చెదిరిన బంగారు కల

ABN , First Publish Date - 2021-08-04T09:33:38+05:30 IST

అప్పుడెప్పుడో 1980లో భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇన్నాళ్లకు నాటి వైభవం దిశగా అడుగులు పడేలా పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌ చేరి అదరహో...

చెదిరిన బంగారు కల

  • పురుషుల హాకీ జట్టుకు నిరాశ 
  • సెమీ్‌సలో బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి
  • రేపు కాంస్య పతక పోరులో జర్మనీతో ఢీ

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరి ఆశలు రేపిన భారత పురుషుల హాకీ జట్టు ఆఖరుకు నిరాశే మిగిల్చింది. ఫైనల్‌ చేరడంలో విఫలమై బంగారు పతకానికి రెండడుగుల దూరంలో ఆగిపోయింది. ప్రపంచ చాంపియన్‌ బెల్జియంతో పోరులో మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం పోరాడి ఓడింది. ఇక ఆశలన్నీ కాంస్యంపైనే. గురువారం జరిగే కంచు పతక పోరులో జర్మనీతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు మంగళవారం బరిలోకి దిగిన మిగతా భారత అథ్లెట్లలో షాట్‌పుటర్‌ తజిందర్‌ పాల్‌, మహిళా జావెలిన్‌ త్రోయర్‌ అన్నూరాణి తమ ఈవెంట్లలో ఫైనల్‌ కూడా చేరకుండానే వెనుదిరగగా.. రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ ఆరంభ బౌట్‌లోనే ఓటమిపాలై ఇంటిబాట పట్టింది.



టోక్యో: అప్పుడెప్పుడో 1980లో భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇన్నాళ్లకు నాటి వైభవం దిశగా అడుగులు పడేలా పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌ చేరి అదరహో అనిపించింది. అదే జోరులో ఫైనల్‌ బెర్త్‌ ఖాయమవుతుందనుకుంటే అసలైన పోరులో మనోళ్లు చేతులెత్తేశారు. మంగళవారం జరిగిన కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 2-5 గోల్స్‌తో ప్రపంచ విజేత, రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. భారత జట్టులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (7వ నిమిషం), మన్‌దీప్‌ సింగ్‌ (8వ) చెరో గోల్‌ సాధించారు. బెల్జియం తరఫున అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (19వ, 49వ, 53వ) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టి భారత్‌ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. లూయిక్‌ లూపర్ట్‌ (2వ), జాన్‌ జాన్‌ డామెన్‌ (60వ) చెరో గోల్‌ చేశారు. 


ఆరంభంలో అదరగొట్టి.. ఆఖర్లో చిత్తయి..

పూర్తి జోష్‌తో మైదానంలోకి అడుగుపెట్టిన భారత కుర్రాళ్లు అందుకు తగ్గట్టే ఆరంభంలో ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తొలి క్వార్టర్‌లో పూర్తిస్థాయిలో సత్తాచాటారు. మ్యాచ్‌ మొదలైన రెండో నిమిషంలోనే లూపర్ట్‌ పెనాల్టీ కార్నర్‌ గోల్‌తో బెల్జియంకు శుభారంభం అందించాడు. ఏడో నిమిషంలో భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 1-1తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాతి నిమిషానికే మన్‌దీప్‌ సింగ్‌ చేసిన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత డిఫెన్స్‌లో తడబాటుకు గురైన భారత్‌ ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను అందించింది. 19వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను బెల్జియం స్టార్‌ హెండ్రిక్స్‌ గోల్‌గా మలచడంతో ఇరుజట్ల స్కోరు 2-2తో సమమైంది. మూడో క్వార్టర్‌లో భారత్‌ బాగానే పోరాడింది. బంతిని నియంత్రణలో ఉంచుకుంటూ గోల్స్‌ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, బెల్జియం ఆటగాళ్లు కూడా అంతేదీటుగా బదులివ్వడంతో గోల్‌ లేకుండానే ఆ క్వార్టర్‌ ముగిసింది. ఇక, ఉత్కంఠగా సాగిన ఆఖరి క్వార్టర్‌లో బెల్జియం అనూహ్యంగా విజృంభించింది. టీమిండియా పెనాల్టీ తప్పిదాలను అవకాశంగా మలచుకుంటూ చివరి పదిహేను నిమిషాల్లోనే మూడు గోల్స్‌ కొల్లగొట్టడం విశేషం. బెల్జియంకు 49వ నిమిషంలో వరుసగా లభించిన మూడు పెనాల్టీ కార్నర్లలో ఒకదాన్ని హెండ్రిక్స్‌ గోల్‌గా మలిచాడు. నాలుగు నిమిషాలకే హెండ్రిక్స్‌ మరో పెనాల్టీని గోల్‌ కొట్టడంతో బెల్జియం 4-2తో ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక, ఆఖర్లో ఒత్తిడికి లోనైన టీమిండియా.. గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ను మైదానంలోకి దింపినా ఫలితం లేకపోయింది. చివరి నిమిషంలో బెల్జియం ఆటగాడు డోమెన్‌ బంతిని నేరుగా నెట్‌లోకి పంపడంతో ఆ జట్టు భారీ ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3-1తో జర్మనీని ఓడించి బెల్జియంతో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. 


అథ్లెటిక్స్‌

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లోనూ భారత అథ్లెట్లకు చుక్కెదురైంది. పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. 21.49 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో ఆసియా రికార్డును కలిగిన తజిందర్‌పాల్‌.. టోక్యోలో 19.99 మీటర్లకే పరిమితమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 13వ స్థానంలో నిలిచి పైనల్‌ కూడా చేరలేకపోయాడు. మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూరాణి 54.04 మీటర్లు మాత్రమే త్రో చేసి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. 


రెజ్లింగ్‌

తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన భారత యువ రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ పోరాడి ఓడింది. మహిళల 62 కిలోల విభాగం తొలి రౌండ్లో మంగోలియా రెజ్లర్‌ బొలొర్తుయా ఖురెల్కు చేతిలో పరాజయంపాలైంది. తొలి మూడు నిమిషాల్లోనే 2-0తో ఆధిక్యంలోకెళ్లిన సోనమ్‌.. ఆ తర్వాత అటాకింగ్‌ తగ్గించి డిఫెన్స్‌కు పరిమితమైంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ప్రత్యర్థి ఆఖరి 35 సెకన్లలో రెండు పాయింట్లు సాధించి 2-2తో స్కోరు సమం చేసింది. అయితే, చివరి పాయింట్‌ను బొలొర్తుయా సాధించడంతో జడ్జిలు ఆమెనే విజేతగా ప్రకటించారు.   

Updated Date - 2021-08-04T09:33:38+05:30 IST