తొలి కిసాన్ పార్శిల్ రైలు పరుగులు శుక్రవారం నుంచి

ABN , First Publish Date - 2020-08-06T20:44:13+05:30 IST

భారత దేశపు తొలి కిసాన్ స్పెషల్ పార్శిల్ రైలు శుక్రవారం నుంచి సేవలు ప్రారంభిస్తుంది.

తొలి కిసాన్ పార్శిల్ రైలు పరుగులు శుక్రవారం నుంచి

న్యూఢిల్లీ : భారత దేశపు తొలి కిసాన్ స్పెషల్ పార్శిల్ రైలు శుక్రవారం నుంచి సేవలు ప్రారంభిస్తుంది. మహారాష్ట్రలోని దేవ్‌లాలీ నుంచి బిహార్‌లోని దానాపూర్ వరకు ఇది ప్రయాణిస్తుంది. దీనిలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. 


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ రైలును ప్రారంభిస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కిసాన్ రైలు ప్రాజెక్టు గురించి చెప్పిన సంగతి తెలిసిందే. 


ఈ రైలు దేవ్‌లాలీలో శుక్రవారం ఉదయం 11 గంటలకు బయల్దేరుతుంది, శనివారం సాయంత్రం 6.45 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. 1519 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కూరగాయలు, పండ్లు రవాణా చేస్తూ, కొన్ని స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 10 బోగీలు ఉంటాయి. 


దేవ్‌లాలీ, నాసిక్ రోడ్డు, మన్మాడ్, జలగావ్, భుసావల్, బుర్హాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నగర్, బక్సర్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. 


నాసిక్‌లో కూరగాయలు, పండ్లు, పూలు విస్తారంగా పండుతాయి. వీటిని ఈ రైలు ద్వారా పాట్నా, ప్రయాగ్‌రాజ్, కట్ని సహా ఉత్తరాదికి పంపిస్తారు. 


అత్యంత త్వరగా చెడిపోయే ఆహార పదార్థాల రవాణాకు రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ వ్యాన్లను భారతీయ రైల్వేలు సమకూర్చుకున్నాయి. ప్రస్తుతం 9 రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో రవాణాకు సాధారణ వ్యాన్లకు వసూలు చేసే ఛార్జీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. 


Updated Date - 2020-08-06T20:44:13+05:30 IST