ఇండిగో విమానం కార్గో ఏరియాలో నిద్రపోయిన లోడర్.. అబుదాబిలో తేలాడు!

ABN , First Publish Date - 2021-12-14T23:30:01+05:30 IST

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖం ఎరుగదని అంటారు. పాపం! అతగాడికి అప్పుడే నిద్ర ముంచుకురావాలా?..

ఇండిగో విమానం కార్గో ఏరియాలో నిద్రపోయిన లోడర్.. అబుదాబిలో తేలాడు!

న్యూఢిల్లీ: ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖం ఎరుగదని అంటారు. పాపం! అతగాడికి అప్పుడే నిద్ర ముంచుకురావాలా? కంటిమీదకు వచ్చిన కునుకును తమాయించుకోలేక చిన్నపాటి కునుకు తీద్దామని కళ్లు మూశాడు.. అంతే కళ్లు తెరిచి చూసేసరికి అబుదాబి తేలాడు.


ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన లోడర్.. ముంబై-అబుదాబి విమానంలో లగేజీని లోడ్ చేస్తూ కార్గో కంపార్ట్‌మెంట్‌లో నిద్రపోయాడు. అబుదాబిలో విమానం ల్యాండయ్యాక లోపల అతడిని చూసిన సిబ్బంది విస్తుపోయారు. ఆదివారం ఈ ఘటన జరగ్గా, తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. 

 

విమానంలో లోడర్లు బ్యాగేజీని లోడ్ చేస్తున్న సమయంలో వారిలో ఒక వ్యక్తి నిద్రపోయాడు. ఆ తర్వాత డోర్లు మూసుకుపోయాయి. లోడర్‌కు మెలకువ వచ్చే సరికి విమానం ముంబై విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచింది. విమానం అబుదాబిలో ల్యాండయ్యాక అతడిని చూసిన సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయారు.


ఆ తర్వాత తేరుకుని అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి మానసిక, శారీరక పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు గుర్తించారు. ముంబై అధికారుల నుంచి అందిన విజ్ఞప్తులతో లోడర్‌ను అదే విమానంలో ప్రయాణికుడిలా వెనక్కి పంపించారు.  

Updated Date - 2021-12-14T23:30:01+05:30 IST