‘ఆత్మ’కు నిరాధరణ

ABN , First Publish Date - 2022-05-26T05:43:47+05:30 IST

వ్యవసాయరంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారిని చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) క్రమంగా నిరాధరణకు గురవుతోంది. రైతులకు పంటల సాగు, నూతన దిగుబడి, ఆధునిక వంగడాలు, సాంకేతిక విధానాలపై అవగాహన కల్పించడంలో ఆత్మ అధికారులు కీలకపాత్ర పోషిస్తుంటారు. అయితే అవి ఎక్కడా మచ్చుకైనా కానరావడం లేదు. ఏటా ఈ పథకం లక్ష్యం నిర్ధేశించుకున్నా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక నిరాదరణకు గురవుతున్నది.

‘ఆత్మ’కు నిరాధరణ

జిల్లాలో సాగుపై సలహాలు, సూచనలు అంతంతే

యంత్రాల వినియోగంపై అవగాహన కరువు

అరకొర నిధులు.. సిబ్బంది జీతాలకే సరి


సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 25: వ్యవసాయరంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారిని చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) క్రమంగా నిరాధరణకు గురవుతోంది. రైతులకు పంటల సాగు, నూతన దిగుబడి, ఆధునిక వంగడాలు, సాంకేతిక విధానాలపై అవగాహన కల్పించడంలో ఆత్మ అధికారులు కీలకపాత్ర పోషిస్తుంటారు. అయితే అవి ఎక్కడా మచ్చుకైనా కానరావడం లేదు. ఏటా ఈ పథకం లక్ష్యం నిర్ధేశించుకున్నా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక నిరాదరణకు గురవుతున్నది.


ఆత్మ అవగాహన ఇలా..

ఆత్మ స్కీమ్‌ను జిల్లాలో 2014 - 15లో అప్‌డేషన్‌ చేశారు. అందుకు ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా ఉంటారు. గతంలో డివిజన్‌స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి యంత్రాలతో ప్రదర్శనలు నిర్వహించి రైతులకు సాంకేతికతపై అవగాహన కల్పించాలి. సమగ్ర వ్యవసాయ సహకారిగా తోడ్పడే పశు సంవర్ధకశాఖ, ఉద్యానవనశాఖ, చేపల పెంపకం వంటి శాఖల్లో సాంకేతికంగా వచ్చే అనేక మార్పులకు సంబంధించిన అంశాలు అధికారులు వివరించాల్సి ఉంటుంది.  ఏటా లక్ష్యాన్ని నిర్ధేంచుకుని వ్యవసాయంలో సాంకేతికతను పెంపొందించే దిశగా పనిచేస్తుంది. దీనికి ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తోంది.


నిధుల లేమితో నిర్లక్ష్యం

 సిద్దిపేట జిల్లాలో 9 ఏపీఎంలు, ఐదుగురు బీటీఎంలు, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌, హుస్నాబాద్‌ డివిజన్‌లో ముగ్గురు పనిచేస్తున్నారు. సదరు విభాగానికి నిధులు లేక, వివిధ పంటలపై శిక్షణ ఇచ్చే అధికారులకు జీతాలు రాకపోవడంతో రైతులకు సరైన సేవలు అందడంలేదు. 2019-20లో సుమారు రూ.62 లక్షల నిధులను కేటాయించగా అందులో సగానికిపైగా అధికారుల జీతాలకే సరిపోయాయి. 2020-21లో సుమారు రూ.50 లక్షలు రాగా జీతాలకు పోను మిగిలింది అరకొరే. ఇక 2021-22లో సమయానికి నిధులు విడుదల కాకపోతే అధికారులు జీతాలకు నోచుకోలేదు. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ మాట్లాడుతూ ఆత్మలో పనిచేస్తున్న సిబ్బందికి పది నెలలుగా జీతాలు అందడం లేదని ఇటీవలే నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జీతాలు అందజేసి ఆత్మ యాక్షన్‌ ప్రణాళిక తయారు చేసి కమిషనరేట్‌కు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


అన్నదాతలకు అవగాహన లేమి..

వ్యవసాయరంగం అభివృద్ధి సాధించాలంటే రైతులు అధునాతన విజ్ఞానం కలిగి ఉండాలి. అందుకు ఆధునిక యంత్రాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి. కానీ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఆత్మ పథకం ఉందన్న విషయమే జిల్లాలోని చాలా మండలాల రైతులకు తెలియకుండా పోతోంది. గ్రామగ్రామాన తిరిగి రైతులకు సాంకేతికతపై అనేక విషయాలపై తెలియజేయాల్సిన అధికారులు ఎక్కడో ఓ సారి ఏదో ఓ గ్రామంలో పది మంది రైతులను కూర్చోబెట్టి సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. జిల్లాలో దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి.  రైతులకు సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. దీనికోసం ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ రైతులను చైతన్యవంతం చేసేందుకు సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. అయితే ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో ఏడాదిగా నామమాత్రంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. యంత్రాలు కొనుగోలు చేసినా వాటిపై అవగాహన కల్పించే వారే కరువయ్యారని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2022-05-26T05:43:47+05:30 IST