తొలి టీకా వేయించుకున్న మనీష్ ఏం చెప్పారంటే...!

ABN , First Publish Date - 2021-01-16T20:09:43+05:30 IST

భారతదేశంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తిగా మనీష్ కుమార్..

తొలి టీకా వేయించుకున్న మనీష్ ఏం చెప్పారంటే...!

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తిగా మనీష్ కుమార్ నిలిచారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ ముందుగా టీకా వేయించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో ఆయనకు తొలి టీకా వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తన అనుభవాన్ని మనీష్ కుమార్ మీడియాకు వివరించారు. "చాలా మంచి అనుభవం ఇది. వాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎవరూ భయపడవద్దు. అందరూ టీకాలు వేయించుకోవచ్చు'' అని ఆయన అన్నారు.


ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ సైతం వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా వేయించుకోవడం ద్వారా వారు టీకాపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం చేసి, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్ర్రారంభించారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. చరిత్రలోనే ఇంతపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎన్నడూ జరగలేదన్నారు. ప్రపంచంలో 3 కోట్ల కంటే తక్కువ ఉన్న దేశాలు 100కు పైగా ఉండగా, ఒక్క ఇండియాలో తొలి దశలోనే 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. రెండో దశలో ఈ సంఖ్య 30 కోట్లకు చేరుతుందన్నారు.


రెండు డోస్‌లు తప్పనిసరి...

ప్రజలు తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలన్నారు. తొలి డోస్ తీసుకున్న తర్వాత మాస్క్ తీసేయడం, సామాజిక దూరం పాటించకపోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని, రెండో డోస్ తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పారు.

Updated Date - 2021-01-16T20:09:43+05:30 IST