, కాంకర్‌, మిథాని వంటి భారీ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో తగిన సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. రూ.4వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమయ్యే ఈ పరిశ్రమల ద్వారా 3,700 మందికి ఉపాధి లభించనుంది. 95 ఎకరాల విస్తీర్ణంలో యం.ఏ.సీ-సి.డి.పి పథకం కింద 9 కిలోమీటర్ల పొడవునా ఆటోనగర్‌లో ఇండ్రస్టియల్‌ హబ్‌ ఏర్పాటు చేశాం.  ఆత్మకూరు నియోజకవర్గంలో ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమల కోసం 174 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటు చేశాం. 

పోలీస్‌ శాఖ : పోలీసు శాఖ సేవలతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. కేసుల పురోగతి వేగంగా సాగుతోంది. ఏడు లక్షల పైచిలుకు దిశ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి మహిళలకు భద్రత కల్పిస్తున్నాం. రెండు విడతలుగా జరిగిన లోక్‌ అదాలత్‌ 16,121 కేసులు పరిష్కరించబడ్డాయి. జిల్లావ్యాప్తంగా 10,126 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేర నియంత్రణ, పరిశోధనలకు పటిష్ట చర్యలు తీసుకున్నా’’మని ఇన్‌చార్జి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జేసీ కూర్మనాథ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, కార్పొరేషన్‌ కమిషనర్‌ హరిత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్‌ రంగారెడ్డి, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.   


ఆకట్టుకున్న ప్రదర్శనలు

అబ్బుర పరిచిన విద్యార్థుల నృత్యం

నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 15 : రంగు రంగుల జెండా ప్రతి భారతీయుడికి అండ.. సారే జహాసే అచ్ఛా... వందేమాతరం వందేమాతరం... అంటూ దేశభక్తి గీతాలతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం పోలీసు పరేడ్‌ మైదానంలో వేడుకగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో, దేశభక్తిని పెంపొందించే గీతాలకు నృత్యాలు, పిరమిడ్స్‌, దేశ నాయకుల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలో మొదటి స్థానం సాధించిన దర్గామిట్ట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్‌ ఘర్‌ తిరంగా పిరమిడ్స్‌లో చేసిన నృత్య ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా వందేమాతరం అంటూ 100 మంది విద్యార్థులతో చేసి జాతీయ సమైక్యతో ప్రదర్శన చేసి ద్వితీయ స్థానం సాధించారు. కొత్తూరు  కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు  తృతీయ స్థానంలో నిలిచారు. 

ఉగ్రవాదుల కిడ్నాప్‌ను భగ్నం చేయడం అనే అంశంపై పోలీసు స్పెషల్‌ కమాండోలు ప్రదర్శించిన సాహస రూపకం ప్రేక్షకులను మైమరపించింది. ప్రజలను కలిసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి అడవిలో పురాతన భవనంలో దాస్తారు. ప్రజా ప్రతినిధిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తీసుకొచ్చేందుకు పోలీసు కమాండోలు చేసిన విన్యాసం ఆహా అనిపించింది. 


ప్రగతిని చాటిన శకటాలు

పోలీసు పెరేడ్‌ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు  రూపొందించిన శకటాలు ఆకట్టుకున్నాయి. డీఆర్‌డీఏ శకటానికి ప్రథమ స్థానం, సమగ్ర సర్వశిక్ష అభియాన్‌ శాఖకు ద్వితీయ స్థానం, వ్యవసాయ శాఖ ప్రగతి రథానికి మూడవ స్థానాలతోపాటు వైద్య ఆరోగ్య శాఖ శకటానికి ప్రత్యేక బహుమతి లభించింది. 

స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను  ఇన్‌చార్జ్‌ అంబటి రాంబాబు శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. 


ఆకట్టుకున్న సైకత శిల్పం

దేశ సమైక్యతతోపాటు అన్ని మతాలు ఒకటేనన్న సందేశంతో చిల్లకూరుకు చెందిన సనత్‌కుమార్‌ రూపొందించిన సైతిక శిల్పం ఆకట్టుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కైట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాసులు  త్రివర్ణాలతో భారీ పతంగం తయారు చేసి ఈ మైదానంలో ప్రదర్శించారు. 

 


==========



Updated Date - 2022-08-16T06:45:04+05:30 IST