ఆ 11 మందే లక్ష్యంగా..!

ABN , First Publish Date - 2022-07-07T08:16:54+05:30 IST

టెస్ట్‌ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ధనాధన్‌ క్రికెట్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం జరగనుంది.

ఆ 11 మందే లక్ష్యంగా..!

బరిలోకి రోహిత్‌ 

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ తొలి టీ20

రాత్రి 10.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో...


సౌతాంప్టన్‌: టెస్ట్‌ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ధనాధన్‌ క్రికెట్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం జరగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ప్రయోగాలు చేసిన టీమిండియా మేనేజ్‌మెంట్‌.. ఇక తుది 11 మందిని గుర్తించడంపైనే దృష్టి సారించనుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టనుండడం కొంత సానుకూలాంశం. అయితే, బర్మింగ్‌హామ్‌ టెస్ట్‌ ఆడిన కోహ్లీ, జడేజా, బుమ్రా, శ్రేయాస్‌, పంత్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి నివ్వగా.. రెండో టీ20 నుంచి వీరు అందుబాటులోకి రానున్నారు. దీంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడిన ఎక్కువ మంది సభ్యులకు తొలి టీ20 తుది జట్టులో చోటు దక్కనుంది. వరల్డ్‌ ప్రాబబుల్స్‌లో చోటు ఆశిస్తున్న సంజూ, దీపక్‌ హుడాతోపాటు పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను మేనేజ్‌మెంట్‌ పరిశీలించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్‌ సత్తా చాటాలనుకుంటున్నాడు.


ఐర్లాండ్‌తో రెండో టీ20లో ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్‌ చేసి భారత్‌ను గెలిపించిన పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండగా.. భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది. చాహల్‌ స్థానంలో బిష్ణోయ్‌కు చాన్స్‌ దక్కొచ్చు. మరోవైపు మోర్గాన్‌ రిటైర్మెంట్‌తో జోస్‌ బట్లర్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ ఘనంగా ఆరంభించాలనుకుంటోంది. బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టోలకు విశ్రాంతి నిచ్చినా.. మలన్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీతో బలంగా ఉంది. 



పిచ్‌/వాతావరణం

వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. బౌలర్లకు సహకారం అంతంత మాత్రమే. ఆకాశం మేఘావృతమైనా.. వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. 


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌, చాహల్‌/బిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/అర్ష్‌దీప్‌ సింగ్‌. 

ఇంగ్లండ్‌: జాసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, హ్యారీ బ్రూక్స్‌, సామ్‌ కర్రాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, తైముల్‌ మిల్స్‌, డేవిడ్‌ విల్లే/రీస్‌ టాప్లే, మాథ్యూ పార్కిన్సన్‌. 


Updated Date - 2022-07-07T08:16:54+05:30 IST